ఆ చిన్నారి ముందే చనిపోయింది..
ఆ చిన్నారి ముందే చనిపోయింది..
Published Mon, Dec 14 2015 1:56 PM | Last Updated on Sun, Sep 3 2017 1:59 PM
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ప్రతిపాదిత రైల్వే టెర్మినల్ నిర్మాణ ప్రాంతంలో చాలారోజులుగా ఉన్న అక్రమ గుడిసెల తొలగింపు వ్యవహారం ఒక్కసారిగా ఉద్రిక్తతను రేకెత్తించింది. రైల్వే అధికారులు పోలీసుల సాయంతో షాకూర్ బస్తీలోని గుడిసెలను తొలగించడం, ఆ ప్రాంతంలో ఒక చిన్నారి మరణించడం లాంటి ఘటనలతో ప్రతిపక్షాలు ఈ అంశంపై తీవ్రంగా స్పందించాయి.
పశ్చిమ ఢిల్లీలోని షాకూర్ బస్తీలో గుడిసెల కూల్చివేతకు రెండు గంటల ముందే చిన్నారి చనిపోయిందని రైల్వే శాఖ మంత్రి సురేశ్ ప్రభు పార్లమెంటులో ప్రకటించారు. శనివారం అర్ధరాత్రి జరిగిన ఈ కూల్చివేతలో రైల్వే అధికారుల అత్యుత్సాహం కారణంగానే ఆరు నెలల చిన్నారి మరణించిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటనపై ఆమ్ ఆద్మీ పార్టీ సహా విపక్షాలు పార్లమెంటులో వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దీనిపై స్పందిచిన మంత్రి ప్రభు.. ఆ చిన్నారి అనారోగ్యంతో చనిపోయిందని, బాధితులను, షాకూర్ బస్తీ వాసులను ఆదుకుంటామని తెలిపారు.
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ రైల్వే అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై మెజిస్టీరియల్ దర్యాప్తుకు ఆదేశించాలంటూ ఆప్ ఆందోళనకు దిగింది. రాత్రంతా తీవ్రమైన చలిలోనే గడిపామని నిరాశ్రయులైన వందలాది మంది షాకుర్ బస్తీ వాసులు ఆరోపిస్తున్నారు. ముందస్తు నోటీసులు ఇవ్వకుండానే తమ ఇళ్లను కూల్చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. దుర్మార్గంగా వ్యవహరించిన అధికారులు తన చిన్నారిని పొట్టన బెట్టుకున్నారని చిన్నారి తండ్రి వాపోయాడు.
ఈ ఆరోపణలను రైల్వే అధికారులు ఖండిస్తున్నారు. చిన్నారి మరణానికి, కూల్చివేతకు ఎలాంటి సంబంధం లేదని వాదిస్తున్నారు. ఇప్పటికే పలుసార్లు బస్తీ వాసులకు ఖాళీ చేయాల్సిందిగా నోటీసులిచ్చామని, అయినా ఫలితం లేకపోవడంతో.. కూల్చివేత తప్పలేదని అంటున్నారు. పోలీసులు ఖాళీ చేయించిన షాకూర్ బస్తీ స్థలంలోనే కొత్త ప్యాసింజర్ టెర్మినల్ నిర్మాణం కానుంది. ఈ నేపథ్యంలో కూల్చివేతలు, చిన్నారి మరణం ఉద్రిక్తతను రాజేసింది.
Advertisement
Advertisement