ఎంత కష్టం.. ఎంత నష్టం..
టమోటా రైతుకు కష్టకాలమొచ్చింది. ఆదాయం సంగతి దేవుడెరుగు.. పెట్టుబడి కూడా వస్తుందన్న నమ్మకం కలగడం లేదు. కూళ్లు కూడా రావని అనేక చోట్ల తోటల్లోనే టమోటా కాయలను వదిలేస్తున్నారు.
మైదుకూరు టౌన్ న్యూస్‌లైన్: ఓడలు బండ్లు అవుతాయి.. బండ్లు ఓడలవుతాయంటే ఇదేనేమో..! నిన్నామొన్నటి వరకు చుక్క ల్లో విహరించిన టమోటా ధరలు నేడు ఢమాల్ అంటూ నేలమీదపడ్డాయి. రైతులను ఒక్కసారిగా గు ల్ల చేశాయి. మండలంలో గతేడాది 2వేల ఎకరాల్లో సాగు చేస్తే.. ఈ ఏడాది అంతకు రెట్టింపు సాగు చేశారు.
గతంలో రూ. 70-80లు పలికిన కి లో టమోటాలు నేడు 20 పైసల నుంచి 30 వరకు పలుకుతున్నాయి. దీంతో పెట్టుబడి కాదు క దా కోత కోసేందుకు కూలి డబ్బులు కూడా రావడం లేదంటూ రైతులు లబోదిబోమంటున్నారు.అక్టోబర్‌లో 30నుంచి 35 కిలోల టమోట బాక్సు ధర రూ.700 నుంచి 800 వరకు పలకగా.. ప్రస్తుతం అదే బాక్సు రూ.20లకు అడుగుతున్నారు.
ఫ్రీగా ఇస్తాం అన్నా...
పంట కోయడానికి ఒక్కో కూలికి రూ. 150లు ఇవ్వాలి. ఇదంతా ఎందుకని రైతులు పంటను పొలాల్లోనే వదిలేస్తున్నారు. కొందరు రైతులు ఫ్రీగా తీసుకెళ్లండని దళారులకు చెబుతున్నారు. మరికొందరు రైతులు పశువులకు, మేకలకు ఉపయోగించుకోమని పశుకాపరులకు చెబుతున్నారు.
చిన్నమండెంలో..
చిన్నమండెంలో ఈ రబీసీజన్‌లో దాదాపు 620 ఎకరాల్లో టమోటా ను సాగుచేశారు. నెల రోజుల క్రితం 30కిలోల బాక్సు 1200 రూపాలున్న ధర,ప్రస్తుతం 30 రూపాయలకు పడిపోయింది. దీంతో రైతులు డీలాపడిపోయారు. ఒక వైపు ధరలు తగ్గిపోవడం..మరో వైపు పంటకు సోకిన తెగుళ్లతో అప్పుల్లో కూరుకుపోయారు.
ఈ చిత్రంలో ఉన్న రైతు పేరు రెడ్డెయ్య. చాకిబండ గ్రామం. ఈయన మూడున్నర ఎకరాల్లో టమోటాను సాగు చేశారు. సాగుకు రూ. 3 లక్షలకు పైగా పెట్టుబడి పెట్టారు. దిగుబడి సమయానికి ధరలు పడిపోవడంతో దిగాలుపడ్డారు. ఎక్కువగా పంటను సాగు చేయటంతో ఇద్దరిని పనిపెట్టుకున్నామని, కనీసం అమ్మిన టమోటాల్లో వారి ఖర్చులకు కూడా రాలేదని వాపోతున్నారు.
ఈ ఫొటోలో ఉన్న రైతు పేరు వెంకటస్వామి. ఊరు రెడ్డివారిపల్లె. రెండు ఎకరాల్లో టమోటాను సాగు చేశారు. పెట్టుబడి కింద రెండు లక్షల రూపాయలు ఖర్చు వచ్చింది. దిగుబడి సమయానికి ధరలు పడిపోవడంతో పాటు అదే సమయంలో పంట కు తెగుళ్లు సోకడంతో పెట్టుబడంతా నష్టపోయారు. కూలీలకు ఇచ్చేందుకు కూడా డబ్బులు రాకపోవడంతో తోటలోని టమోటాలను కోయకుండా అలాగే వదిలిపెట్టినట్లు తెలిపారు.
అప్పు చేసి పంట సాగు చేస్తే..
ఎకరాకు 30 నుంచి 40 వేలు అప్పు చేసి ఐదెకరా ల్లో టమో టా సాగు చేశా. ఈ పంటలో లాభం వచ్చింటే పొలంకోసం తెచ్చుకు న్న అప్పును, బ్యాం కులు ఉన్న అప్పును తీర్చుదును. అసలు పంట వేసినప్పుడునుంచి ఇప్పటివరకు ఒక్కసారి కూడ కో యలేదు. ఇక అప్పులెలా తీర్చుకోవాలి. -వెంకటసుబ్బయ్య,
రైతు, కృష్టాపురం.
కూలికి పోయిన్నా..
కూలి చేసుకున్నా రోజూ. 150 రూ వచ్చేవి. ఈ టమో టా సాగుచేయ డం వల్ల 3నెలల నుంచి రాత్రి పగులు కష్టపడినా కూడా ఫలితం లేకుండా పోయింది. అడిగేవారులేక తోటలోనే వదిలేసినా. రమేష్, రైతు,విశ్వనాథపురం
రైతులకు న్యాయం చేయాలి
కడప అగ్రికల్చర్,న్యూస్‌లైన్: ఈ ఏడాది జిల్లా వ్యాప్తంగా రైతులు సుమారు పదివేల ఎకరాల్లో టమోట పంట సాగు చేశారు. చిన్నమండెం,గాలివీడు, లక్కిరెడ్డిపల్లె,సంబేపల్లె, రాయచోటి, మైదుకూరు, చింతకొమ్మదిన్నె మండలాల్లో అత్యధికంగాను, మిగిలిన మండలాల్లో ఓ మాదిరిగాను సాగు చేశారు.పంట చేతి కందే సమయంలో ధరలు మార్కెట్లో కుప్పకూలడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. జిల్లా మొత్తానికి కలిపి రోజుకు ప్రజలందరూ వాడినా 5,6 టన్నులే. కానీ మార్కెట్‌కు 10 నుంచి 15 టన్నుల వరకు దిగుబడి వస్తోందని ఉద్యాన అధికారులు చెబుతున్నారు. మార్కెట్‌కు అధిక దిగుబడులు రావడం.. అటు ఖరీఫ్, ఇటు రబీకాకుండాను మధ్యస్థంగా పంట రావడంతో ధరల సమస్య మొదలైందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ధరలు అధికంగా ఉన్నప్పుడు అతిగా స్పందించే మార్కెటింగ్‌శాఖ అధికారు లు ధరలు పతనమైనప్పుడు ఎందుకు పట్టించుకోరని రైతు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. రైతులకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాయి.