toddler death
-
ఐసీయూలో అగ్ని ప్రమాదం.. నలుగురు చిన్నారులు సజీవ దహనం
భోపాల్: మధ్యప్రదేశ్‌లో పెను విషాదం చోటు చేసుకుంది. ముక్కుపచ్చలారని చిన్నారులు అగ్నికి ఆహుతి అయ్యారు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో ఉన్న కమలా నెహ్రూ ఆస్పత్రిలో సోమవారం రాత్రి అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో నలుగురు చిన్నారులు సజీవదహనమయ్యారు. పీడియాట్రిక్స్ ఐసీయూ వార్డులో మంటలు చెలరేగి ప్రమాదం చోటుచేసుకుంది. సంఘటన చోటు చేసుకున్న సమయంలో వార్డులో 40 మంది చిన్నారులు ఉన్నారు. వీరిలో నలుగురు చిన్నారులు ప్రాణాలు కోల్పోగా.. 36 మంది సురక్షితంగా బయటపడ్డారు. ప్రమాదం గురించి సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని 25 ఫైర్ ఇంజిన్ల సాయంతో మంటలను అదుపు చేశారు. మధ్యప్రదేశ్ వైద్య విద్యాశాఖ మంత్రి విశ్వాస్ సారంగ్ సహాయక చర్యలను పర్యవేక్షించారు. (చదవండి: అతడు అడవిని ప్రేమించాడు! ఎందుకీ తారతమ్యం..) ఈ ప్రమాదంపై ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ స్పందించారు. ‘‘కమలా నెహ్రూ ఆస్పత్రిలో చోటు చేసుకున్న సంఘటన పట్ల విచారం వ్యక్తం చేస్తున్నాను. దీనిపై ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించాను. ఏసీఎస్ పబ్లిక్ హెల్త్ అండ్ మెడికల్ ఎడ్యుకేషన్ మహ్మద్ సులేమాన్ పర్యవేక్షణలో ఈ విచారణ జరుగుతుంది’’ అన్నారు. (చదవండి: ‘జోకర్’ బీభత్సం: రైల్లో మంటలు.. 10 మందికి గాయాలు) ప్రస్తుతం మంటలను అదుపులోకి తెచ్చామని.. అయితే అప్పటికే తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చేరిన కొందరు చిన్నారులను రక్షించలేకపోయామని సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 4 లక్షల రూపాయల చొప్పున ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. సోమవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో మూడో అంతస్తులోని ఐసీయూలో మంటలు చెలరేగాయి. షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగినట్టు ప్రాథమికంగా గుర్తించారు. చదవండి: రూ.90 కోట్ల విలువైన మద్యం దగ్ధం -
విశాఖలో విషాదం: కరోనాతో ఏడాది చిన్నారి మృతి
సాక్షి, విశాఖపట్నం: కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. జనాలు పిట్టల్లా రాలిపోతున్నారు. ఈ నేపథ్యంలో విశాఖలో దారుణం చోటు చేసుకుంది. ఏడాదిన్నర చిన్నారి కోవిడ్ బారిన పడి మృతి చెందింది. ఈ విషాద ఘటన మానవ హృదయాల్ని కలిచివేసింది. జ్వరం, దగ్గుతో బాధపడుతున్న ఓ చిన్నారికి మూడు రోజుల పాటు ప్రైవేటు ఆసుపత్రిలో వైద్యం అందించినా ఫలితం లేకపోయింది. ఈ క్రమంలో ఆఖరి క్షణంలో చిన్నారిని కేజీహెచ్‌కు తీసుకురాగా అడ్మిషన్ ఇచ్చే లోగా అంబులెన్స్‌లోనే ప్రాణం విడిచింది. తన బిడ్డను కాపాడాలని ఆ తల్లిదండ్రులు చేసిన రోదన కేజీహెచ్ పరిసరాల్లో విషాదం నింపిన ట్టు అయింది. విశాఖ జిల్లా అచ్యుతాపురం మండలం చౌడుపల్లి గ్రామానికి చెందిన వీరబాబు సీఐఎస్ఎఫ్లో పని చేస్తున్నారు. ఇతనికి ఏడాది వయసు పాప జ్ఞానిత. అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న పాపకు నాలుగు రోజుల క్రితం జలుబు, జ్వరం, దగ్గు వచ్చింది. స్థానిక వైద్యుల సూచన మేరకు సన్‌రైజర్ ఆసుపత్రిలో చేర్పించారు. దాదాపు లక్షల రూపాయలకు పైగా ఖర్చయింది. ఇంకా వ్యాధి నయం కాకపోవడంతో కోవిడ్ పరీక్షలు నిర్వహించారు. దీంతో చిన్నారిలో పాజిటివ్ లక్షణాలు ఉన్నట్టు గుర్తించారు. అక్కడి చిన్నారిని మరో కార్పొరేట్ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆ ఆసుపత్రి వైద్యులు కేజీహెచ్‌కు తీసుకువెళ్లాలని సూచించారు. ఈ క్రమంలో చిన్నారిని పట్టుకొని కుటుంబ సభ్యులు కింగ్ జార్జి ఆసుపత్రిలోని కోవిడ్ బ్లాక్‌కు అంబులెన్స్‌లో చేరుకున్నారు. ఆస్పత్రిలో అడ్మిషన్ పొందేలోగా చిన్నారి అంబులెన్సులోనే మృతి చెందింది. మూడు రోజుల పాటు ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స కోసం ప్రయత్నించి ఆఖరి క్షణంలో చిన్నారి జ్ఞానిత మృత్యువాత పడడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా రోదించారు. ఈ సంఘటన కేజీహెచ్ పరిసరాల్లో ప్రజలను ...రోగుల బంధువులను కలిచివేసింది చదవండి: కరోనా సునామీ : దలైలామా సాయం -
అధికారులకు షాకిచ్చిన పోస్ట్‌మార్టం నివేదిక
న్యూఢిల్లీ: ఢిల్లీలోని షాకూర్ బస్తీ అక్రమ గుడిసెల తొలగింపు వ్యవహారంలో రైల్వే, రెవెన్యూ శాఖ అధికారులకు చుక్కెదురైంది. ఢిల్లీ సంజయగాంధీ ఆస్పత్రి వైద్యులు ఇచ్చిన పోస్ట్‌మార్టం నివేదిక అధికారులకు, ప్రభుత్వానికి షాక్ ఇచ్చింది. తీవ్ర గాయాల వల్లే చిన్నారి మరణించిందని పోస్ట్‌మార్టం నివేదిక తేల్చి చెప్పింది. దీంతో కూల్చివేతలకు, చిన్నారి మరణానికి సంబంధం లేదని ప్రకటించిన మంత్రివర్యులు, రైల్వేశాఖ అధికారులు ఇరకాటంలో పడ్డారు. షాకూర్ బస్తీ కూల్చివేతల్లో మరణించిన చిన్నారి మృతదేహానికి మంగళవారం పోస్ట్‌మార్టం పూర్తయింది. సంజయ్ గాంధీ ఆస్పత్రి ఫోరెన్సిక్ నిపుణుల వైద్య బృందం తన నివేదికను సమర్పించింది. చిన్నారి తలకు బలమైన గాయమైందని అలాగే రెండు నుండి నాలుగు పక్కటెముకలు విరిగిపోయాయని తెలిపింది. తీవ్ర రక్తస్రావం జరిగినట్టుగా తమ పరీక్షలో తేలిందని, పాప చనిపోయి సుమారు 30 గంటలు అవుతుందని తన నివేదికలో పేర్కొంది. ఛాతీ, తలపైన తీవ్ర గాయాలు, రక్తస్రావం, షాక్ వల్ల పాప చనిపోయివుండవచ్చని అభిప్రాయపడింది. మరోవైపు ఈ ఘటనపై ఢిల్లీ హైకోర్టు కూడా సీరియస్‌గా స్పందించింది. గడ్డకట్టుకు కుపోయే చలిలో పేదల ఆవాసాలను కూల్చడం అన్యాయమని న్యాయస్థానం ఆక్షేపించింది. ఈ వ్యవహారంలో అధికారులందరూ కోర్టు ముందు హాజరు కావాలని ఆదేశించింది. జాతీయ మావనహక్కులు సంఘం ఢిల్లీ ప్రభుత్వానికి, రైల్వే బోర్టుకు నోటీసులు జారీ చేసింది. కాగా ఢిల్లీలో ప్రతిపాదిత రైల్వే టెర్మినల్ నిర్మాణ ప్రాంతంలో గత శనివారం అర్థరాత్రి అక్రమ గుడిసెల తొలగింపు వ్యవహారం, చిన్నారి మరణం ఒక్కసారిగా ఉద్రిక్తతను రేకెత్తించిన విషయం తెలిసిందే. -
ఆ చిన్నారి ముందే చనిపోయింది..
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ప్రతిపాదిత రైల్వే టెర్మినల్ నిర్మాణ ప్రాంతంలో చాలారోజులుగా ఉన్న అక్రమ గుడిసెల తొలగింపు వ్యవహారం ఒక్కసారిగా ఉద్రిక్తతను రేకెత్తించింది. రైల్వే అధికారులు పోలీసుల సాయంతో షాకూర్ బస్తీలోని గుడిసెలను తొలగించడం, ఆ ప్రాంతంలో ఒక చిన్నారి మరణించడం లాంటి ఘటనలతో ప్రతిపక్షాలు ఈ అంశంపై తీవ్రంగా స్పందించాయి. పశ్చిమ ఢిల్లీలోని షాకూర్ బస్తీలో గుడిసెల కూల్చివేతకు రెండు గంటల ముందే చిన్నారి చనిపోయిందని రైల్వే శాఖ మంత్రి సురేశ్ ప్రభు పార్లమెంటులో ప్రకటించారు. శనివారం అర్ధరాత్రి జరిగిన ఈ కూల్చివేతలో రైల్వే అధికారుల అత్యుత్సాహం కారణంగానే ఆరు నెలల చిన్నారి మరణించిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటనపై ఆమ్ ఆద్మీ పార్టీ సహా విపక్షాలు పార్లమెంటులో వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దీనిపై స్పందిచిన మంత్రి ప్రభు.. ఆ చిన్నారి అనారోగ్యంతో చనిపోయిందని, బాధితులను, షాకూర్ బస్తీ వాసులను ఆదుకుంటామని తెలిపారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ రైల్వే అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై మెజిస్టీరియల్ దర్యాప్తుకు ఆదేశించాలంటూ ఆప్ ఆందోళనకు దిగింది. రాత్రంతా తీవ్రమైన చలిలోనే గడిపామని నిరాశ్రయులైన వందలాది మంది షాకుర్ బస్తీ వాసులు ఆరోపిస్తున్నారు. ముందస్తు నోటీసులు ఇవ్వకుండానే తమ ఇళ్లను కూల్చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. దుర్మార్గంగా వ్యవహరించిన అధికారులు తన చిన్నారిని పొట్టన బెట్టుకున్నారని చిన్నారి తండ్రి వాపోయాడు. ఈ ఆరోపణలను రైల్వే అధికారులు ఖండిస్తున్నారు. చిన్నారి మరణానికి, కూల్చివేతకు ఎలాంటి సంబంధం లేదని వాదిస్తున్నారు. ఇప్పటికే పలుసార్లు బస్తీ వాసులకు ఖాళీ చేయాల్సిందిగా నోటీసులిచ్చామని, అయినా ఫలితం లేకపోవడంతో.. కూల్చివేత తప్పలేదని అంటున్నారు. పోలీసులు ఖాళీ చేయించిన షాకూర్ బస్తీ స్థలంలోనే కొత్త ప్యాసింజర్ టెర్మినల్ నిర్మాణం కానుంది. ఈ నేపథ్యంలో కూల్చివేతలు, చిన్నారి మరణం ఉద్రిక్తతను రాజేసింది.