టెక్నాలజీ రంగంలో టాప్ లేడీస్
ప్రస్తుతం టెక్నాలజీ రంగం ప్రపంచాన్ని శాసిస్తోంది. రోజుకో కొత్త ఆవిష్కరణతో మానవ అవసరాలన్నింటినీ తీర్చేందుకు సిద్ధమంటోంది. సెల్‌ఫోన్, కంప్యూటర్, ఇంటర్నెట్.. ఇవి లేని జీవితాన్ని ప్రస్తుతం మనం ఊహించలేం. వీటి సాయంతో ఇంట్లో నుంచి కాలు బయట పెట్టకుండా ఆన్లైన్లోనే షాపింగ్ చేసేస్తున్నాం. ఫోన్, కరెంట్ బిల్లులు కట్టేస్తున్నాం. గంటల కొద్దీ లైన్లో నిలబడకుండా టికెట్ రిజర్వ్ చేసుకుంటున్నాం. డబ్బు పంపిస్తున్నాం, అందుకుంటున్నాం. ఇలా మనం అనుభవిస్తున్న అన్ని సౌకర్యాలూ టెక్నాలజీ పుణ్యమే.
ఇంతటి కీలక రంగంలో మహిళలూ కీలక పాత్ర పోషిస్తున్నారు. పెద్దపెద్ద సంస్థలను సైతం సమర్థంగా నిర్వహిస్తూ తమ సత్తా చాటుకుంటున్నారు. మన దేశంలో టెక్నాలజీ– బీపీవో రంగంలో 39 లక్షల మంది ఉద్యోగులుంటే అందులో 13 లక్షల మంది మహిళలేనని నాస్కామ్ ఇటీవలే వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ రంగ దిగ్గజాలైన ఐబీఎం మొదలు చాలా కంపెనీల్లో మహిళలు అత్యున్నత స్థానాల్లో ఉన్నారు. తమ పనితీరు, శక్తి సామర్థ్యాలతో దిగ్గజ సంస్థల్ని విజయతీరాల వైపు నడిపిస్తున్న మహిళల గురించి తెలుసుకుందాం..
సుశాన్ వోజ్సిస్కీ యూట్యూబ్ సీఈవో
నేటి సాంకేతిక యుగంలో యూట్యూబ్ గురించి తెలియని వారుండరు. ప్రపంచంలోనే అతిపెద్ద వీడియో షేరింగ్ ప్లాట్‌ఫాంగా సామాన్యుడి నుంచి కోటీశ్వరుడి వరకు అందరినీ ఆకట్టుకునే యూట్యూబ్ సంస్థను నడిపిస్తున్నదీ ఒక మహిళే. 1999లో గూగుల్‌లో మార్కెటింగ్ మేనేజర్‌గా తన ఉద్యోగ ప్రస్థానాన్ని ప్రారంభించిన సుశాన్ అనతి కాలంలోనే ఆ సంస్థ అడ్వర్టయిజింగ్ అండ్ కామర్స్ విభాగానికి సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అయ్యారు. యూట్యూబ్, డబుల్ క్లిక్‌లను గూగుల్ వశం చేసుకోవాలన్న ఐడియా కూడా ఆమెదే. ఈ రెండింటినీ గూగుల్ సొంతం చేసుకున్న తర్వాత కొన్నేళ్లపాటు వాటి బాధ్యతలను సుశాన్ చూశారు. 2014లో యూట్యూబ్ సీఈవోగా బాధ్యతలు చేపట్టి సంస్థను విజయవంతంగా నడిపిస్తున్నారు.
సఫ్రా కాట్జ్: ఒరాకిల్ కో సీఈవో
సాఫ్ట్వేర్ దిగ్గజం ఒరాకిల్ విజయాల్లో కీలక సూత్రధారి. ఇజ్రాయెల్‌లో పుట్టిన ఈమె ఆరేళ్లకే అమెరికా వచ్చేశారు. బ్యాంకింగ్ రంగంలో అడుగుపెట్టి అనతికాలంలోనే బ్యాంకింగ్ దిగ్గజం హెచ్ఎస్బీసీ హోల్డింగ్స్‌లో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ స్థాయికి ఎదిగారు.1999లో ఒరాకిల్‌లో చేరి 2001 చివరికల్లా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్‌లో ఒకరయ్యారు. 2004లో కంపెనీ ప్రెసిడెంట్‌గా, 2014 నుంచి మార్క్ హర్డ్‌తో కలిసి కంపెనీ కో సీఈవోగా కొనసాగుతున్నారు.
షెరిల్ శాండ్‌బర్గ్ : ఫేస్‌బుక్‌కు సీవోవో
టెక్నాలజీ రంగంలో శక్తివంతమైన మహిళల పేర్లు చెప్పుకోవాల్సి వస్తే కచ్చితంగా షెరిల్ శాండ్‌బర్గ్ పేరు ముందు వరుసలో ఉంటుంది. ప్రపంచాన్ని ఏకం చేస్తున్న ఫేస్‌బుక్‌కు సీవోవో (చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్)గా ఈమె ఉన్నారు. ఫేస్బుక్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ అయిన తొలి మహి కూడా. ఈ సంస్థలో చేరకముందు గూగుల్‌లో పనిచేశారు. అక్కడ యునైటెడ్ స్టేట్స్ ఫర్ ట్రెజరీకి చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా కీలక బాధ్యతలు నిర్వహించారు. పనిచేసే చోట ప్రధానంగా కనిపించే జెండర్ గ్యాప్, మహిళల సమస్యలపై.. లీన్ఇన్– ఉమెన్, వర్క్ అండ్ ద విల్ టు లీడ్ అనే పుస్తకాన్ని కూడా రాశారు.
ఏంజెలా అహ్రెండస్: యాపిల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్
లగ్జరీ బ్రాండ్ బర్‌బెర్రీకి సీఈవోగా 2006 నుంచి ఎనిమిదేళ్లు ఈమె పనిచేశారు. తర్వాత టెక్నాలజీ దిగ్గజం యాపిల్ సంస్థలో రిటైల్ అండ్ ఆన్లైన్ స్టోర్స్ విభాగానికి వైస్ ప్రెసిడెంట్‌గా చేరారు. తన పనితీరుతో మేనేజ్మెంట్ను మెప్పించారు. అత్యధిక జీతం తీసుకునే ఉద్యోగి స్థాయికి ఎదిగారు. ఆమె వార్షిక వేతనం ఏకంగా 70 మిలియన్ డాలర్లు (మన రూపాయల్లో 467 కోట్లు). బ్రిటన్ ప్రధాని బిజినెస్ అడ్వయిజరీ కౌన్సిల్లో స్థానం దక్కించుకోవడం ఏంజెలా పనితీరుకు నిదర్శనం.
గిన్నీ రొమెట్టీ: ఐబీఎం చైర్పర్సన్, సీఈవో
ఈమె పేరు మనలో చాలా మందికి తెలియకపోవచ్చు. కానీ ఆమె సీఈవోగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఐబీఎం సంస్థ గురించి చెప్పగానే ఆమె కార్యదక్షత ఏపాటిదో ఇట్టే అర్థమైపోతుంది. 2011 నుంచి అత్యున్నత బాధ్యతల్ని సమర్థంగా నిర్వర్తిస్తున్న ఆమె ఐబీఎం సంస్థలో అంచెలంచెలుగా ఎదిగారు. అంతేకాకుండా వ్యాపార రంగంలో అత్యంత శక్తిమంత 50 మంది మహిళలతో ఫార్చ్యూన్ మ్యాగజైన్ రూపొందించే జాబితాలో వరుసగా పదేళ్లపాటు స్థానం సంపాదించుకోవడం ఆమె శక్తిసామర్థ్యాలకు నిదర్శనం. ఫోర్బ్స్ 2014లో ప్రకటించిన వరల్డ్ 100 మోస్ట్ పవర్ఫుల్ ఉమెన్స్ జాబితాలో ఈమెకి చోటు దక్కింది.
దేవయాని ఘోష్ : ఇంటెల్ సేల్స్ అండ్ మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్
సెమీకండక్టర్స్, కంప్యూటర్ ప్రాసెసర్ల తయారీలో దిగ్గజ సంస్థ ఇంటెల్‌లో సేల్స్ అండ్ మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్‌గా సమర్థంగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు దేవయాని ఘోష్. అలాగే ఇంటెల్ దక్షిణాసియా రీజియన్‌కు ఎండీగా కూడా పనిచేస్తున్నారు. ఈ ప్రాంతంలో టెక్నాలజీ వాడకాన్ని మరింత పెంచాలన్న లక్ష్యంతో దక్షిణాసియాలోని పలు దేశాల ప్రభుత్వాలతో కలసి పనిచేస్తున్నారు. ఫార్చ్యూన్ ఇండియా రూపొందించిన 50 మోస్ట్ పవర్ఫుల్ ఉమెన్స్ ఇన్ ఇండియా జాబితాలో ఘోష్‌ది 11వ స్థానమంటే ఆమె శక్తి సామర్థ్యాలను అంచనా వేయొచ్చు.
వనితా కుమార్: క్వాల్కామ్ వైస్ ప్రెసిడెంట్
క్వాల్కామ్ టెక్నాలజీకి సంబంధించిన కీలక వ్యూహ కర్తల్లో వనిత ఒకరు. మోడెం ఎస్డబ్ల్యూ ఇంటర్ఫేస్ టెక్నాలజీ టీమ్‌లను ప్రపంచవ్యాప్తంగా నడిపిస్తున్నారు. వైర్లెస్ ఇండస్ట్రీలో రెండు దశాబ్దాల సుదీర్ఘ అనుభవం వనితా కుమార్ సొంతం. ఎంబెడెడ్ సాఫ్ట్వేర్ ఆర్కిటెక్చర్, డిజైన్, డెవలప్మెంట్ రంగాల్లో బాగా పట్టున్న వనిత కంపెనీకి ఆయా విభాగాల్లో కీలక వ్యక్తిగా మారారు. క్వాల్కామ్ 5జీ, సెల్యులార్ ఐవోటీ ఎస్డబ్ల్యూ సాంకేతికతకు రోడ్‌మ్యాప్ తయారు చేయడంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు.