కాలేయ క్యాన్సర్...
మన శరీరంలోని అతి పెద్ద అవయవం కాలేయం. అనేక కీలక వ్యవహారాలు నిర్వహించే కేంద్రమిది. అత్యంత పెద్ద గ్రంథి. దీనికి క్యాన్సర్ సోకితే అది చాలా ప్రమాదం. మన దేశంలో సంభవించే క్యాన్సర్ మరణాలన్నింటికీ మూడో అతి పెద్ద కారణం కాలేయ క్యాన్సర్. ఇది ప్రమాదకరమైనదే అయినా... కేవలం చిన్న రక్తపరీక్షతో దీన్ని గుర్తించి, ఒక ఆపరేషన్ చేయిస్తే చాలు... ఓ ప్రాణం నిలుస్తుంది. సంపూర్ణ జీవితానికి ఆస్కారం దొరుకుతుంది. అందుకే దీని గురించి అవగాహన ప్రతి ఒక్కరికీ తప్పనిసరి. ఈ అవగాహన కోసమే నేడు క్యాన్సర్ డే రోజున ఈ ప్రత్యేక కథనం.
కాలేయ మార్పిడి శస్త్రచికిత్స
హెపటోసెల్యులార్ కార్సినోమా (హెసీసీ) అనే లివర్ క్యాన్సర్ బాధితుల్లో కాలేయం పనితీరు పూర్తిగా మందగిస్తే... దాన్ని మళ్లీ పనిచేసేలా చేయడం కష్టం. వారిలో కొందరికి కాలేయ మార్పిడి శస్త్రచికిత్స ఓ ప్రత్యామ్నాయం. అయితే ప్రతి రోగికీ ఇది వర్తించదు. ఎందుకంటే... కాలేయంలో గడ్డల సంఖ్య, వాటి పరిమాణం వంటి అనేక అంశాలు కాలేయ మార్పిడి శస్త్రచికిత్సకు పరిమితులు విధిస్తాయి. అందుకే కేవలం నిర్దిష్టమైన కొన్ని కేసుల్లోనే కాలేయ మార్పిడి ఉపకరిస్తుందని గుర్తుంచుకోవాలి. పైగా చాలా సందర్భాల్లో కాలేయ లభ్యతా ఒక ప్రతిబంధకమే.
మరి కాలేయ మార్పిడి శస్త్రచికిత్స ఎవరికి చేయవచ్చు...
చాలా కొద్దిమంది రోగులకే ఈ కాలేయ మార్పిడి శస్త్రచికిత్స వరప్రదాయని అవుతుంది. ఇందుకోసం తనకు కాలేయాన్ని ఇచ్చే దాత అవసరం. ఆయన ఇచ్చే కాలేయం కూడా రోగి కాలేయంతో సరిపడాలి. అంటే రోగి, దాతల కాలేయాలు సరిగా జతగూరతాయా అని పరిశీలించేందుకు చేసే మ్యాచింగ్ పరీక్షలు విజయవంతం అయితేనే కాలేయ మార్పిడి శస్త్రచికిత్స సాధ్యం.
కొందరు రోగుల్లో కాలేయ క్యాన్సర్ పక్క అవయవాలకూ వ్యాపిస్తే... ఇక అలాంటి రోగులకు కాలేయ మార్పిడి సత్ఫలితాలు ఇవ్వదు. ఇది ఎవరికి సత్ఫలితాలు ఇస్తుందో తెలుసుకోడానికి రోగిని ఆసుపత్రిలో చేర్చి ఒకటి, రెండు వారాలు పరీక్షలు చేయాలి.
అనంతర ఫాలో-అప్లూ చాలా కీలకం...
కాలేయ మార్పిడి శస్త్రచికిత్స విజయవంతం అయ్యాక కూడా డాక్టర్లతో నిత్యం ఫాలోఅప్లలో ఉండటం అవసరం. ఈ సమయాల్లో డాక్టర్లు రోగిని అనేక అంశాలు అడుగుతుంటారు. ఉదాహరణకు లక్షణాలు, భౌతికంగా ఏవైనా బయటకు కనిపించే గమనించదగ్గ అంశాలు, నిత్యం ఏఎఫ్‌పీ వంటి రక్తపరీక్షలు; కాలేయ పనితీరు పరీక్షలు చేయించడం, అవసరాన్ని బట్టి అల్ట్రాసౌండ్, సీటీ, ఎమ్మారై స్కాన్లు చేయించాలి. కాలేయ క్యాన్సర్‌ను శస్త్రచికిత్సతో తొలగించాక మొదటి రెండేళ్ల పాటు ప్రతి మూడు లేదా ఆర్నెల్లకొకసారి; ఆ తర్వాత... ప్రతి 6 లేదా 12 నెలలకోసారి చొప్పున రక్తపరీక్షలు చేయించుకోవాలి. ఈ దశల్లో వ్యాధి పునరావృతమవుతోందా అన్న అంశంతో పాటు ఏవైనా సైడ్ఎఫెక్ట్స్ కనపడుతున్నాయా అని డాక్టర్లు నిత్యం పరిశీలిస్తూ ఉంటారు. ఒకవేళ కాలేయ క్యాన్సర్ హెపటైటిస్-బి లేదా సీ వైరస్ కారణంగా వస్తే... అప్పుడు అనేక రకాల మందులను వాడుతూ కొన్ని రకాల ఇన్ఫెక్షన్లు రాకుండా చూసుకుంటూ ఉండాలి.
శస్త్రచికిత్సల్లో అత్యంత ఆధునిక పద్ధతులు
పోర్టల్ వెయిన్ ఎంబోలైజేషన్ ఫర్ సర్జరీ...
శస్త్రచికిత్సల్లో ఇదో సరికొత్త ప్రక్రియ. కాలేయంలో కొంత భాగాన్ని తొలగించినా మళ్లీ పూర్వపు స్థితికి పెరగగలిగే శక్తి మన శరీరంలోని అన్ని అవయవాల్లో కేవలం కాలేయానికి మాత్రమే ఉంది. అయితే ఇలా కాలేయం మళ్లీ పూర్వస్థితికి పెరగాలంటే నిర్దిష్టమైన కొంత భాగాన్ని అక్కడ ఉంచాలి. అప్పుడే అది పూర్వస్థితికి పెరగ గలుగుతుంది. మరి వ్యాధి తీవ్రత కారణంగా అక్కడ ఉంచాల్సిన దానికంటే ఎక్కువగా తొలగించాల్సి వస్తే...? అందుకే అలాంటి పరిస్థితుల్లో డాక్టర్లు కాలేయానికి రక్తసరఫరాకు తోడ్పడే పోర్టర్ వెయిన్ భాగాన్ని వ్యాధి ఉన్న భాగం వైపు రక్తసరఫరా ఆగేలా మూసేస్తారు. దాంతో వ్యాధిలేని మరోవైపునకు కాలేయం పూర్తిగా పెరిగేలా చేస్తారు. ఈ ట్రిక్ చేయడం ద్వారా వ్యాధిలేని ఆరోగ్యకరమైన భాగమే పూర్తి కాలేయంగా పెరుగుతుంది. దీన్నే పోర్టల్ వెయిన్ ఎంబోలైజేషన్ ప్రక్రియ అంటారు.
ట్రాన్స్-ఆర్టీరియల్ కీమో ఎంబోలైజేషన్ (టేస్) థెరపీ
ఈ ప్రక్రియలో కాలేయంలోని క్యాన్సర్ ఉన్న భాగాలకు రక్తసరఫరా జరగకుండా చూస్తారు. ఇలా రక్తసరఫరాకు అడ్డుపడేందుకు రక్తనాళాల్లోనికి కొన్ని పదార్థాలను ఇంజెక్ట్ చేస్తారు. ప్రధానంగా కాలేయానికి రక్తసరఫరా చేసే హెపాటిక్ ఆర్టరీలో ఈ అడ్డంకులు కల్పిస్తారు. దీంతో క్యాన్సర్ కణాలు ఉన్న కాలేయ భాగానికి రక్తసరఫరా ఆగిపోతుంది. ఇక అదే సమయంలో ఆరోగ్యకరమైన కాలేయ కణాలకు పోర్టల్ వెయిన్ ద్వారా రక్తసరఫరా జరిగేలా చేస్తారు. అంటే... ఈ ప్రక్రియలో అనారోగ్యకరమైన క్యాన్సర్ కణాలకు రక్తసరఫరా జరగకుండానూ, ఆరోగ్యకరమైన కణాలకు మాత్రమే రక్తం అందేలాగానూ చూస్తారన్నమాట. దాంతో క్యాన్సర్ కణాలు రక్తసరఫరా అందక చనిపోతాయి.
శస్త్రచికిత్స చేసి క్యాన్సర్ గడ్డను తొలగించడానికి అవకాశం లేని రోగుల్లో ఈ ప్రక్రియ ఎంతగానో ఉపయోగపడుతుంది. అయితే ఈ ప్రక్రియలో కొన్నిసార్లు ఆరోగ్యకరమైన కాలేయ భాగానికీ రక్తసరఫరా ఆగిపోయే అవకాశం ఉన్నందున హెపటైటిస్ లేదా సిర్రోసిస్ ఉన్న కొందరు రోగులకు ఇది అంత మంచి ప్రత్యామ్నాయం కాకపోవచ్చు. కొన్నిసార్లు ఈ ‘టేస్’ ప్రక్రియ కీమోథెరపీతో కలిపి చేయాల్సి రావచ్చు. రక్తప్రవాహానికి అడ్డుపడే పదార్థాలను పంపాక, అప్పుడు రోగగ్రస్థమైన భాగానికి రేడియేషన్ చికిత్స ఇచ్చి దాన్ని నాశనం చేస్తారు. అయితే ఈ ప్రక్రియలో పొట్టనొప్పి, వాంతులు, వికారం, కాలేయంలోని కొన్ని భాగాలకు ఇన్ఫెక్షన్ రావడం, గాల్‌బ్లాడర్ వాపు (ఇన్ఫ్లమేషన్), కాలేయానికి చెందిన కొన్ని రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడం వంటి దుష్ర్పభావాలు కనిపించే అవకాశం ఉంది.
టార్గెటెడ్ థెరపీ...
కాలేయ క్యాన్సర్ వచ్చిన రోగుల్లో అది ప్రాథమిక దశలో ఉంటే కేవలం కొన్ని టాబ్లెట్లను వాడటం ద్వారానే వ్యాధిని అదుపు చేసే ప్రక్రియ ఓ ఆశాకిరణంలా కనిపిస్తోంది. ఈ థెరపీలో సొరాఫెనిబ్ అనే మందును వాడటం ద్వారా కేవలం వ్యాధిగ్రస్తమైన కణాలనే నాశనం చేసే వీలుంది. ఇవేగాక... ఎర్లోటినిబ్ అనే టార్గెటెడ్ థెరపీ మందుతో పాటు పాడైపోయిన కాలేయానికి రక్తసరఫరాను పునరుద్ధరించి మళ్లీ కొత్త రక్తనాళాలు సైతం ఏర్పడేలా చేసే బివాసిజుమాబ్ వంటి కొత్త మందులూ కాలేయ క్యాన్సర్ చికిత్సలో ఆశాకిరణాలను ప్రసరింపజేస్తున్నాయి.
- నిర్వహణ: యాసీన్ - మంజులారెడ్డి
కాలేయ క్యాన్సర్ కారణాలు...
మన దేశంతోపాటు ఆసియాలోని చైనా, కొరియాల్లో హెపటైటిస్-బి చాలా ఎక్కువ. దీని కారణంగా హెచ్‌సీసీ క్యాన్సర్లు ఎక్కువ. ఇక హెపటైటిస్-సి కూడా కాలేయ క్యాన్సర్లకు ఒక కారణమే. హీమోక్రొమటోసిస్ అనే కండిషన్ కూడా.
వ్యాయామం చేయకపోవడం వల్ల వచ్చే ఫ్యాటీ లివర్ కండిషన్ కూడా అరుదుగా కాలేయ క్యాన్సర్‌కు దారితీయవచ్చు.
పుట్టుకతో వచ్చే కాలేయ లోపాలు
విపరీతంగా ఆల్కహాల్ తీసుకునే అలవాటు కాలేయ క్యాన్సర్‌కు ప్రధాన కారణం. ఇక ఆల్కహాల్ తీసుకునే సమయంలో సిగరెట్ తాగడం చాలా ప్రమాదకరం.
గోధుమ, వేరుశనగ, వరి, మొక్కజొన్న, సోయాధాన్యాలకు వచ్చే ఒక రకం శిలీంధ్రం (మౌల్డ్)లోని విషం అఫ్లోటాక్సిన్ కూడా కాలేయ క్యాన్సర్‌కు కారణమే.
రిస్క్ ఫ్యాక్టర్లు
స్థూలకాయం, అనువంశికంగా వచ్చే పొట్ట వంటి ఒబేసిటీ కాలేయ క్యాన్సర్‌కు ఒక కారణం. టైప్-2 డయాబెటిస్ ఉన్నవారిలో హెచ్‌సీసీ తరహా క్యాన్సర్‌కు అవకాశం ఎక్కువ. చిన్నప్పుడు వచ్చే బిలియరీ అట్రేషియా, ఇన్‌ఫ్యాంటైల్ కొలెస్టాసిస్, గ్లైకోజెన్ స్టోరేజ్ డిసీజ్‌ల వంటివి కూడా హెచ్‌సీసీకి దారితీసే అవకాశం ఉంది. వినైల్ క్లోరైడ్, ఆర్సినిక్ వంటి కలుపు మొక్కలను నివారించే మందులు కూడా కాలేయ క్యాన్సర్‌కు కారకాలు కావచ్చు.
దాని శక్తే దానికి శాపం..!
కాలేయానికి అపరిమితమైన శక్తి ఉంటుంది. ఫలితంగా అది దాదాపు 90 శాతం పనిచేయకుండా పోయే వరకూ కాలేయ వ్యాధికి సంబంధించిన ఎలాంటి లక్షణాలూ బయటికి కనిపించవు. అందుకే కాలేయ వ్యాధులను కనుగొనడం ఒకింత కష్టమైన పని. అలా జరిగే జాప్యం కూడా కాలేయ వ్యాధులను ప్రాణాంతకం చేస్తుంటుంది. అందుకే దాని అపరిమితమైన శక్తే దానికి ఒక శాపం లాంటిది.
మరి ముందే తెలుసుకోవడం సాధ్యమేనా?
లక్షణాలు కనపడకముందే దాన్ని కనుగొనడం ఒకింత కష్టమే. పైగా గడ్డలను తడిమి తెలుసుకోవాలంటే కాలేయం ఉరఃపంజరం ఎముకల కింద సురక్షితంగా ఉంటుంది. అందుకే చాలా సందర్భాల్లో గడ్డను కనుగొనే సమయానికే వ్యాధి ముదిరిపోతుంటుంది. పైగా రిస్క్ ఫ్యాక్టర్లు లేనివారికి కాలేయ క్యాన్సర్‌కు స్క్రీనింగ్ పరీక్షలనూ సూచించే ఆస్కారం ఉండదు. అందుకే కాలేయ క్యాన్సర్ రిస్క్ ఉన్నవారు కొన్ని పరీక్షలను ముందే చేయించుకోవడం మేలు. సిర్రోసిస్ కండిషన్ కాలేయ క్యాన్సర్‌కు దారితీసే అంశం. కాబట్టే సిర్రోసిస్ ఉన్న పేషెంట్లకు డాక్టర్లు కాలేయ క్యాన్సర్ పరీక్షలు చేయిస్తుంటారు.
అయితే శుభవార్త ఏమిటంటే... కాలేయ క్యాన్సర్‌ను ముందే కనుగొంటే మరణాన్ని తప్పించుకోడానికి ఉండే అవకాశాలు 80 శాతం కంటే ఎక్కువ. ఇదీ చాలా చిన్న పరీక్షలతోనే జరిగిపోతుంది. ఆ పరీక్షలే... అల్ఫా-ఫీటోప్రొటీన్ (ఏఎఫ్‌పీ) అనే రక్తపరీక్ష, అల్ట్రా సౌండ్ స్కానింగ్ అనే తేలికపాటి మరో పరీక్ష. ఈ రెండు పరీక్షలనూ రిస్క్ ఫ్యాక్టర్లు ఉన్నవారు ప్రతి ఆరు నెలలు/ఏడాదికి ఒకసారి చేయించుకుంటుంటే కాలేయ క్యాన్సర్ ఉనికి తెలుస్తుంది. ఒకవేళ అది ఉన్నట్లు తెలిస్తే ఒకే శస్త్రచికిత్సతో పరిస్థితి చక్కబడుతుంది.
కాలేయ క్యాన్సర్ నివారణ ఇలా...
చాలా చిన్న చిన్న అంశాలే ప్రమాదకరమైన కాలేయ క్యాన్సర్‌ను నివారిస్తాయంటే నమ్మగలరా? అవేమిటంటే...
మంచి జీవనశైలి. అంటే సమయానికి సమతుల ఆహారం, శరీరానికి తగిన వ్యాయాయం.
బరువు పెరగకుండా అదుపులో పెట్టుకోవడం.
పొగతాగడాన్ని పూర్తిగా మానేయడం, ఆల్కహాల్ తీసుకోవడాన్ని పూర్తిగా వదిలేయడం, అది సాధ్యం కాకపోతే చాలా పరిమితంగా మాత్రమే తీసుకోవడం.
హెపటైటిస్‌కు వ్యాక్సిన్ తీసుకోవడం లేదా ఒకవేళ వ్యాధి అప్పటికే వస్తే మెరుగైన చికిత్స తీసుకోవడం.
ఏవైనా మందులు, రసాయనాలు వాడాల్సి వచ్చినప్పుడు వాటి దుష్ర్పభావాలను తెలుసుకోవడం. భద్రతామార్గదర్శకాలను (సేఫ్టీ గైడ్‌లైన్స్)ను విధిగా పాటించడం. ఐరన్ టాబ్లెట్ల వంటివి వాడాల్సి వస్తే వాటిని డాక్టర్ల సలహా మేరకే వాడటం.
స్టెరాయిడ్స్ వంటి మందులను డాక్టర్ సలహాతో మాత్రమే వాడాలని గుర్తుపెట్టుకోవడం. ఒకవేళ కాలేయ వ్యాధులు వచ్చినవారిలోనూ పైన పేర్కొన్న ఆరోగ్య పరిరక్షణ/నివారణ విధానాలు అవలంబిస్తే వ్యాధి తిరగబెట్టే అవకాశాలు తక్కువ.
నివారణలకు కొత్త పరిశోధనలు
ఇప్పుడు హెపటైటిస్ రాకుండానే నివారించేందుకు, ఒకవేళ హెపటైటిస్ వచ్చినా అది క్యాన్సర్‌కు దారితీయకుండా ఉండేందుకు గల అవకాశాలపై విస్తృతంగా పరిశోధనలు జరుగుతున్నాయి. హెపటైటిస్-సి ను నివారించేందుకు వ్యాక్సిన్ రూపకల్పన కోసం కూడా అనేక పరిశోధనలు కొనసాగుతున్నాయి. దీర్ఘకాలిక హెపటైటిస్ చికిత్స విధానాలపైనా విస్తృతమైన అధ్యయనాలు సాగుతున్నాయి.
సర్జరీ అనంతర చికిత్సల్లో న్యూట్రెండ్స్...
ఇప్పుడు శస్త్రచికిత్స తర్వాత చేయాల్సిన అనంతర చికిత్సా విధానాల్లో విషయంలోనూ ఎన్నెన్నో కొత్త పరిశోధనలు జరుగుతున్నాయి. ఇప్పటికి జరిగిన అధ్యయనాల వల్ల తేలిందేమిటంటే... శస్త్రచికిత్స తర్వాత కీమోథెరపీ లేదా కీమో ఎంబోలైజేషన్ థెరపీ చేయించుకున్నవారిలో అంతగా మంచి ఫలితాలేమీ కనిపించలేదు. అయితే మరింత సమర్థంగా పనిచేయగల కొత్త మందుల రూపకల్పనల్లో పరిశోధకులు నిమగ్నమై ఉన్నారు. వారి పరిశోధనల ఫలితంగా టార్గెటెడ్ థెరపీ రూపంలో ఉపయోగించేందుకు ఇప్పుడు ‘సొరాఫెనిబ్’ వంటి మంచి మందులను సర్జరీ తర్వాత వాడితే వ్యాధి తిరగబెట్టే అవకాశాలు తగ్గుతాయి.
రేడియేషన్ థెరపీ: కాలేయ క్యాన్సర్‌కు రేడియేషన్ థెరపీ ఇస్తే అది అక్కడి ఆరోగ్యకరమైన కణాలనూ నాశనం చేస్తుంది. అందుకే ఫోకస్ రేడియేషన్ పేరిట కేవలం క్యాన్సర్‌కు గురైన ప్రాంతాన్నే ప్రభావితం చేసేలా రేడియేషన్ ఇచ్చేలా పరిశోధనలు సాగుతున్నాయి.
కీమోథెరపీ: ప్రస్తుతానికి వీటి ఫలితాలు అంతగా ప్రోత్సాహకరంగా లేనప్పటికీ కాలేయ క్యాన్సర్‌ను అదుపు చేసేందుకు కొత్త కొత్త రసాయనాల కాంబినేషన్లను ఉపయోగించి చికిత్స చేసేందుకు క్లినికల్ ట్రయల్స్ సాగుతున్నాయి.
వ్యాధి నిర్ధారణ పరీక్షలు
ఏఎప్పీ అనే రక్తపరీక్ష, అల్ట్రా సౌండ్ స్కాన్ అనే ప్రాథమిక పరీక్షలతో పాటు సీటీ స్కాన్, కాంట్రాస్ట్ ఎమ్మారై స్కాన్ అనే పరీక్షలూ వ్యాధి నిర్ధారణ, వ్యాధి ఏ దశలో ఉందో తెలుసుకోవడం కోసం ఉపయోగపడతాయి. ఆ తర్వాత లివర్ బయాప్సీ అనే పరీక్ష ద్వారా ఆ గడ్డలు ప్రమాదం కలిగించని (బినైన్) గడ్డలా లేక ప్రాణాంతకమైనవా (మాలిగ్నెంట్) అన్నది తేలుతుంది. ఇక లాపరోస్కోపిక్ ప్రక్రియ కూడా చిన్న గడ్డలను పరీక్షించడానికి, సిర్రోసిస్ తీవ్రతను తెలుసుకోడానికి లేదా బయాప్సీ కోసం ముక్కను సేకరించడానికి ఉపయోగపడుతుంది
కాలేయ క్యాన్సర్ - చికిత్సా విధానాలు
కాలేయ క్యాన్సర్ వచ్చిన వారికి శస్త్రచికిత్సే అత్యుత్తమ చికిత్స. కేవలం ఒక్క శస్త్రచికిత్స ద్వారానే వ్యాధి అంతా నయమైపోయే అవకాశం చాలా సందర్భాల్లో ఉంటుంది. కానీ ఇలా జరగాలంటే వ్యాధి... మరి ఇంకే అవయవానికీ పాకక ముందే కనుగొనాల్సి ఉంటుంది. ఇక మందుల వంటి ఇతర మార్గాలు కాలేయ క్యాన్సర్ విషయంలో అంత ప్రభావపూర్వకమైనవి కావు. ఇప్పుడు ఈ శస్త్రచికిత్స ప్రక్రియల్లోనూ పార్షియల్ హెపటెక్టమీ, పూర్తి కాలేయ మార్పిడి (లివర్ ట్రాన్స్‌ప్లాంట్) వంటివి మరింత సురక్షితంగా, ప్రభావవంతంగా జరుగుతున్నాయి.
కాలేయం... కథా కమామిషూ...
మన దేహంలోని అంతర్గత భాగాల్లో అత్యంత పెద్దది కాలేయం. ఎంత పెద్దదో అంత కీలకం. దీని బరువు దాదాపు 1.5 కిలోలు. ఇంతటి కీలకమైన అవయవం కాబట్టే దీనికి రక్తం ధారాళంగా అందాలి. అలా అందజేసే రక్తనాళాలు పుష్కలంగా ఉంటాయి కాబట్టే ఈ అవయవానికి ఈ ముదురు ఎరుపు రంగు.
కాలేయ విధులెంతో కీలకం...
శరీరంలోని ఎన్నో కీలక కార్యకలాపాలను కాలేయం నిర్వహిస్తుంది. తిన్న ఆహారాన్ని జీర్ణం చేసే పనిలో పెద్ద పెద్ద పదార్థాలను శరీరం స్వీకరించే చిన్న పోషకాల్లోకి మార్చడం, జీర్ణక్రియ దీని ప్రధాన విధుల్లో ఒకటి. జీర్ణం చేసేందుకు ఉపయోగపడే పైత్యరసాన్ని స్రవింపజేస్తుంది. కొవ్వులను, పిండిపదార్థాలను, ప్రోటీన్లను, విటమిన్లను (ప్రధానంగా విటమిన్ ఏ, విటమిన్ బి12) నిల్వ చేస్తుంది. రక్తం గడ్డకట్టడానికి ఉపయోగపడే అంశాలను రూపొందిస్తుంది. ఒకవేళ కాలేయం ఆ పని చేయకపోతే చిన్న దెబ్బ తగిలినా తీవ్ర రక్తస్రావంతో మరణం ఖాయం. ఇక శరీరంలోకి చేరే అన్ని విషపదార్థాలను విరిచేసే ప్రధాన విధి కాలేయానిది.
క్యాన్సర్‌లో ప్రధాన రకాలు
కాలేయ క్యాన్సర్‌లో ప్రధానంగా రెండు రకాలున్నాయి. మొదటిది కాలేయంలోనే ఆవిర్భవించే క్యాన్సర్. ఇలాంటివి యూఎస్‌లో ఎక్కువ. ఇక భారత్ లాంటి ఆసియా దేశాల్లో వచ్చేవాటిల్లో ముఖ్యమైనది హెపటోసెల్యులార్ కార్సినోమా (హెచ్‌సీసీ). దీనికి కారణం మన వద్ద హెపటైటిస్ వైరస్ కారణంగా వచ్చే వ్యాధులు ఎక్కువగా ఉండటం. ఇక కాలేయం అనేక రకాలైన కణాలతో నిర్మితమై ఉండటం వల్ల రకరకాల క్యాన్సర్ గడ్డలు రావడమూ ఎక్కువ. అయితే ఆ వచ్చినది ఏ రకం అనే దానిపై అది ఎంత వరకు నయమవుతుందనే అంశం ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు హిమాంజియోమా, హెపాటిక్ అడినోమా, ఫోకల్ నాడ్యులార్ హైపర్‌ప్లేసియా వంటి గడ్డల్లా వచ్చే వాటితోపాటు కొన్ని నీటితిత్తులు (సిస్ట్) పూర్తిగా ప్రమాదరహితమైనవి. చికిత్సకు తేలిగ్గా లొంగిపోతాయి. నిజానికి క్యాన్సర్‌కు చేసినట్లుగా వీటికి చికిత్స అవసరం ఉండదు. నొప్పి లేదా రక్తస్రావం అవుతున్నప్పుడు ఆ భాగాన్ని తొలగిస్తే చాలు. చికిత్స పూర్తయినట్లే. అయితే హెచ్సీసీతో పాటు కొలాజియోకార్సినోమా వంటివి పైత్యనాళ (బైల్ డక్ట్) క్యాన్సర్లు. వీటిని కాస్త సీరియస్‌గా పరిగణించాల్సి ఉంటుంది.