టోల్ వసూల్
తిమ్మాపూర్, న్యూస్‌లైన్ : రాజీవ్ ఫోర్‌లేన్ రహదారిపై శనివారం అర్ధరాత్రి నుంచి టోల్‌టాక్స్ వసూలు ప్రారంభమైంది. జూన్ ఒకటో తేదీ నుంచి ప్రభుత్వం అనుమతివ్వడంతో.. ఒకటో తేదీ ప్రారంభమైన తర్వాత రాత్రి 12.01 గంటలకు హెచ్‌కేఆర్ రోడ్ వేస్ ఆధ్వర్యంలో టోల్‌టాక్స్ వసూళ్లు మొదలుపెట్టారు.
శనివారం రాత్రి 10 గంటలకు ఫోర్‌లేన్‌పై బసంత్‌నగర్, రేణికుంట, దుద్దెడ వద్దనున్న మూడు టోల్గేట్ల వద్ద ఒకేసారి పూజలు ప్రారంభించారు. రేణికుంటలో హెచ్‌కేఆర్ సీజీఎం రామకృష్ణ, గాయత్రి కన్స్ట్రక్షన్స్ వైస్ ప్రెసిడెంట్ వెంకటరెడ్డి, ప్రాజెక్టు మేనేజర్ కోటి లింగం, ప్రతినిధి విజయభాస్కర్ పాల్గొన్నారు. అన్ని టోల్గేట్ల వద్ద వాహనాల కోసం రెండు లేన్లు పోవడానికి, మరో రెండు లేన్లు రావడానికి ఏర్పాటు చేశారు.
ద్విచక్ర, త్రిచక్ర వాహనాలు, ట్రాక్టర్ల రాకపోకల కోసం అదనంగా మరో రెండు లేన్లను ఏర్పాటు చేశారు. టోల్గేట్ వద్ద అంబులెన్స్, క్రేన్‌తోపాటు పెట్రోలింగ్ వాహనాన్ని ఏర్పాటు చేశారు. రేణికుంట టోల్ ప్లాజా వద్ద కంట్రోల్ రూమ్ ఫోన్ నంబర్ 94910 60033, పెట్రోలింగ్ వాహనం ఫోన్ నంబర్ 94910 60044 అందుబాటులో ఉంటుందని హెచ్‌కేఆర్ ప్రతినిధులు తెలిపారు. ప్రమాదాలు జరిగితే కంట్రోల్ రూమ్ నంబర్‌కి ఫోన్ చేస్తే అంబులెన్స్‌ను, వాహనాలు రోడ్డుపై చెడిపోతే పెట్రోలింగ్ వాహనానికి ప్రయాణికులు ఫోన్ చేసి సేవలు వినియోగించుకోవచ్చని వివరించారు. టోల్ రేట్లు రెండేళ్లకోసారి మారుతాయని, మొత్తం 22 సంవత్సరాలు టోల్‌టాక్స్ వసూలు చేయడం జరుగుతుందని చెప్పారు.