తన సోదరిని ప్రేమ పేరుతో వేధిస్తున్నాడనే కోపంతో ఓ పెయింటర్‌ను మిత్రుడితో కలసి కడతేర్చిన ఘటన తిరువళ్లూరు
మూడు రోజుల తర్వాత వెలుగులోకి
నిందితులు ప్లస్ ఒన్ విద్యార్థులు
తిరువళ్లూరు: తన సోదరిని ప్రేమ పేరుతో వేధిస్తున్నాడనే కోపంతో ఓ పెయింటర్‌ను మిత్రుడితో కలసి కడతేర్చిన ఘటన తిరువళ్లూరు జిల్లాలో సోమవారం వెలుగుచూసింది. హత్య జరిగిన మూడు రోజల తర్వాత తాము చేసిన నేరాన్ని పోలీసుల దృష్టికి నింధితులు తీసుకువెళ్లడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
బన్రూటికి చెందిన గురునాథన్(19) నెశపాక్కంలో నివాసం ఉంటున్నాడు. ఇతడు పెయింటర్‌గా పనిచేస్తున్నాడు. అదే ప్రాంతానికి చెందిన ప్లస్ టూ విద్యార్థిని మీద మనస్సు పడ్డాడు. ఆమెను వెంబడించడం మొదలుపెట్టాడు. దీన్ని ఆ విద్యార్థిని సోదరుడు ప్రభాకరన్(17) గుర్తించాడు. తన సోదరి వెంట పడటం మానుకోవాలని పలుమార్లు గురునాథన్‌ను హెచ్చరించినా ఫలితం కని పించలేదు. ఆగ్రహించిన ప్రభాకరన్ తన స్నేహితులతో కలసి గురునాథన్‌ను కడతేర్చేందుకు పథకం వేశాడు. శుక్రవారం తన మిత్రుడు ఉదయ్(17), ప్లస్ ఒన్ విద్యార్థి విజయకుమార్(18), తొమ్మిదో తరగతి విద్యార్థి కార్తీ(15)లతో కలసి గురునాథన్‌ను కొలపాక్కంకు తీసుకెళ్లారు.
అక్కడి ఇటుక బట్టీల వద్ద గురునాథన్‌ను కడతేర్చి మృతదేహాన్ని ముళ్ల పొదల్లో పడేసి వెళ్లిపోయారు. సోమవారం ప్రభాకరన్, ఉదయ్ ఎంజీఆర్ నగర్ పోలీసుస్టేషన్‌కు వెళ్లారు. తాము హత్య చేసినట్టు పోలీసు దృష్టికి తీసుకెళ్లారు. మృతదేహం ఫలాన చోట ఉందని చెప్పారు. ఘటనా ప్రదేశం మాంగాడు స్టేషన్ పరిధిలోకి రావడంతో అక్కడి పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన మాంగాడు పోలీసులు ఉదయ్, ప్రభాకరన్‌లను అదుపులోకి తీసుకున్నారు. మృత దేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టానికి తరలించారు. విజయకుమార్, కార్తీక్‌లను స్కూలుకు వెళ్లి మరీ తరగతి గదిలోనే అదుపులోకి తీసుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.