టీపీసీసీ కార్యదర్శి కల్పనాకుమారి మృతి.. రాహుల్ సంతాపం
సాక్షి, భూదాన్‌పోచంపల్లి: టీపీసీసీ కార్యదర్శి, యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి పట్టణానికి చెందిన తడక కల్పనాకుమారి(44) అనారోగ్యంతో మృతిచెందారు. హైదరాబాద్‌లోని బసవతారకం కేన్సర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజామున మృతిచెందారు. మృతురాలికి భర్త యాదగిరి(అసిస్టెంట్ ఫ్రొఫెసర్, నిజాం కళాశాల), ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కల్పనాకుమారి మృతి పట్ల ఏఐసీసీ నాయకుడు రాహుల్‌గాంధీ ప్రగాఢ సంతాపం తెలిపారు. కల్పనాకుమారి దళితులు, మహిళల హక్కుల కోసం పోరాడారని గుర్తుచేసుకొన్నారు. క్రియాశీలకంగా పనిచేస్తున్న కల్పనాకుమారి మృతి పార్టీకి తీరనిలోటని పేర్కొన్నారు.
ఏఐసీసీ రాష్ట్ర ఇన్చార్జి, పీసీసీ అధ్యక్షుడి నివాళి
కల్పనాకుమారి మృతికి ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మాణిక్యం ఠాకూర్, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సంతాపం తెలిపారు. గాంధీభవన్‌లో కల్పనాకుమా రి చిత్రపటానికి ఏఐసీసీ సభ్యుడు అంజన్‌కుమార్ యాదవ్‌తో కలసి పూలమాల లు వేసి నివాళులర్పించారు. అలాగే పీసీసీ మాజీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మె ల్యే సీతక్క, ఏఐసీసీ సభ్యుడు దాసోజు శ్రవణ్‌కుమార్, యాదాద్రి భువనగిరి జిల్లా డీసీసీ అధ్యక్షుడు కుంభం అనిల్‌కుమార్‌రెడ్డిలు హైదరాబాద్‌లోని కల్పనాకుమారి ఇంటి వద్ద ఆమె మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.