సాక్షి ప్రతినిధి, తిరుపతి: రాయలసీమ జిల్లాలోని నగరాలు, పట్టణాల్లో నీటి సమస్య రోజురోజుకూ తీవ్రతరమవుతోంది. కొన్ని ప్రాంతాల్లో వారానికి ఒకసారి కూడా నీరు రాక పోవడంతో నగరవాసులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. 11 మున్సిపాలిటీల్లో తాగునీటి సమస్య జఠిలంగా మారింది. ఈ సమస్యను ప్రయివేటు వ్యాపారులు సొమ్ముచేసుకుంటున్నారు.
తీవ్ర నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాలు....
తిరుపతి, చిత్తూరు కార్పొరేషన్‌లు, మున్సిపాలిటీలకు సంబంధించి చిత్తూరు జిల్లాలో మదనపల్లె, పుంగనూరు, నగరి. వైఎస్సార్ జిల్లాలో బద్వేలు, ప్రొద్దుటూరు, అనంతపురం జిల్లాలో హిందుపురం, గుత్తి, పామిడి. కర్నూలు జిల్లాలో గుడూరు, నందికొట్కూరు, ఆత్మకూరులో సమస్య తీవ్రంగా ఉన్నట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. మిగిలిన చోట్ల కూడ నాలుగు, ఐదు రోజులకు కూడా నీరు విడుదల కాక పోవడంతో ప్రజలు నీటిని కోనుగోలు చేయాల్సివస్తోంది.
తిరుపతిలో తీవ్రమైన నీటి సమస్య...
తిరుపతి నగరవాసులు ఎన్నడూలేని విధంగా నీటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వెయ్యి అడుగుల లోతు బోర్లు తవ్వినా నీరు దొరకని పరిస్థితులు నెలకొన్నాయి. బైరాగి పట్టెడ, ఎంఆర్‌పల్లె, జీవకోన, శివజ్యోతినగర్, భవానీనగర్ ప్రాంతాల్లో ప్రస్తుతం నీటి ట్యాంకులే దిక్కుయ్యాయి. ఈ ప్రాంతంలోని చాలామంది ఇళ్లు ఖాళీ మంగళం తదితర ప్రాంతాలకు వెళుతున్నారు. దీంతో అక్కడ అద్దెలు విపరీతంగా పెంచేశారు. తిరుపతికి ప్రతిరోజూ సరాసరిన 80వేల నుంచి 90వేల మంది ఇతర ప్రాంతాలనుంచి వస్తుండటం, తగినమేర నీటి సరఫరా జరగకపోడంతో అందరికి ఇబ్బందులు తప్పడం లేదు. ఇళ్లు మారలేని పరిస్థితులు ఉన్నవారు ప్రయివేటు ట్యాంకర్ల నీటిని కొనుగోలు చేస్తున్నారు. దీనికి తోడు కడప, అనంతపురం, చిత్తూరు, కార్పొరేషన్ పరిధిలోని కొన్ని కాలనీల్లో సైతం నీరుదొరకక ప్రజలు తీవ్ర అవస్థ పడుతున్నారు.
మునుపెన్నడూ ఇంత సమస్య రాలేదు
గత 12సంవత్సరాలుగా తిరుపతిలోని వరదరాజనగర్‌లో నివాసం ఉంటున్నాం. ఎంత వేసవికాలంలోనూ మా కాలనీలో తాగునీటి సమస్య రాలేదు. ఒకటి రెండు రోజులు మున్సిపాలిటీ నీళ్లు రాకపోయినా, మా ఇంట్లో వేసుకున్న బోరులో నీళ్లు పుష్కలంగా ఉండేవి.
ఈ ఏడాది బోర్లలో నీరు ఇంకిపోయాయి. దీనికితోడు వారానికి ఒక్కరోజు కూడా కార్పొరేషన్ నీళ్లు రావడం లేదు. దీంతో తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. వాటర్ ట్యాంకుల ద్వారా నీళ్లు తెప్పించుకుందామంటే ఒక ట్యాంకర్ రూ. 600నుంచి రూ.800 వరకు డిమాండ్ చేస్తున్నారు.
- ఎం.తులసీ, వరదరాజనగర్, తిరుపతి
రాయలసీమలో తాగునీటికి కటకట
Published Mon, Jul 13 2015 9:15 AM | Last Updated on Sat, Sep 29 2018 5:21 PM
Advertisement