మైనర్స్ డ్రైవింగ్ చేస్తే తల్లిదండ్రులకు జైలు...
గన్‌ఫౌండ్రీ: మైనర్లు ఇకపై వాహనం నడుపుతూ పట్టుబడితే వారి తల్లిదండ్రులు జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని ట్రాఫిక్ డీసీపీ రంగనాథ్ హెచ్చరించారు. వాహనం నడుపుతూ చిక్కిన మైనర్లతో పాటు ఓవర్ స్పీడ్, వితౌట్ హెల్మెట్, రాంగ్‌రూట్ డ్రైవింగ్, నెంబర్ ప్లేట్లు సక్రమంగా లేకపోవడంతో పట్టుబడ్డ సుమారు 300 మందికి గోషామహల్‌లోని ట్రాఫిక్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్‌లో శనివారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన డీసీపీ రంగనాథ్ మాట్లాడుతూ... తల్లిదండ్రులు తమ పిల్లలకు డ్రైవింగ్, ట్రాఫిక్ రూల్స్‌పై అవగాహన వచ్చిన తర్వాతే వాహనాలు ఇవ్వాలన్నారు.
మైనర్లకు వాహనాలు ఇచ్చి రోడ్లపైకి పంపితే తల్లిదండ్రులు చంచల్‌గూడ జైలుకెళ్లాల్సి వస్తుందన్నారు. మొదటిసారి కోర్టులో జరిమానా కట్టాం అంతే కదా అని పొరబడి.. రెండోసారి పట్టుబడితే మైనర్లను జువైనల్ హోమ్‌కు, తల్లిదండ్రులను జైలుకు పంపిస్తామన్నారు. నెంబర్ ప్లేట్లపై పోలీస్, ఆర్మీ, డిఫెన్స్, ప్రెస్ పదాలను రాస్తే.. ఆ వాహనాలను పూర్తిగా సీజ్ చేస్తామన్నారు. కార్యక్రమంలో గోషామహల్, చార్మినార్ ట్రాఫిక్ ఏసీపీ జైపాల్, భద్రేశ్వర్, గోషామహాల్ ట్రాఫిక్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ ఇన్స్పెక్టర్ ఎం.శ్రీనివాస్, ఇన్స్పెక్టర్లు హరీష్, కె. శ్రీనివాస్, నరహరి తదితరులు పాల్గొన్నారు.