traditional Chinese medicine treatment
-
ఆఫ్రికన్ గాడిదలను ఎత్తుకెళ్లి మరీ.. చైనా దుర్మార్గం
కరోనా టైంలో చైనా ఆహారపు అలవాట్ల గురించి ప్రధానంగా చర్చ నడిచింది. ఒకానొక టైంలో ఆ అలవాట్ల వల్లే కరోనా విజృంభించిందన్న వాదన సైతం చక్కర్లు కొట్టింది. అయితే.. చైనీస్ సంప్రదాయ మందుల తయారీ కోసం మూగజీవాలను పొట్టనబెట్టుకుంటుందని ఆ దేశం మీద ఎప్పటి నుంచో ఆరోపణలు ఉన్నాయి. తాజాగా.. ఆఫ్రికాలో సైతం గాడిదలను ఎత్తుకెళ్లి దేశాలు దాటించి మరీ చంపి.. సంప్రదాయ మందులు తయారు చేస్తున్న చైనా దుర్మార్గపు చేష్టలు వెలుగులోకి వచ్చాయి. ఇంప్రెసెస్ ఇన్ ది ప్యాలెస్ అనే చైనీస్ టీవీ షో కారణంగానే.. ఈ విషయం వెలుగు చూడడం గమనార్హం. పదులు, వందలు కాదు.. లక్షల్లో గాడిదలను సంప్రదాయ మందుల పేరిట బలిగొంటోంది చైనా. మూగజీవాలను ఎత్తుకెళ్లి మరీ సుత్తెలతో కొట్టి చంపి మరీ అమానుషంగా వ్యవహరిస్తోంది. గాడిదల చర్మం నుంచి తయారు చేసే ఎజియావో అనే సంప్రదాయ మందు కోసం ఆరాచకాలకు పాల్పడుతోందని యూకేకు చెందిన డాంకీ శాంక్చురీలో పని చేసే సైమన్ పోప్ ఆరోపిస్తున్నారు. ఎజియావో అనేది ‘డాంకీ గ్లూ’గా పిలుస్తారు చైనాలో. గాడిదల చర్మం నుంచి దీనిని తయారు చేస్తారు. ఈ టానిక్ వల్ల ఆరోగ్యంతో పాటు అందంగా ఉంటారని చైనీయుల నమ్మకం. అందుకే.. గాడిదలను దుర్మార్గంగా చంపేస్తున్నారు. ఇక్కడ మరో విషయం ఏంటంటే.. చైనాలో ఈ టానిక్ తయారీకి సరిపడా గాడిదలు లేవు. అందుకే.. విదేశాలపై దృష్టి సారించింది. ప్రధానంగా ఆఫ్రికాలో గాడిదల సంఖ్యపై ఆధారపడింది. ఈ మేరకు మాలి, జింబాంబ్వే, టాంజానియాలో అక్రమ దందాలకు చైనా తెర తీసిందని వాయిస్ ఆఫ్ అమెరికా కథనం ప్రచురించింది. అక్కడి ప్రజలకు గాడిదలు ప్రధాన జీవనాధారం. వాటిని అమ్ముకునేందుకు ఇష్టపడడం లేదు. ఈ తరుణంలో.. వాటిని ఎత్తుకెళ్లే చేష్టలకు దిగింది చైనా మాఫియా. మొత్తం ఐదు మిలియన్ల గాడిదలకుగానూ.. సొంతగడ్డపై రెండు మిలియన్లు, విదేశాల నుంచి మరో మూడు మిలియన్ల గాడిదలను రప్పించుకుంటోంది. అయితే.. వాయిస్ ఆఫ్ అమెరికా కథనం ప్రకారం ఆ మూడు మిలియన్లలో 25 నుంచి 35 శాతం గాడిదలు ఎత్తుకొచ్చినవే అని తెలిపింది. తమ తమ దేశాల్లో గాడిదల సంఖ్య తగ్గిపోతుండడంపై ఆయా దేశాలు దృష్టిసారించాయి ఇప్పుడు. తమ దేశంలో గాడిదలు అంతరించిపోయే దశకు చేరుకోవడంతో.. టాంజానియా గత నెలలో గాడిదల వధ, చర్మం వర్తకాలపై నిషేధం విధించింది. నైజీరియా కూడా ఇదే బాటలో పయనిస్తూ నిషేధం ప్రకటించింది. తమ గాడిదలు తమ దేశాల సంపదని.. వాటిని అమ్మడం, చంపడం కుదరంటూ కొన్ని దేశాలు ఇప్పటికే డ్రాగన్ కంట్రీకి గట్టి సంకేతాలు పంపాయి. -
తలకు రంధ్రం పొడిచి.. నెత్తురు తోడేస్తారు!
ఆధునిక వైద్యవిధానాన్ని కొత్తపుంతలు తొక్కిస్తూ చైనాకు చెందిన డాక్టర్ జాన్ ఝాంగ్.. వాషింగ్టన్ లోని ఓ ఆసుపత్రిలో ముగ్గురి డీఎన్ఏలతో శిశువుకు ప్రాణంపోశారనే వార్తలు ఇటీవలే విన్నాం.(ముగ్గురికి జన్మించిన బిడ్డ!) కాగా, ఆ డాక్టర్ గారి స్వదేశంలో మాత్రం ఇప్పటికీ పాత మోటు వైద్యవిధానాలనే అవలంబిస్తూ కొందరు ప్రాణాలమీదికి తెచ్చుకుంటున్నారు. క్యాన్సర్ చికిత్స కోసం సంప్రదాయ చైనీస్ వైద్యవిధానాన్ని ఆశ్రయించిన ఓ వర్థమాన నటి.. కఠినమైన పద్ధతుల్ని తట్టుకోలేక ఊపిరి వదిలేసిన వార్త ఆ మధ్య చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే.(వికటించిన వైద్యం.. వర్ధమాన నటి మృతి). ఇక ఈ ఫొటోలో మీరు చూస్తున్నది అలాంటి చైనీస్ మోటు వైద్యవిధానమే. ఇంతకీ ఆయనకొచ్చిన జబ్బేమిటంటే.. తలనొప్పి! అవును. మామూలు తలనొప్పి! రూపాయో, అర్ధరూపాయో ఖరీదుచేసే ట్యాబ్లెట్ కు తగ్గే తలనొప్పి! గరం చాయ్ తాగి కాస్త విశ్రాంతి తీసుకుంటే తగ్గే తలనొప్పి! 'ఒకవేళ అతనిది మైగ్రేన్ అయినా కూడా చికిత్స చేసుకోవాల్సింది మాత్రం ఇలా కదు'అని నెటిజన్లు మండిపడుతున్నారు. వైద్యుడు.. రోగి నుదుటన సూదిలాంటి పరికరంతో 'టప్' మని పంక్చర్ చేయగానే.. తలలో నుంచి ట్యాప్ తిప్పినట్లు రక్తం ధారలా కారుతుంది. అక్కడి నరాల్లో రక్తాన్ని బటికి పోవడం ద్వారా తలనొప్పి తగ్గిపోతుంది. ఈ విధానాన్ని 'వెని పంక్చర్'అని వ్యవహరిస్తారు. నేరుగా వెయిన్స్(నరాలు)లోని రక్తాన్ని బయటికి తీసే ఈ విధానం.. మనందరికీ తెలిసిన 'ఆక్యుపంక్చర్'(సూదులతో గుచ్చే వైద్యం)ను పోలిఉంటుంది. చేయాల్సిన నరానికి కాకుండా వేరేదానికి పంక్చర్ చేసినా.. పంక్చర్ గాయానికి ఇన్ ఫెక్షన్ సోకినా.. రోగిప్రాణాలకు భరోసాలేదీ విధానంలో. సోషల్ మీడియాలో చాలామంది చూసిన ఈ వీడియో మీకోసం.. -
వికటించిన వైద్యం.. వర్ధమాన నటి మృతి
బీజింగ్: వరుస అవకాశాలతో వృద్ధిలోకి వస్తోన్న యువ నటీమణి అనూహ్యంగా క్యాన్సర్ బారిన పడి వైద్యం వికటించడంతో మృతిచెందిన ఉదంతం ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. చైనీస్ సినీపరిశ్రమలో వర్ధమాన నటిగా పేరు తెచ్చుకున్న 26 ఏళ్ల జు టింగ్ గతవారం కన్నుమూసినట్లు ఆమె కుటుంబసభ్యులు తెలిపారు. లింపథిక్ క్యాన్సర్ బారిన పడిన జు టింగ్.. జబ్బును నయం చేయించుకునేందుకు ఆధునిక వైద్యవిధానాన్ని కాదనుకుని సంప్రదాయ చైనీస్ వైద్యవిధానాన్ని ఆశ్రయించారు. ఈ క్రమంలో తాను ఎదుర్కొన్న అనుభవాలను ఎప్పటికప్పుడు ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నారామె. జులై 9న తనకు క్యాన్సర్ ఉందని ట్వీట్ చేసిన జు టింగ్.. తర్వాత కొద్ది రోజులకే 'కీమోథెరపీ అత్యంత బాధాకరం. నాకు తెలిసినవాళ్లలో క్యాన్సర్ బారిన పడిన కొద్దిమంది కీమో చేయించుకు ఎంత నరకం అనుభవించారో గుర్తుంది. అందుకే క్యాన్సర్ ఉందని తెలియగానే నేను కీమోథెరపీ కాకుండా చైనీస్ సంప్రదాయ వైద్యవిధానంలో కేన్సర్ ను తగ్గించుకోవాలనుకున్నా' అని మరో ట్వీట్ చేశారు. ఆసుపత్రిలో చేరిన కప్ థెరపీ చేయించుకుంటున్న ఫొటో ఒకదానిని పోస్ట్ చేసి 'కొద్దిగా కొలుకుంటున్నాను'అని సమాచారం అందించింది. (తప్పక చదవండి: కప్పింగ్ చికిత్స.. ఓ నమ్మకం మాత్రమే) అయితే ఆగస్టు 18 నాటికి జు టింగ్ పరిస్థితి ప్రమాదకరంగా మారింది. 'ఈ విధానం(చైనీస్ వైద్యం)కూడా కీమోథెరపీలా బాధాకరంగానే ఉంది' అంటూ చివరి మెసేజ్ ను పోస్ట్ చేసిన కొద్దిరోజులకే ఆమె మృత్యువు ఒడిలోకి జారుకుంది. సెప్టెంబర్ 7న తన సహోదరి మరణించిందని, కప్పింగ్ థెరపీ, సూదులను శరీరంలోకి గుచ్చే పద్ధతి తదితర సంప్రదాయ విదానాలన్నీ బెడిసికొట్టడం వల్లే ఇలా జరిగిందని జు టింట్ సహోదరి విలేకరులకు తెలిపారు. దీంతో జు టింగ్ మరణం గురించి చైనా వ్యాప్తంగా చర్చ మొదలైంది. కీమోథెరపీ చేయుకుని ఉంటే ఆమె బతికి ఉండేదని, చైనీస్ వైద్యంలో పసలేదని కొందరు వాదిస్తున్నారు. కాగా, క్యాన్సర్ అత్యంత ప్రమాదకమైన వ్యాధిఅని, కీమోథెరపీ అయినా, చైనీస్ విధానంలోనైనా ఫలితాలను ఊహించలేమని మరికొందరు సోషల్ మీడియాలో పోట్లాడుకుంటున్నారు. స్వర్గంలోనైనా జు టింగ్ కు శాంతి లభించుగాక అని ఇంకొందరు ప్రార్థిస్తున్నారు.