Tirupati city
-
తిరుపతి పాత పేర్లు తెలుసా? ఆ ఆధ్యాత్మిక నగరం ఆవిర్భవించింది నేడే!
తిరుమలను తలచుకుంటే.. గోవింద నామం మనస్సులో మార్మోగుతుంది. కలియుగ ప్రత్యక్ష దైవం మనో నేత్రం ఎదుట ప్రత్యక్షమవుతారు. ఏడు కొండలవాడు కొలువైన తిరుమల ఆలయంతోపాటు ఆయన పాదాల చెంత ఉన్న తిరుపతి నగరం ఆవిర్భావమూ ఆసక్తికరమే. కలియుగం (కలియుగం మొదలై ఫిబ్రవరి 13వ తేదీ నాటికి 5,125 ఏళ్లు పూర్తయింది)లో శ్రీనివాసుడు ఏడు కొండలపై శిలారూపంలో కొలువుదీరగా.. ఆ స్వామిని కొలిచే భక్తుల ఆవాసాల కోసం ఏడు కొండల దిగువన తిరుపతి వెలసింది. పూర్వం తిరుమల చుట్టూ అడవులు, కొండల నడుమ అలరారే శ్రీవారి ఆలయం మాత్రమే ఉండేది. భక్తులు క్రూర జంతువుల భయంతో గుంపులుగా కాలినడకన తిరుమల యాత్ర చేసేవారు. పూర్వం శ్రీవారి బ్రహ్మోత్సవాల నిర్వహణ, ధ్వజారోహణం మాత్రమే తిరుమల కొండపై నిర్వహించేవారు. వాహన సేవలన్నీ తిరుచానూరులోనే నిర్వహించేవారు. ప్రతిరోజూ తిరుచానూరు నుంచి తిరుమలకు వెళ్లి రావటం ఇబ్బందిగా ఉండటంతో అర్చకులు కపిల తీర్థం వద్ద నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. ఆ ప్రాంతం పేరు కొత్తూరు, కోటవూరుగా పిలిచేవారు. – (సాక్షి, ఏపీ నెట్వర్క్) రామానుజాచార్యులచే శంకుస్థాపన శ్రీనివాసుని పూజా కైంకర్యాలను వైఖానస సంప్రదాయంలో కొనసాగించాలని నిర్దేశించిన జగద్గురువు రామానుజాచార్యులు అర్చకుల నివాసాల కోసం తిరుచానూరు–తిరుమల మధ్య నేటి పార్థసారథి ఆలయ ప్రాంతాన్ని ఎంపిక చేశారు. శ్రీరంగం నుంచి శ్రీరంగనాథస్వామి శిలావిగ్రహాన్ని తెప్పించి పార్థసారథి సన్నిధికి పక్కన ప్రతిష్టించేందుకు ఆలయాన్ని నిర్మించారు . ఆ విగ్రహాన్ని తరలించే సమయంలో స్వల్పంగా దెబ్బ తినటంతో దాన్ని పక్కన పెట్టి.. ఆ ఆలయంలో గోవిందరాజస్వామిని తిరుమలేశుని ప్రతిరూపంగా ప్రతిష్టించారు. పక్కనపెట్టిన రంగనాథస్వామి విగ్రహం ప్రస్తుతం మంచినీళ్ల కుంట ఒడ్డున దర్శనమిస్తోంది. ఆ తర్వాత 1130వ సంవత్సరం ఫిబ్రవరి 24వ తేదీన గోవిందరాజస్వామి ఆలయం నాలుగు వైపులా మాడ వీధులు, అందులో అర్చకుల నివాసాలకు రామానుజాచార్యులు శంకుస్థాపన చేశారు. ఆ బ్రాహ్మణ అగ్రహారాన్నే తర్వాత గోవిందపట్నంగా.. రామానుజపురంగా పిలిచేవారు. ఆ తరువాత 1220–40 మధ్యకాలం నుంచి తిరుపతిగా పేరొందింది. అప్పటినుంచి తిరుపతిలో ఆవాసాలు, ఆలయాలు పెరుగుతూ వచ్చి ఆధ్యాత్మిక నగరంగా రూపుదిద్దుకుంది. 120 సంవత్సరాల సుదీర్ఘ జీవితాన్ని గడిపిన రామానుజాచార్యులు మూడుసార్లు తిరుమలకు వచ్చారని ఆధారాలను బట్టి తెలుస్తోంది. ఆయన తన 112వ ఏట గోవిందరాజస్వామి విగ్రహ ప్రతిష్ఠ, మాడ వీధులకు శంకుస్థాపన చేశారు. దీని ప్రకారం తిరుపతి ఆవిర్భవించి ఈ నెల 24వ తేదీకి 893 సంవత్సరాలు అవుతోంది. వెలుగులోకి తెచ్చిన భూమన వెలుగుచూసిన అంశాలపై తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి సమగ్ర అధ్యయనం చేయించి 2022 ఫిబ్రవరి 24న తొలిసారిగా తిరుపతి 892వ ఆవిర్భావ దినోత్సవం నిర్వహించారు. ఈ ఏడాది టీటీడీ, తిరుపతి నగరపాలక సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో 893వ పుట్టిన రోజు వేడుకను ఘనంగా నిర్వహించనున్నట్టు భూమన ప్రకటించారు. ఆ వేడుకల్లో భాగంగా నగర వాసులందరూ భాగస్వాములయ్యే విధంగా ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించడంతో పాటు నాలుగు మాడవీధుల్లో మహా ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. పరమ పవిత్రం తిరుపతి ఆధ్యాత్మిక నగరమైన తిరుపతి పరమ పవిత్రమైనది. ముక్కోటి దేవతలు శ్రీగోవిందరాజస్వామిని కొలుస్తారు. ఇక్కడ స్థానికులతో పాటు అనేక మంది వివిధ ప్రాంతాల నుంచి వచ్చి స్థిరపడిన వారు ఉన్నారు. తిరుపతి ప్రాముఖ్యత గురించి తెలియజేయాలన్నదే నా తపన. ప్రతి ఒక్కరూ నగర ప్రాభవాన్ని కాపాడుకోవాలి. తిరుపతి వైభవాన్ని చాటిచెబుదాం. శ్రీవారి నిలయమైన తిరుపతి ఆవిర్భావ వేడుకలను కలిసిమెలసి జరుపుకుందాం. – భూమన కరుణాకరరెడ్డి, ఎమ్మెల్యే, తిరుపతి -
టీటీడీకి చెందిన డిగ్రీ కళాశాలలో ర్యాగింగ్
తిరుపతి: తిరుపతిలోని టీటీడీకి చెందిన ఎస్జీఎస్ డిగ్రీ కళాశాలలో బుధవారం ర్యాగింగ్ వెలుగులోకి వచ్చింది. డిగ్రీ విద్యార్థి ప్రణయ్‌ను సీనియర్లు మంగళవారం ర్యాగింగ్ పేరిట వేధించారు. దాంతో సదరు జూనియర్ విద్యార్థి జరిగిన విషయాన్ని తన తల్లిదండ్రులకు తెలిపారు. దాంతో ప్రణయ్‌తోపాటు అతడి తల్లిదండ్రులు కళాశాల ప్రిన్సిపల్‌కు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై విచారణ జరిపి సీనియర్లపై చర్యలు తీసుకుంటామని ప్రిన్సిపల్ ప్రణయ్ తల్లిదండ్రులకు హామీ ఇచ్చారు. -
రాయలసీమలో తాగునీటికి కటకట
సాక్షి ప్రతినిధి, తిరుపతి: రాయలసీమ జిల్లాలోని నగరాలు, పట్టణాల్లో నీటి సమస్య రోజురోజుకూ తీవ్రతరమవుతోంది. కొన్ని ప్రాంతాల్లో వారానికి ఒకసారి కూడా నీరు రాక పోవడంతో నగరవాసులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. 11 మున్సిపాలిటీల్లో తాగునీటి సమస్య జఠిలంగా మారింది. ఈ సమస్యను ప్రయివేటు వ్యాపారులు సొమ్ముచేసుకుంటున్నారు. తీవ్ర నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాలు.... తిరుపతి, చిత్తూరు కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు సంబంధించి చిత్తూరు జిల్లాలో మదనపల్లె, పుంగనూరు, నగరి. వైఎస్సార్ జిల్లాలో బద్వేలు, ప్రొద్దుటూరు, అనంతపురం జిల్లాలో హిందుపురం, గుత్తి, పామిడి. కర్నూలు జిల్లాలో గుడూరు, నందికొట్కూరు, ఆత్మకూరులో సమస్య తీవ్రంగా ఉన్నట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. మిగిలిన చోట్ల కూడ నాలుగు, ఐదు రోజులకు కూడా నీరు విడుదల కాక పోవడంతో ప్రజలు నీటిని కోనుగోలు చేయాల్సివస్తోంది. తిరుపతిలో తీవ్రమైన నీటి సమస్య... తిరుపతి నగరవాసులు ఎన్నడూలేని విధంగా నీటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వెయ్యి అడుగుల లోతు బోర్లు తవ్వినా నీరు దొరకని పరిస్థితులు నెలకొన్నాయి. బైరాగి పట్టెడ, ఎంఆర్‌పల్లె, జీవకోన, శివజ్యోతినగర్, భవానీనగర్ ప్రాంతాల్లో ప్రస్తుతం నీటి ట్యాంకులే దిక్కుయ్యాయి. ఈ ప్రాంతంలోని చాలామంది ఇళ్లు ఖాళీ మంగళం తదితర ప్రాంతాలకు వెళుతున్నారు. దీంతో అక్కడ అద్దెలు విపరీతంగా పెంచేశారు. తిరుపతికి ప్రతిరోజూ సరాసరిన 80వేల నుంచి 90వేల మంది ఇతర ప్రాంతాలనుంచి వస్తుండటం, తగినమేర నీటి సరఫరా జరగకపోడంతో అందరికి ఇబ్బందులు తప్పడం లేదు. ఇళ్లు మారలేని పరిస్థితులు ఉన్నవారు ప్రయివేటు ట్యాంకర్ల నీటిని కొనుగోలు చేస్తున్నారు. దీనికి తోడు కడప, అనంతపురం, చిత్తూరు, కార్పొరేషన్ పరిధిలోని కొన్ని కాలనీల్లో సైతం నీరుదొరకక ప్రజలు తీవ్ర అవస్థ పడుతున్నారు. మునుపెన్నడూ ఇంత సమస్య రాలేదు గత 12సంవత్సరాలుగా తిరుపతిలోని వరదరాజనగర్‌లో నివాసం ఉంటున్నాం. ఎంత వేసవికాలంలోనూ మా కాలనీలో తాగునీటి సమస్య రాలేదు. ఒకటి రెండు రోజులు మున్సిపాలిటీ నీళ్లు రాకపోయినా, మా ఇంట్లో వేసుకున్న బోరులో నీళ్లు పుష్కలంగా ఉండేవి. ఈ ఏడాది బోర్లలో నీరు ఇంకిపోయాయి. దీనికితోడు వారానికి ఒక్కరోజు కూడా కార్పొరేషన్ నీళ్లు రావడం లేదు. దీంతో తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. వాటర్ ట్యాంకుల ద్వారా నీళ్లు తెప్పించుకుందామంటే ఒక ట్యాంకర్ రూ. 600నుంచి రూ.800 వరకు డిమాండ్ చేస్తున్నారు. - ఎం.తులసీ, వరదరాజనగర్, తిరుపతి -
పెంటావాలెంట్ వ్యాక్సినేషన్ ప్రారంభించిన బాబు
తిరుపతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ . చంద్రబాబు నాయుడు పెంటావాలెంట్ వ్యాక్సినేషన్‌ను గురువారం తిరుపతిలో ప్రారంభించారు. ఈ వ్యాక్సినేషన్‌తో చిన్నారులకు ఐదు ప్రాణాంతక వ్యాధుల నుంచి రక్షణ కలుగుతుందని తెలిపారు. శిశు మరణాలను తగ్గించేందుకు తమ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఆయన అన్నారు. చిన్న పిల్లల విషయంలో జాగ్రత్తలు తీసుకోకుంటే ప్రమాదమని ఆయన హెచ్చరించారు. గర్భిణీలకు అంగన్ వాడీల ద్వారా పోషకాహారం అందిస్తామని చంద్రబాబు ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ నెల 9వ తేదీన నుంచి ఈ వ్యాక్సిన్ ప్రజలకు అందుబాటులోకి రానుంది. అలాగే తెలంగాణలో 11, 12 తేదీల్లో ప్రారంభించనున్నారు. అందుకోసం ఉన్నతాధికారులు విస్తృత ప్రచారం చేస్తున్నారు. జాతీయ టీకా కార్యక్రమంలో భాగంగా పెంటావాలెంట్ వ్యాక్సిన్‌ను రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రారంభిస్తున్నారు. -
ట్రాఫిక్ సమస్యలకు టెక్ పరిష్కారం
తిరుపతి నగరంలో ట్రాఫిక్ సమస్యలను అధిగమించేందుకు ఆధునిక టెక్నాలజీని వాడుకోవాలని డీజీపీ రాముడు పోలీసులకు పిలుపునిచ్చారు. తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన ‘సీసీ టీవీ సర్వేలైన్స్ సెంట్రల్ కమాండింగ్ సిస్టమ్, తిరుపతి ఫేస్బుక్ పేజ్’ను శుక్రవారం ఆయన ప్రారంభించారు. నగరంలో ప్రధాన జంక్షన్లలో 150 కెమెరాలు అమర్చామని చెప్పారు. ఈ సీసీ కెమెరాల ద్వారా ట్రాఫిక్ నియంత్రణతో పాటు నేర పరిశోధనలకు వీలవుతుందన్నారు.