Tiruvalluru District
-
విక్రమార్కుడు.. రత్న ప్రభాకరన్..104 సార్లు ఫెయిల్..105వ సారి శభాష్ అనిపించుకున్నాడు
సాక్షి, చెన్నై: లక్ష్యసాధనలో తడబాటు ఎదురైనా పట్టుదలతో శ్రమిస్తే విజయం సాధించవచ్చని నిరూపించాడు పొన్నేరికి చెందిన ఓ యువకుడు. ఉన్నత ఉద్యోగం సాధించాలనే పట్టుదలతో 104 సార్లు పరీక్ష రాసి ఫెయిలైనా.. ఎట్టకేలకూ 105వ సారి ఇండియన్ బ్యాంకులో ఉద్యోగం సంపాదించి శభాష్ అనిపించుకున్నాడు. వివరాలు.. తిరువళ్లూరు జిల్లా పొన్నేరి సమీపంలోని చిన్నకావనం గ్రామానికి చెందిన రత్నప్రభాకరన్(27) మెకానికల్ ఇంజినీరింగ్‌ను 2016లో పూర్తి చేశాడు. పార్ట్‌టైమ్‌గా ఎంబీఏ కోర్సు చేస్తూ.. ఉద్యోగాల వేటను సాగించాడు. పోటీ పరీక్షలు రాయడం ప్రారంభించాడు. అయితే అప్పట్లో ఆశించిన ఫలితం దక్కలేదు. అయినా పట్టువదలకుండా తన లక్ష్య సాధన కోసం మరింత తీవ్రంగా కష్టపడ్డాడు. విఫలమైన ప్రతిసారీ తన లోపాలను గుర్తించి వాటిని సరి చేసుకోవడం ప్రారంభించాడు. ఫలితంగా 105వ సారి పరీక్షల్లో విజ యం సాధించి ఇండియన్ బ్యాంకులో ఉద్యోగం సాధించాడు. ప్రస్తుతం శిక్షణ ముగించుకుని కాంచీపురం జిల్లా మానామధిలోని ఇండియన్ బ్యాంకులో విధుల్లో చేరాడు. గత కొన్నేళ్లుగా ఎప్పుడూ పుస్తకాలు చేతబట్టి.. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే రత్నప్రభాకరన్ జాబ్ సంపాదించడంతో స్థానికులు కూడా సంతోషం వ్యక్తం చేశారు. సంక్రాంతి సందర్భంగా నిర్వహించిన వేడుకల్లో అతడిని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా రత్నప్రభాకరన్ మాట్లాడుతూ గత ఆరు సంవత్సరాల్లో తాను 65 సార్లు బ్యాంకు ఉద్యోగాల కోసం, 39సార్లు ప్రభుత్వ ఉద్యోగాల కోసం పోటీ పరీక్షలు రాసి విఫలమైనట్లు పేర్కొన్నాడు. స్నేహితులు, బంధువుల నుంచి హేళన ఎదురైనా లక్ష్యం వైపే సాగి 105వ సారి విజయవంతం అయినట్లు వెల్లడించాడు. -
ప్రేమ వివాహం.. ఆపై కులం తక్కువని..
చెన్నై: ప్రేమించి వివాహం చేసుకున్న భార్య తక్కువ కులానికి చెందిన యువతిగా తెలియడంతో గెంటేసిన భర్తను మూడు నెలల తరువాత పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. తిరువళ్లూరు జిల్లా తన్నీర్‌కులం గ్రామానికి చెందిన మోహన్ కుమార్తె దివ్య(26) ఈకాడులోని పాత సామాన్లు విక్రయించే దుకాణంలో పని చేసింది. అదే దుకాణంలో తూత్తుకుడి జిల్లా తెన్తిరుపేరై గ్రామానికి చెందిన చిత్రవేలు కుమారుడు శివనైంద పెరుమాల్(29) పని చేసినట్టు తెలుస్తోంది. ఈ సమయంలో ఇద్దరి మధ్య ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఈ నేపథ్యంలో 2021 ఫిబ్రవరి 24న దివ్యను తూత్తుకుడికి తీసుకెళ్లి తల్లిదండ్రుల సమక్షంలో వివాహం చేసుకున్నాడు. అయితే కొంతకాలానికి ఎస్టీ కులానికి చెందిన యువతిగా తెలియడంతో అత్తింటివారు వేధించడంతో పాటు ఇంటి నుంచి గెంటేశారు. విధి లేని పరిస్థితుల్లో అక్కడే తలదాచుకున్న యువతి, స్థానికుల సాయంతో అల్వార్ తిరునగరి పోలీసులు, శ్రీవైకుంఠం మహిళా పోలీసులను ఆశ్రయించింది. అప్పట్లో పోలీసులు ఇద్దరికీ కౌన్సిలింగ్ ఇచ్చారు. అయినా పరిస్థితుల్లో మార్పు రాక యువతికి అత్తారింటి వేధింపులు ఎక్కువైనట్లు తెలుస్తోంది. చదవండి: (వివాహేతరం సంబంధం తెలిసి హెచ్చరించాడు.. పసరు కోసం వెళ్తే..) ఈ నేపథ్యంలో భర్త సైతం యువతిని అక్కడే వదిలేసి చెన్నై పల్లావరంలోని అక్క ఇంటికి వెళ్లిపోయాడు. దీంతో యువతి తన బంధువుల సాయంతో గత మే నెలలో తూత్తుకుడి నుంచి తన సొంత గ్రామానికి చేరుకుని తిరువళ్లూరు తాలుకా పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను ప్రేమించి వివాహం చేసుకోవడంతో పాటు కులం పేరుతో ధూషించి గెంటేసిన భర్తపై చర్యలు తీసుకోవాలని కోరింది. ఈ నేపథ్యంలో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఎస్ఐ శక్తివేల్ నేతృత్వంలో తూత్తుకుడి వెళ్లి మూడు నెలలుగా పరారీలో ఉన్న శివనంద పెరుమాల్‌ను అరెస్టు చేసి తిరువళ్లూరు కోర్టులో హాజరు పరిచి రిమాండ్‌కు తరలించారు. చదవండి: (Doctor Death Mystery: ‘అశ్లీల చిత్రాలతో బెదిరించి చంపేశాడు’) -
ఐటీ ఉద్యోగి దారుణహత్య
తిరువళ్లూరు: భూతగాదాల కారణంగా సొంత అన్న కూతురిని బాబాయి దారుణంగా హత్య చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. వివరాలు.. తిరువళ్లూరు జిల్లా కూవం నది పరివాహక ప్రాంతానికి చెందిన లోకనాయగి.. భర్త ఇటీవల మృతి చెందిన నేపథ్యంలో కూతురు శివరంజనితో కలిసి నివాసం ఉంటున్నారు. బీసీఏ పూర్తి చేసిన శివరంజిని చెన్నైలోని ఐటీ కంపెనీలో పని చేస్తోంది. శివరంజిని తల్లిదండ్రులకు చిన్నాన్న బాలచంద్రన్‌కు మధ్య భూతగాదా ఉన్నట్లు తెలుస్తుంది. సోమవారం ఇరు కుటుంబాలు స్వల్పంగా ఘర్షణకు దిగారు. దీంతో మనస్థాపం చెందిన లోకనాయగి తన మరిది బాలచంద్రన్‌పై ఫిర్యాదు చేయడానికి తిరువళ్లూరు టౌన్ పోలీసు స్టేషన్‌కు వెళ్లింది. దీంతో బాలచంద్రన్ ఆగ్రహంతో ఇంట్లోకి చొరబడి శివరంజినిని విచక్షణా రహితంగా నరికి హత్య చేశాడు. అనంతరం పోలీసు స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. లోకనాయగి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
వికటించిన వైద్యం: శరీరం పూర్తిగా కాలిపోయి బాలిక మృతి
సాక్షి, తిరువళ్లూరు: వైద్యం వికటించడంతో శరీరం పూర్తిగా కాలిపోయి బాలిక మృతి చెందిన ఘటన తిరువళ్లూరు జిల్లా పొన్నేరి సమీపంలో మంగళవారం చోటుచేసుకుంది. ఎంజీఆర్ నగర్‌కు చెందిన కుమార్‌కు లక్షిత(07) అనే కుమార్తె ఉంది. గతనెల 27న లక్షిత అనారోగ్యానికి గురవడంతో సమీపంలోని ఓ ప్రైవేటు వైద్యశాలలో చిక్సిత చేయించారు. వైద్యులు ఇచ్చిన మందులను వాడిన రెండు రోజుల్లోనే బాలిక శరీరంపై బొబ్బలు రావడంతో తల్లిదండ్రులు మళ్లీ అదే వైద్యశాలకు తీసుకెళ్లారు. చదవండి: (తల్లీకొడుకును బలిగొన్న బజ్జీలు) అయితే ఇక్కడ వైద్యం చేయలేమని ప్రభుత్వ వైద్యశాలకు తీసుకెళ్లాలని సూచించినట్టు తెలుస్తుంది. దీంతో బాలికను పొన్నేరి వైద్యశాలకు తరలించారు. అక్కడ ప్రాథమిక చిక్సిత అందించిన తరువాత చెన్నై ఎగ్మూర్‌లో ఉన్న చిన్నపిల్లల వైద్యశాలకు తరలించారు. అక్కడ బాలిక చిక్సిత పొందుతూ మంగళవారం మృతి చెందింది. దీంతో ఆగ్రహించిన బంధువులు ప్రైవేటు వైద్యశాల వద్దకు చేరుకుని ఆందోళన నిర్వహించారు. ఆస్పత్రిపై రాళ్లు రువ్వి వీరంగం సృష్టించారు. పోలీసు లు బాలిక బంధువులతో చర్చించి ఆందోళనను విరమింపజేశారు. అనంతరం వైద్యశాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చదవండి: (విద్యుత్ షాక్‌తో దంపతులు మృతి) -
జిల్లాలో రెండు స్వైన్‌ఫ్లూ కేసులు
తిరువళ్లూరు: డెంగీ జ్వరంతో జిల్లాలో ప్రకంపనలు సృష్టించిన నేపథ్యంలో జిల్లా ప్రజలకు స్వైన్‌ఫ్లూ ద్వారా వస్తున్న మరో ప్రమాదం ప్రజల్లో కలవరానికి గురిచేసింది. గత సంవత్సరం తిరువళ్లూరు జిల్లా వ్యాప్తంగా డెంగీ కేసులు భారీగా నమోదు కావడంతో పాటు దాదాపు పది మందికి పైగా మృతి చెందారు. అప్పట్లో డెంగీ రూపంలో వచ్చిన ప్రమాదం నుంచి ప్రజలు ఇంకా తేరుకోక ముందే స్వైన్‌ఫ్లూ విజృంభించడం ప్రజలను మరింత ఆందోళన గురి చేసింది. ఇటీవలే తిరుత్తణి ప్రాంతానీకి చెందిన వీరరాఘవన్ స్వైన్‌ఫ్లూ భారిన పడి మృతి చెందగా, గుమ్మిడిపూండిలో మరో ముగ్గురు స్వైన్‌ఫ్లూ భారిన పడి మృతి చెందారు. ఈ సంఘటన జిల్లాలో తీవ్ర అలజడి సృష్టించగా, అప్రమత్తమైన జిల్లా అధికారులు యుద్ధ ప్రాతిపదికన దిద్దుబాటు చర్యలు చేపట్టారు. స్వైన్న్ఫ్లూ భారిన పడిన వారికి చిక్సిత అందించడానికి ప్రత్యేక వార్డును ఏర్పాటు చేశారు. ప్రస్తుతం తిరువళ్లూరు వైద్యశాలలో చేరిన ఇద్దరికి స్వైన్‌ఫ్లూ ఉన్నట్టుగా గుర్తించారు. కాకలూరు ప్రాంతానికి చెందిన కుమరేషన్, తిరునిండ్రవూర్ ప్రాంతానికి చెందిన రంజిత్‌కు స్వైన్‌ప్లూ ఉన్నట్టు నిర్ధారించి వారికి చిక్సిత అందిస్తున్నారు. -
సోదరిని ప్రేమించాడని కడతేర్చాడు
మూడు రోజుల తర్వాత వెలుగులోకి నిందితులు ప్లస్ ఒన్ విద్యార్థులు తిరువళ్లూరు: తన సోదరిని ప్రేమ పేరుతో వేధిస్తున్నాడనే కోపంతో ఓ పెయింటర్‌ను మిత్రుడితో కలసి కడతేర్చిన ఘటన తిరువళ్లూరు జిల్లాలో సోమవారం వెలుగుచూసింది. హత్య జరిగిన మూడు రోజల తర్వాత తాము చేసిన నేరాన్ని పోలీసుల దృష్టికి నింధితులు తీసుకువెళ్లడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. బన్రూటికి చెందిన గురునాథన్(19) నెశపాక్కంలో నివాసం ఉంటున్నాడు. ఇతడు పెయింటర్‌గా పనిచేస్తున్నాడు. అదే ప్రాంతానికి చెందిన ప్లస్ టూ విద్యార్థిని మీద మనస్సు పడ్డాడు. ఆమెను వెంబడించడం మొదలుపెట్టాడు. దీన్ని ఆ విద్యార్థిని సోదరుడు ప్రభాకరన్(17) గుర్తించాడు. తన సోదరి వెంట పడటం మానుకోవాలని పలుమార్లు గురునాథన్‌ను హెచ్చరించినా ఫలితం కని పించలేదు. ఆగ్రహించిన ప్రభాకరన్ తన స్నేహితులతో కలసి గురునాథన్‌ను కడతేర్చేందుకు పథకం వేశాడు. శుక్రవారం తన మిత్రుడు ఉదయ్(17), ప్లస్ ఒన్ విద్యార్థి విజయకుమార్(18), తొమ్మిదో తరగతి విద్యార్థి కార్తీ(15)లతో కలసి గురునాథన్‌ను కొలపాక్కంకు తీసుకెళ్లారు. అక్కడి ఇటుక బట్టీల వద్ద గురునాథన్‌ను కడతేర్చి మృతదేహాన్ని ముళ్ల పొదల్లో పడేసి వెళ్లిపోయారు. సోమవారం ప్రభాకరన్, ఉదయ్ ఎంజీఆర్ నగర్ పోలీసుస్టేషన్‌కు వెళ్లారు. తాము హత్య చేసినట్టు పోలీసు దృష్టికి తీసుకెళ్లారు. మృతదేహం ఫలాన చోట ఉందని చెప్పారు. ఘటనా ప్రదేశం మాంగాడు స్టేషన్ పరిధిలోకి రావడంతో అక్కడి పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన మాంగాడు పోలీసులు ఉదయ్, ప్రభాకరన్‌లను అదుపులోకి తీసుకున్నారు. మృత దేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టానికి తరలించారు. విజయకుమార్, కార్తీక్‌లను స్కూలుకు వెళ్లి మరీ తరగతి గదిలోనే అదుపులోకి తీసుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.