ప్రాక్టీస్ జోరు పెంచిన భారత్
* నెట్స్‌లో చెమటోడ్చిన టాప్-6 బ్యాట్స్‌మెన్
* రేపటి నుంచి వెస్టిండీస్‌తో తొలి టెస్టు
అంటిగ్వా: వెస్టిండీస్‌లో అడుగుపెట్టినప్పట్నించీ సరదాలు, షికారులు... మధ్యలో రెండు వార్మప్ మ్యాచ్‌లతో ఉల్లాసంగా గడిపిన భారత క్రికెట్ జట్టు ప్రాక్టీస్ ముమ్మరం చేసింది. రేపటి నుంచి (గురువారం) విండీస్‌తో తొలి టెస్టు నేపథ్యంలో శనివారం అంటిగ్వాకు చేరుకున్న కోహ్లిసేన సోమవారం నెట్స్‌లో తీవ్రంగా సాధన చేసింది. విజయ్, ధావన్; పుజారా, రాహుల్; విరాట్, రహానేలు వరుసగా మూడు నెట్స్‌లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశారు. ఒకరి బలం గురించి మరొకరు తెలుసుకోవడానికి వీలుగా జంటలుగా బరిలోకి దిగారు.
ఒక్కోక్కరు నాలుగు నుంచి ఆరు బంతులు ఎదుర్కొన్న తర్వాత స్ట్రయికింగ్‌ను మార్చుకున్నారు. గంట పాటు కొనసాగిన వీళ్ల ప్రాక్టీస్ తర్వాత వృద్ధిమాన్ సాహా, రోహిత్ శర్మ, జడేజా, మిగతా ఆటగాళ్లు నెట్స్‌లోకి వచ్చారు. విజయ్‌కు రాహుల్ సరైన జోడీ అని వార్తలు వస్తున్న నేపథ్యంలో... కోచ్, కెప్టెన్లిద్దరు అతని బ్యాటింగ్‌ను క్షుణ్ణంగా పరీశిలించారు. రాహుల్‌కు కీపింగ్ చేసే సత్తా కూడా ఉండటంతో తుది జట్టు కూర్పు ఎలా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది.
ఇషాంత్, బిన్నీ, షమీ, అశ్విన్, మిశ్రాలు తొలి సెషన్లో బౌలింగ్ ప్రాక్టీస్‌కే పరిమితంకాగా... చివర్లో జడేజా కలిశాడు. బౌలర్లందరూ తమ స్థాయిలో ఆకట్టుకున్నారు. కుడి చేతి వాటం బ్యాట్స్‌మన్‌కు లెగ్ బ్రేక్ బంతులు వేయడంలో (లెంగ్త్ విషయంలో) మిశ్రాకు కుంబ్లే పలు సూచనలు చేశారు. స్పిన్నర్ల బౌలింగ్‌లో బ్యాట్స్‌మన్ ఎక్కువగా స్వీప్ ఆడేందుకు ప్రయత్నించగా, కోహ్లి, రహానే, విజయ్‌లు రివర్స్ స్వీప్ కూడా ప్రాక్టీస్ చేశారు.
అవి బంగారు మాటలు: కోహ్లి
విండీస్ పర్యటనలో ఉన్న భారత జట్టుకు ఊహించని అదృష్టం దక్కింది. బ్యాటింగ్ దిగ్గజం వీవీఎన్ రిచర్డ్స్... టీమ్ బస చేసిన హోటల్‌కు రావడంతో క్రికెటర్లు ఆనందంలో తేలిపోయారు. ధావన్, రహానే, విజయ్, రాహుల్ సెల్ఫీలు దిగుతూ ‘కింగ్’ దగ్గర విలువైన సలహాలు, సూచనలను తీసుకున్నారు. రిచర్డ్స్ చెప్పినవి ‘బంగారు మాటలు’ అని విరాట్ వ్యాఖ్యానించాడు. ఈ మొత్తం సమావేశం గురించి ఆటగాళ్లు ట్వీట్లు చేశారు.
సిరీస్ గెలిస్తేనే... ర్యాంక్ నిలుస్తుంది!
దుబాయ్: వెస్టిండీస్‌తో జరగబోయే నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను కచ్చితంగా గెలిస్తేనే... ఐసీసీ ర్యాంకింగ్స్‌లో భారత్ రెండో స్థానం పదిలంగా ఉంటుంది. లేదంటే విలువైన ర్యాంకింగ్ పాయింట్లను కోల్పోవాల్సి వస్తుంది. ప్రస్తుతం 112 పాయింట్లతో ఉన్న కోహ్లి బృందం... విండీస్‌పై 3-0 లేదా అంతకంటే మెరుగ్గా సిరీస్‌ను సాధిస్తే పాయింట్లలోగానీ, ర్యాంక్లోగానీ ఎలాంటి మార్పు ఉండదు. ఒకవేళ 3-1 లేదా 2-0తో సిరీస్ గెలిచినా భారత్ 110 పాయింట్లకు పడిపోతుంది. కానీ అదే విండీస్ 3-1 లేదా 2-0తో సిరీస్‌ను సొంతం చేసుకుంటే టీమిండియా 98 పాయింట్లకు దిగజారుతుంది.