రెండు కేజీల వెండి, బంగారు రూపు అపహరణ
నాయుడుగూడెం (పెదపాడు) : మండలంలోని నాయుడుగూడెంలోని ఓ ఇంటిలో మంగళవారం రాత్రి దొంగలు పడ్డారు. రెండు కేజీల వెండి, బంగారు రూపు అపహరించుకుపోయారు. పోలీసుల కథనం ప్రకారం.. నాయుడుగూడెం గ్రామానికి చెందిన మాజీ జెడ్పీటీసీ సభ్యుడు కట్నేని లక్ష్మీనారాయణ చౌదరి ఇంటి గోడ దూకి లోపలకు ప్రవేశించిన దుండగులు, ఎడమవైపు ఉన్న గేటు కిటీకీ ఊచలు తొలగించి ఇంట్లోకి చొరబడ్డారు. దేవుడి మందిరంలోని పాత బీరువా తెరిచి అందులోని సుమారు రెండు కేజీల వెండి వస్తువులు, బంగారు రూపు అపహరించుకుపోయారు. సమాచారం తెలిసిన పెదపాడు పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనంతరం వేలిముద్రల నిపుణులు ఆధారాలు సేకరించారు. ఇంటి యజమాని ఫిర్యాదు మేరకు పెదపాడు ఏఎస్సై సత్యనారాయణ కేసు దర్యాప్తు చేస్తున్నారు.