Pahalgam: నెత్తురోడిన కశ్మీరం.. ఉగ్రదాడిలో 26 మంది బలి
పహల్గాం/శ్రీనగర్/న్యూఢిల్లీ: అందాల కశ్మీరం ఎరుపెక్కింది. ఉగ్ర ఉన్మాదం మరోసారి ఒళ్లువిరుచుకుంది. పర్యాటకులపై తూటాల వర్షం కురిసింది. వారిపై ఉగ్ర ముష్కరులు విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు. మినీ స్విట్జర్లాండ్‌గా పేరొందిన పహల్గాంలోని బైసారన్ ప్రాంతంలో మంగళవారం మధ్యాహ్నం జరిగిన ఈ దారుణానికి 26 మంది పర్యాటకులు బలయ్యారు. 20 మందికి పైగా గాయపడ్డారు. మృతుల్లో ఇద్దరు విదేశీయులున్నారు. వారిలో ఒకరు నేపాలీ కాగా మరొకరిది యూఏఈ. మరో ఇద్దరు స్థానికులు కాగా మిగతావారు కర్నాటక, మహారాష్ట్ర, గుజరాత్, యూపీ, బిహార్ తదితర రాష్ట్రాలకు చెందినవారు. 2019లో పుల్వామాలో సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై టెర్రరిస్టులు కాల్పులకు దిగి 47 మందిని పొట్టన పెట్టుకున్న అనంతరం కశ్మీర్లో జరిగిన అతి పెద్ద దాడి ఇదే. దీనిపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఇది తమ పనేనని పాకిస్తాన్‌కు చెందిన నిషేధిత ఉగ్ర సంస్థ లష్కరే తొయిబా తాలూకు ముసుగు సంస్థ ద రెసిస్టెన్స్ ఫ్రంట్ (టీఆర్ఎఫ్) ప్రకటించుకుంది. ప్రధాని నరేంద్ర మోదీతో సహా పారీ్టలకు అతీతంగా నేతలంతా దాడిని ముక్త కంఠంతో ఖండించారు. ఉగ్రవాదులది మతిలేని ఉన్మాదమంటూ మోదీ మండిపడ్డారు. ‘‘ఈ హేయమైన దాడికి పాల్పడ్డ వారిని వదిలే ప్రసక్తే లేదు. వారందరినీ చట్టం ముందు నిలబెడతాం. ముష్కరుల కుటిల అజెండా ఫలించబోదు. ఉగ్రవాదంపై రాజీలేని పోరు జరపాలన్న మా సంకల్పం మరింత బలపడింది’’ అని ప్రకటించారు. ‘‘మృతుల కుటుంబీకులకు నా ప్రగాఢ సానుభూతి. గాయపడ్డవారు వెంటనే కోలుకోవాలని ప్రార్థిస్తున్నా. బాధితులందరికీ అన్నివిధాలా సాయం అందజేస్తున్నాం’’ అని ప్రధాని పేర్కొన్నారు. సౌదీ అరేబియాలో ఉన్న ఆయన విషయం తెలియగానే పర్యటనను అర్ధంతరంగా ముగించుకుని భారత్ తిరిగొచ్చారు. అంతకుముందు సౌదీ నుంచే కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో మాట్లాడారు. అనంతరం కేంద్ర హోం శాఖ కార్యదర్శి గోవింద్ మోహన్, ఇంటలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ తపన్ దేకా తదితర ఉన్నతాధికారులు, ఢిల్లీలో ఉన్న జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా తదితరులతో షా ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఆ వెంటనే ప్రధాని సూచన మేరకు వారందరితో కలిసి మంగళవారం రాత్రే ప్రత్యేక విమానంలో హుటాహుటిన కశ్మీర్ చేరుకున్నారు. రాజ్‌భవన్‌లో పరిస్థితిని సమీక్షించారు. ‘‘తాజా పరిస్థితిని మోదీకి నివేదించా. ఉగ్ర దాడి నన్ను తీవ్రంగా కలచివేసింది. దాడికి తెగబడ్డవారిని వదిలే ప్రసక్తే లేదు. వారి వెనకున్న సూత్రధారులను కూడా ఉక్కుపాదంతో అణచివేస్తాం’’ అంటూ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఆయన బుధవారం ఘటనాస్థలిని సందర్శించనున్నారు. ఇది కనీవినీ ఎరగని పిరికిపంద చర్య అంటూ జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా మండిపడ్డారు. ఉగ్రవాదుల కోసం పహల్గాం, పరిసర ప్రాంతాలన్నింటినీ భద్రతా దళాలు జల్లెడ పడుతున్నాయి. జమ్మూ కశ్మీర్ అంతటా భద్రతను కట్టుదిట్టం చేశారు. అమెరికా ఉపాధ్యక్షుడు కుటుంబసమేతంగా భారత్‌లో పర్యటిస్తున్న వేళ ఈ దాడి జరగడం గమనార్హం. దీన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తీవ్రంగా ఖండించారు. బాధితుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఉగ్రవాదంపై రాజీలేని పోరులో భారత్‌కు పూర్తిగా వెన్నుదన్నుగా నిలుస్తామని నేతలిద్దరూ పునరుద్ఘాటించారు. ‘‘కశ్మీర్ దారుణం నన్ను తీవ్రంగా కలచివేసింది. ఈ విషయంలో ప్రధాని మోదీకి, భారత పౌరులకు అన్నివిధాలా మద్దతుగా ఉంటాం’’ అని ట్రంప్ తన సోషల్ మీడియా హాండిల్ ట్రూత్‌సోషల్‌లో పేర్కొన్నారు. ఈ దాడిని దారుణ నేరంగా పుతిన్ అభివర్ణించారు. పెళ్లయిన 6 రోజులకే నూరేళ్లు నిండాయికాల్పుల్లో భర్తను కోల్పోయిన నవవధువుపెళ్లయి కాళ్లకు పారాణి ఆరకముందే ఆ నవవధువు జీవితం తలకిందులైంది. భర్తను ఉగ్రవాదులు పొట్టనపెట్టుకోవడంతో ఆ నవవధువు తన భర్త మృతదేహాన్ని పట్టుకుని దిక్కులు పిక్కటిల్లేలా ఏడ్చింది. ఈ యువజంట ఏ రాష్ట్రానికి చెందిన వాళ్లు అనే వివరాలు ఇంకా తెలియరాలేదు. ‘‘మాకు పెళ్లయి కేవలం ఆరు రోజులే అవుతోంది. ఘటన జరిగినప్పుడు మేమిద్దరం పానీపూరీని ఆస్వాదిస్తున్నాం. హఠాత్తుగా ఒక ఉగ్రవాది మా వద్దకు వచ్చాడు. నీ భర్త ముస్లింకాదుకదా అని అన్నాడు. వెంటనే ఆయన తలకు తుపాకీ గురిపెట్టి కాల్చి వెళ్లిపోయాడు. రక్తపు మడుగులో ఉన్న నా భర్తను ఎవరైనా కాపాడండి’’అంటూ ఆ మహిళ ఏడుస్తున్న హృదయ విదారక వీడియో దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా షేర్ అవుతున్నాయి.