కోర్టులకు మరో 'కఠిన' పరీక్ష
రెండో మాట
‘న్యాయ వ్యవస్థ రోజూ కఠిన పరీక్షలు ఎదుర్కొంటున్నది. విశ్వసనీయతతోనే ఈ పరీక్షలలో నెగ్గడం సాధ్యం. రాజ్యాంగ వ్యవస్థల మనుగడ అంతా ఈ విశ్వసనీయత మీదనే ఆధారపడి ఉంది.’
సుప్రీం కోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ చలమేశ్వర్ (మార్చి 20-21న జరిగిన రాష్ర్ట స్థాయి న్యాయాధికారుల సమావేశాలలో)
‘న్యాయపాలనలో పారదర్శకత అవసరం. మన దేశంలో రాజ్యాంగం కన్నా ఎవరూ ఎక్కువ కాదు. అందరం రాజ్యాంగం కిందనే పని చేయాలి. న్యాయవ్యవస్థను దుర్వినియోగం చేసే చర్యల పట్ల కఠినంగా వ్యవహరించాలి.’
సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రమణ (అదే సమావేశంలో)
న్యాయవ్యవస్థ ఇప్పుడు ఎన్ని రకాల ఆటుపోట్లనూ, కఠిన పరీక్షలనూ, పాలనా వ్యవస్థ జోక్యాన్నీ ఎదుర్కొనవలసి వస్తున్నదో తెలుగు ప్రాంతాల వారైన ఆ ఇరువురు న్యాయమూర్తులకు తెలుసు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ శాసన సభలో సినీనటి, వైఎస్ఆర్సీపీ సభ్యురాలు రోజా వివాదం విషయంలో కూడా న్యాయవ్యవస్థ అలాంటి కఠిన పరీక్షనే ఎదుర్కొంటున్నది. ఆ శాసన సభ్యురాలి ఉదంతం ఒక్కటే కాదు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కూటమి దృష్టిలో పౌరుడి ప్రశ్నించే హక్కు ‘దేశ వ్యతిరేక చర్య’గా, ఫ్యూడల్ పరిభాషలో ‘రాజద్రోహం’గా మారిపోతోంది.
ఆంధ్రప్రదేశ్‌లో అధికారం చేపట్టిన తెలుగుదేశం మద్దతును బీజేపీ కీలకంగా పరిగణిస్తున్నది. ఈ బంధం వల్లనే ఏ క్షణంలో ఏ విపరీత పరిణామం ఎదురైనా తప్పించుకోలేని స్థితిలో ఉన్నాం. అందుకేనేమో జేఎన్‌యూ, హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయా లలో విద్యార్థి నాయకులపై అవాంఛనీయ ఘటనలూ, వేధింపులూ, ఆరోపణ లూ కొనసాగుతున్న తరుణంలో జస్టిస్ చలమేశ్వర్ అంతా ఆలోచించదగిన ఒక ప్రశ్న వేశారు: ‘అసలీ దేశంలో ఏం జరుగుతున్నదో తెలుసుకోగోరు తున్నాను’ అని.
ఎమ్మెల్యే రోజాను ఏడాది పాటు సభ నుంచి సస్పెండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ చేసిన తీర్మానం న్యాయవ్యవస్థ పారదర్శకతకు మరో సారి కఠిన పరీక్షగా మారబోతున్నది. రోజా మొదట రాష్ట్ర న్యాయస్థానాన్ని ఆశ్రయించినా సరైన స్పందన లేకపోవడంతో, తనకు న్యాయం చేయవలసిందిగా అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ అంశంలో సుప్రీంకోర్టు ధర్మాసనం చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ప్రతిపత్తికీ, పారదర్శకతకూ ప్రశ్నార్థకంగా మారాయి. ఆ తరువాతే గౌరవ రాష్ట్ర హైకోర్టు కొత్త అడుగు వేయవలసి వచ్చింది.
ఏం జరుగుతోంది?
జస్టిస్ చలమేశ్వర్ ఒక క్షోభతో వేసిన ప్రశ్న వలెనే, ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానంలో ఏం జరుగుతోందనీ, జరిగిన పరిణామాలను చూస్తే ‘ఏదో తప్పు జరుగుతోంది’ (‘సంథింగ్ రాంగ్, సంథింగ్ రాంగ్’) అనిపిస్తున్నదనీ చెప్పవలసి వచ్చింది. అసలు స్పీకర్ కార్యాలయం ఏమి చేస్తున్నట్టు? శాసనసభ్యురాలి సస్పెన్షన్ ఉత్తర్వును అధికారి కోర్టుకు అందకుండా చేయడమేమిటి? అది ఆయన పరిధి కాదు అని కూడా సుప్రీం వ్యాఖ్యానించవలసి వచ్చింది. వాదప్రతివాదాలలో అధికార, విపక్షాల మధ్య ఉద్రేకాలు పెచ్చరిల్లి అవాంఛనీయ ఘటనలకు దారితీయరాదన్న ఉద్దేశంతో అనుభవజ్ఞులు మనకొక పాఠం చెప్పేవారు. రెండుసభలు (అసెంబ్లీ, కౌన్సిల్) అవసరం ఏమిటంటే, కౌన్సిల్లో పెద్ద మనుషులు సభ్యులుగా ఉంటారు కాబట్టి అక్కడి వాతావరణం ఉద్రేకాలకు దూరంగా, ‘చల్లగా’ ఉంటుందని చెప్పేవారు.
ఇప్పుడు ఎల్లకాలం ఉభయసభలలోనూ మండుటెండలే కాస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి, అధికారంలోఉన్న తెలుగుదేశం ముందు ముందు ఎలాంటి పరిణామాలను ఊహిస్తున్నదో గానీ, ఎన్నికలలో బీజేపీని తోడు తెచ్చుకుంది. ఎన్నికల తరువాత నుంచీ వైఎస్ఆర్సీపీ ఎంపీలకూ, ఎమ్మెల్యేలకూ ఎరలు వేస్తూనే ఉంది. భవిష్యత్ పరిణామాల పట్ల ఎలాంటి ఊహలూ లేకుంటే ఎరవేసి అధికార పక్షంలో చేర్చుకోవలసిన అవసరం లేనేలేదు. నిజానికి తెలుగుదేశం తెచ్చుకుంటున్న ‘వాపు’ ప్రస్తుత భాగస్వామి బీజేపీ బలపడకుండా ఉండడం కోసమే.
అందుకే ప్రతిపక్షాన్ని చీల్చడం ద్వారా తన బలాన్ని పెంచుకోవాలని ఆ పార్టీ ఉబలాటపడుతున్నది. నిజానికి ఉత్తరాఖండ్, అసోం, అరుణాచల్‌ప్రదేశ్‌లలో ఎలాంటి అస్థిర రాజకీయ పరిణామాలకు బీజేపీ కారణమవుతున్నదో, చట్టబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలను కూల్చడానికి ప్రయత్నిస్తున్నదో గమనిస్తే భవిష్యత్తులో తన వాపునకు కూడా ముప్పు తప్పదన్న విషయం తెలుగుదేశం గుర్తించ గలుగుతుంది.
ఎక్కడైనా సరే అధికార పార్టీల ఉద్రేకాలలో, నిరంకుశ నిర్ణయాలలో స్పీకర్లు పావులు కారాదు. అలాంటి ఉద్రేకాలకు, పార్టీ ఆలోచనలకు అతీతంగా సభాపతులు ఎలా వ్యవహరించవలసి ఉంటుందో మౌలాలంకర్, అనంతశయనం అయ్యంగార్, నీలం సంజీవరెడ్డి, జీఎస్ థిల్లాన్, ఇటీవలి సోమనాథ్ చటర్జీ వంటి వారు నిరూపించారు. ప్రజల మనసులలో చిరస్థాయిగా నిలిచారు. అసలు విపక్షాలు స్పీకర్ల మీద ఎలాంటి స్థితిలో అవిశ్వాసం ప్రవేశపెడతాయి? ఉత్కళ్ విశ్వవిద్యాలయంలో రాజనీతిశాస్త్ర విభాగంలో పనిచేసిన కేవీరావు ‘ఇండియాలో పార్లమెంటరీ ప్రజాస్వామ్యం’ తీరుతెన్నులను వివరిస్తూ ఈ ప్రశ్నకు ఇలా సమాధానం (1961) చెప్పారు: ‘శాసన సభాపతులు సభా వ్యవహారాల నిర్వహణలో నిష్పాక్షికంగా ఉండడమే కాదు, అలా ఉన్నట్టు సభవారు భావించేలా కనిపించాలి.
ఎందుకంటే పక్షపాతంతో వ్యవ హరించే స్పీకర్లు ప్రజాస్వామ్యానికి ఏవగింపుగానే ఉంటారు. అందువల్లనే రాజకీయపక్షాలు ఈ అత్యంత కీలక ప్రజాస్వామ్య వ్యవస్థను కంటికి రెప్పలా కాపాడుకోగలగాలి.’ ఇలా ఆయన ఎందుకు అనవలసి వచ్చింది? ఇప్పటి మాదిరిగానే, అప్పుడు కూడా మంత్రిపదవుల కోసం స్పీకర్ పదవులను మారకపు సరుకులుగా మారకం వేయించుకున్న సంఘటనలు ఉన్నాయట. ఒక రాష్ట్రంలో అయితే ఒకే ఒక్క రోజులో స్పీకర్ కాస్తా ముఖ్యమంత్రిగా వేషం మారిస్తే, మరొక మంత్రి స్పీకర్‌గా మారిపోయాడట.
నిజానికి ఇలాంటి పరిణామాలను చర్చలలో ఉన్న రాజ్యాంగ నిర్ణయ సభ (1946-49) ఎన్నడూ ఊహించలేదు. అలాగే ‘స్పీకర్‌పైన సంబంధిత శాసనసభలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం అనేది, సభా నిర్వహణ తీరుతెన్నుల మీద ప్రతిపక్షం ఎంతో మనస్తాపం చెందితే తప్ప, జరగదు’ అని కూడా ప్రొఫెసర్ రావ్ అభిప్రాయపడ్డారు. ఎన్టీఆర్ వెన్నుపోటు వ్యవహారంలో, తరువాత చంద్రబాబు తొమ్మిదేళ్ల పాలనలో జరిగిన ఈ తరహా పరిణామాలను ప్రజలు మరచిపోలేదు.
నిష్పాక్షికంగా ఉండాలి
ఎన్నికలలో అధికార పార్టీ తరఫున గెలిచిన వారే చట్టసభలకు స్పీకర్లుగా ఎన్నికవుతారు. అయితే స్పీకర్ పదవికి ఎంపికైన తరువాత పార్టీలకు అతీతంగా నడుచుకోవాలి. అధికార విపక్షాలకు సమంగా న్యాయం అందించడానికి తక్కెడ పట్టాలి. కానీ ఇలా జరగడం లేదు. అందుకే స్పీకర్‌గా ఎన్నికైన వారు పార్టీకి రాజీనామా చేసి, తరువాత కూడా ఇండిపెండెంట్లుగానే పోటీ చేయాలని కొన్ని దేశాలలో ఉద్యమం మొదలైంది. కానీ ఫిరాయింపులు మొదటినుంచి ఉన్నాయి. అభ్యర్థులు గోడ దూకడానికి సిద్ధంగానే ఉంటున్నారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో 1950 నాటికే ప్రవేశించిన ఈ వ్యాధి నిరంకుశత్వంగా మారింది.
అంబేడ్కర్ ప్రభృతులు రూపొందించిన రాజ్యాంగాన్ని మనం ఆమోదించుకున్న తరువాత, తన ఎన్నిక అనంతరం పార్లమెంటుకు ఎందుకు రాజీనామా చేస్తున్నాడో వివరించడానికి ప్రయత్నించినప్పుడు మాట్లాడే అవకాశం రాకపోవడం దీని ఫలితమే. సభలో హైందవంలో గూడు కట్టుకున్న కుల వ్యవస్థ గురించి ఆయన విమర్శించబోయినందుకు ఆయన నోరు నొక్కేశారు. రాజ్యాంగం పూచీ పడిన వాక్, సభా స్వాతంత్య్రాలకు భావ ప్రకటనా స్వేచ్ఛకు నేటి బీజేపీ పాలనలో కాదు, అరవయ్యేళ్ల నాడే, కాంగ్రెస్ పాలనలో సంకెళ్లు తగిలించడానికి శ్రీకారం జరిగిందని గుర్తించాలి.
అలాగే 1954లో ఒక రాష్ట్ర గవర్నర్ ప్రవర్తన మీద చర్చ జరక్కుండా తప్పించేశారు. కొన్ని సందర్భాలలో కొందరు స్పీకర్ల ప్రవర్తన హుందాగా లేదనడానికి పార్లమెంటరీ భాషకు విరుద్ధంగా స్పీకర్లు ప్రసంగిస్తున్నారని చెప్పే ఉదాహరణ- కామత్ అనే ఒక గౌరవ సభ్యుడు స్పీకర్ మాటలకు నిరసన తెలియచేయగా, ‘నీవు అతిగా ప్రవర్తిస్తున్నావ్! సీటులో నుంచి ఎత్తి సభ బయటపడేస్తాను’ అని ఒక స్పీకర్ (ఏప్రిల్ 21,1956, పత్రికలలో వార్త) అన్నాడట.
శాసనకర్తకూ హక్కులు
ఏ సభ్యుడి మీద అయినా అనర్హత వేటు వేయడానికి శాసన వేదికకు హక్కు ఉన్నా, ఆ అంశాన్ని గవర్నర్ అంతిమ నిర్ణయానికి వదలాలనీ, అయితే గవర్నర్ తన నిర్ణయాన్ని తెలియచేసే ముందు ఆ విషయం మీద ఎన్నికల కమిషన్ అభిప్రాయాన్ని విధిగా తెలుసుకోవాలనీ (ఎన్నికల సంఘం వర్సెస్ సుబ్రహ్మణ్యం స్వామి కేసు-1966)సుప్రీంకోర్టు ప్రకటించింది. లెజిస్లేచర్ నిర్ణయాలు ‘హేతుబద్ధంగానూ, అదుపు తప్పకుండానూ’ ఉండాలని చెప్పింది కూడా.
రాజ్యాంగ- ప్రభుత్వ/ శాసనవేదిక/ న్యాయవ్యవస్థల అధికారాలు స్పష్టంగా విభజించి ఉన్నందున శాసనవేదికల నిర్వహణ అధికారాలలో కోర్టుల జోక్యం తగదన్న వాదనను సుప్రీంకోర్టు పలుమార్లు తోసిపుచ్చింది. చట్టాలనూ, శాసనసభల నిర్ణయాలనూ సమీక్షించే హక్కును రాజ్యాంగం కోర్టులకు దఖలు పరిచిందని మరవరాదు. కోర్టు తీర్పులను తిరిగి సమీక్షించుకునే హక్కు కూడా కోర్టులకు ఉందని (లీలా థామస్ కేసులో) ఎంతో హుందాగా సుప్రీంకోర్టు అంగీకరించింది. శాసనకర్త అయినంత మాత్రాన అతడు/ఆమె పౌర, ప్రాథమిక హక్కులను కత్తిరించలేరని కూడా సుప్రీంకోర్టు పలుమార్లు ప్రకటించింది.
- ఏబీకే ప్రసాద్
సీనియర్ సంపాదకులు
abkprasad2006@yahoo.co.in