వీఆర్ఏలను క్రమబద్ధీకరించాలి
కొత్త జిల్లాలతో ఉద్యోగులపై పనిభారం
ఐదేళ్లలో రూ.లక్ష కోట్లకు పైగా అప్పులు
సీఎల్పీ ఉపనేత టి.జీవన్‌రెడ్డి
ముకరంపుర : ఏపీపీఎస్సీ ద్వారా నియమించబడిన వీఆర్ఏలను రెగ్యులరైజ్ చేసి పే స్కేలు వర్తింపజేయాలని సీఎల్పీ ఉపనేత టి.జీవన్‌రెడ్డి డిమాండ్ చేశారు. కలెక్టరేట్ ఎదుట వీఆర్ఏలు కొనసాగిస్తున్న సమ్మె శిబిరాన్ని మంగళవారం ఆయన సందర్శించి సంఘీభావం తెలిపారు. వీఆర్ఏల డిమాండ్లను పరిష్కరించాలని ప్రభుత్వానికి, శ్రమదోపిడీపై స్పందించాల్సిందిగా కోరుతూ మానవlహక్కుల కమిషన్‌కు లేఖలు రాస్తానన్నారు. రెవెన్యూ వ్యవస్థలో కీలకంగా పనిచేసే వీఆర్ఏలు సమ్మెలో ఉన్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం శోచనీయమన్నారు. తెలంగాణలో తాత్కాలిక ఉద్యోగాలు అనే మాట ఉండదని చెప్పిన సీఎం కేసీఆర్.. ఇచ్చిన మాట తప్పడంతో తాత్కాలిక ఉద్యోగులు రోడ్డునపడ్డారని అన్నారు. కొత్త జిల్లాల్లో కలెక్టర్లు, ఎస్పీలు మినహా కిందిస్థాయి సిబ్బందిని నియమించకుండా వేగవంతమైన పరిపాలన ఎలా సాధ్యమన్నారు. ప్రస్తుతం పది జిల్లాల్లో ఉన్న ఉద్యోగులే 27 జిల్లాల్లో పని చేయాలంటే వారి విపరీతమైన భారం పడుతుందన్నారు. 58 ఏళ్ల ఉమ్మడి రాష్ట్రంలో రూ.63వేల కోట్ల అప్పులుంటే.. టీఆర్ఎస్ ప్రభుత్వం గత రెండేళ్లలోనే రూ.33 వేల కోట్లు అప్పు చేసిందన్నారు. ఆగస్టులోనే రూ.9వేల కోట్ల అప్పు చేసి ప్రజలపై భారం మోపిందని విమర్శించారు. రానున్న ఐదేళ్ల కాలంలో అప్పులు రూ.లక్ష కోట్లు దాటుతాయన్నారు. సమ్మెలో వీఆర్ఏల సంఘం జిల్లా అధ్యక్షుడు కందుకూరి బాపుదేవ్, జిల్లా కార్యదర్శి గోపు రామకృష్ణ, ఆనంద్‌కుమార్, రవి, తిరుపతి, సజిత్‌రెడ్డి, సంకీర్తన, నరేందర్‌రావు తదితరులున్నారు.
వైఎస్సార్సీపీ సంఘీభావం
వీఆర్ఏల సమ్మె శిబిరాన్ని వైఎస్సార్సీపీ నాయకులు సందర్శించి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు అక్కెనపల్లి కుమార్, రాష్ట్ర కార్యదర్శులు డాక్టర్ కె.నగేష్, సెగ్గెం రాజేష్, సొల్లు అజయ్‌వర్మ, రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు వరాల శ్రీనివాస్, గాలి ప్రశాంత్‌బాబు, మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి మోకెనపెల్లి రాజమ్మ, సంయుక్త కార్యదర్శి గడ్డం జలజరెడ్డి, జిల్లా అధ్యక్షురాలు బోగె పద్మ, పార్టీ జిల్లా అధికార ప్రతినిధులు దేవరనేణి వేణుమాధవ్‌రావు, వినుకొండ రామకృష్ణారెడ్డి, మందరాజేష్, నాయకులు సిరి రవి, జక్కుల యాదగిరి, సాన రాజన్న, దుబ్బాక సంపత్, గండి శ్యామ్, కంది వెంకటరమణారెడ్డి, బండమీది అంజయ్య, పావురాల కనుకయ్య, చొక్కాల రాము, గంటుక పంపత్ తదితరులున్నారు.