ఆ ప్లీడర్లు మాకొద్దు!
సాక్షి, హైదరాబాద్: అతనొక చెట్టుకింద ప్లీడరు.. ఎలాగైనా టెన్యూర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ (టీపీపీ) అవ్వాలనుకున్నాడు. తెలిసిన నేతను పట్టుకుని ఏకంగా డిస్ట్రిక్ సెషన్స్ కోర్టులో టీపీపీగా పాగా వేశాడు. న్యాయశాస్త్రంపై పెద్దగా పట్టులేకపోవడం, అనుభవం అంతంత మాత్రంగానే ఉండటంతో వచ్చిన కేసుల్లో చాలావరకు ఓడిపోతున్నాడు.
కోర్టులో చేతులెత్తేస్తున్న ఇలాంటి టీపీపీల వల్ల పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. ‘దిశ’లాంటి సంచలన కేసులు నమోదైతే.. అక్కడున్న టెన్యూర్ ప్లీడర్లు తమకొద్దని ఉన్నతాధికారులకు దర్యాప్తు అధికారులు స్పష్టం చేస్తుండటంతో వేరే ప్రాంతం నుంచి సీనియర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లను పిలిపించాల్సి వస్తోంది.
ఎలా వస్తున్నారు..?
రాష్ట్రంలో ఉన్న 500లకుపైగా వివిధ రకాల కోర్టుల్లో200కిపైగా అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కేసులు వాదించేందుకు వీలుగా తాత్కాలికంగా ఈ పోస్టులను టెన్యూర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లను ఆయా కోర్టులు భర్తీ చేసుకుంటున్నాయి. ఇందుకోసం స్థానిక కోర్టు న్యాయమూర్తి తన కోర్టులో పనిచేస్తున్న ప్రైవేటు లాయర్లలో నలుగురైదుగురి పేర్లను కలెక్టరుకు సిఫారసు చేస్తారు. వీరిలో ఒకరిని కలెక్టర్ ఎంపిక చేసి, ప్రభుత్వానికి పంపుతారు.
ప్రభుత్వం ఆమోదించగానే.. సదరు వ్యక్తి టీపీపీగా ప్రాక్టీసు చేయొచ్చు. అయితే, రాజకీయ నేతల జోక్యంతో కొందరు ప్లీడర్లు నేరుగా టీపీపీలుగా నియామక పత్రాలు తెచ్చుకుని నేరుగా జిల్లా కోర్టుల్లో పాగా వేస్తున్నారు. కీలకమైన కేసుల్లో నిందితులు సుప్రీం, హైకోర్టులో వాదించే సీనియర్ లాయర్లను తెచ్చుకున్నప్పు డు వారిని ఎదుర్కోలేకపోతున్నారు. ఆంగ్ల పరిజ్ఞానం, అనుభవం అంతంత మాత్రంగానే ఉండటంతో వారి ముందు నిలబడలేకపోతున్నారు. ఇదిలా ఉండగా.. ఇటీవల ఏర్పాటు చేసిన 9 పోక్సో ఫాస్ట్‌ట్రాక్ కోర్టుల్లోనూ లాయర్ల కొరత ఉండటంతో ఖాళీగా ఉన్న పీపీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని పోలీసులు, నిపుణులు సూచిస్తున్నారు.