train fare
-
రైలు చార్జీల పెంపుపై ధర్నా
వేలూరు: కేంద్ర ప్రభుత్వం రైలు చార్జీలనుపెంచడాన్ని ఖండిస్తూ కాంగ్రెస్ నాయకులు వేలూరు ప్రధాన తపాలా కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే జ్ఞానశేఖరన్ మాట్లాడుతూ ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వం అధికారాన్ని చేపట్టిన నెల రోజుల్లోనే రైలు చార్జీలను పెంచి ప్రజలపై భారం మోపడం అన్యామన్నారు. రైలు చార్జీలు పెరగడంతో నిత్యవసర సరుకుల ధరలు పెరిగే అవకాశం ఉందన్నారు. అలాగే డీజిల్, గ్యాస్ ధరలను నెలనెలా పెంచుతామని ప్రకటించడం సరికాదని ఈ ప్రకటనలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. పెంచిన రైలు చార్జీలను తగ్గించకుంటే దేశ వ్యాప్తంగా వివిధ పార్టీల నేతల ఆధ్వర్యంలో పోరాటాలు తప్పవని హెచ్చరించారు. ధర్నాలో కార్పొరేషన్ అధ్యక్షులు శ్రీనివాసగాంధీ, రాష్ట్ర యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పయణి, వేలూరు యూనియన్ మాజీ అధ్యక్షులు దేవేంద్రన్, కౌన్సిలర్ కోదండపాణి పాల్గొన్నారు. కాట్పాడిలో: కాట్పాడి చిత్తూరు బస్టాండ్ వద్ద పుదియ తమిళగం పార్టీ ఆధ్వర్యంలో రైలు చార్జీల పెంపునకు నిరసనగా ధర్నా నిర్వహించారు. పెంచిన రైలు చార్జీల ను వెంటనే త గ్గించాలని డిమాండ్ చేశారు. ధర్నాలో ఆ పార్టీ జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి జయశీలన్, కార్పొరేషన్ కార్యదర్శి లూర్ద్స్వామి, కార్యకర్తలు పాల్గొన్నారు. -
ఊరటనిచ్చినా...రైలు చార్జీల పెంపు భారమే
రోజువారీ, ఎంఎస్టీ టికెట్ల ధరల్లో భారీ పెరుగుదల సాక్షి, హైదరాబాద్: రైలు టికెట్ ధరలను పెంచిన కేంద్రం దేశవ్యాప్తంగా కనిపించిన వ్యతిరేకతను దృష్టిలో ఉంచుకుని రోజులవారి ప్రయాణాలు, నెలవారీ సీజనల్ టికెట్ ధరల్లో స్వల్ప మార్పులు చేసిన ప్పటికీ ప్రయాణికుల జేబుపై పెద్ద భారమే పడనుంది. ముఖ్యంగా నగరాలకు రోజువారీ ప్రయాణం చేసేవారిపై మోపిన భారం నుంచి కొంత ఊరట లభించేలా ఛార్జీలను స్వల్పంగా తగ్గించినప్పటికీ నెలవారీ పాసుల ధరల్లో పెరుగుదల భారీగానే కనిపిస్తోంది. 150 కిలోమీటర్ల మేర ప్రయాణించే నెలవారీ సీజనల్ టికెట్లు కొనేవారు ఇప్పటి వరకు సెకండ్ క్లాస్‌కు రూ.460 భరిస్తుండగా అది రూ.525కు పెరుగుతోంది. అదే మొదటి తరగతిలో ప్రయాణించేందుకు కొనే నెలవారీ సీజన్ టికెట్ ధర ప్రస్తుతం రూ.1840 ఉండగా అది రూ.2100 పెరగబోతోంది. 1-150 కిలోమీటర్ల వరకు రోజువారి ప్రయాణం, నెలవారీ సీజనల్ టికెట్ ధరలు ఇలా... 1-15 కిలోమీటర్ల వరకు రెండో తరగతి నాన్ సబర్బన్, సబర్బన్ రోజువారీ ప్రయాణ టికెట్ దరల్లో మార్పు లేదు. అది రూ.5గానే ఉండనుంది. నెలవారీ సీజన్ టికెట్ (ఎంఎస్టీ) ధర మాత్రం ప్రస్తుతం నాన్ సబర్బన్‌కు రూ.85 ఉండగా అది రూ.100గా, సబర్బన్‌కు రూ.130 ఉండగా అది రూ.150కి పెరగనుంది. ఫస్ట్‌క్లాస్ నాన్‌సబర్బన్, సబర్బన్ టికెట్ ధర 1-10 కి.మీకు రూ.45 ఉండగా అది రూ.50కి, అదే కేటగిరీ నాన్ సబర్బన్ ఎంఎస్టీ ధర రూ.300 ఉండగా రూ.340కి, సబర్బన్ ధర రూ.445 ఉండగా, అది రూ.510కి పెరిగింది. రెండో తరగతి ఎంఎస్టీల ధరలు 20కి.మీ. నుంచి 35 కి.మీ. మధ్య పెరగగా, ఏపీ క్లాస్ ధరలు మాత్రం ప్రతి ఐదు కిలోమీటర్ల చొప్పున పెంచారు. 50 కి.మీ.కు ప్రస్తుత ఎంఎస్టీ నాన్సబర్బన్కు రూ.235 ఉండగా రూ.270, ఫస్ట్‌క్లాస్ నాన్‌సబర్బన్ ధర రూ.800 నుంచి రూ.వేయికి పెరిగింది. అదే 100 కి.మీ.లకు ఇవి వరసగా రూ.310 నుంచి రూ.355కు, రూ.1380 నుంచి రూ.1580కి పెరిగాయి. 150 కి.మీ. వచ్చే సరికి ఇవి రూ.460 నుంచి 525కు రూ.1840 నుంచి రూ.2100 పెరిగాయి. కొత్త ఛార్జీలు ఈనెల 28 నుంచి అమలులోకి రానున్నాయి. -
ఇక ఆర్టీసీ వంతు..
10 % మేర టికెట్ ధరలు పెంచే యోచన! హైదరాబాద్: సామాన్యుడిపై మరో మోతకు రంగం సిద్ధమవుతోంది. ఇప్పటికే మోడీ సర్కారు పెట్టిన రైలు చార్జీల వాత నుంచి ప్రజలు తేరుకోకముందే.. రాష్ట్రంలో ఆర్టీసీ టికెట్ ధరల పెంపుతో విరుచుకుపడబోతోంది. ప్రతినెలా డీజిల్ చార్జీల పెరుగుదలను సాకుగా చూపి ప్రయాణికుల జేబుకు చిల్లుపెట్టనుంది. రైలు చార్జీల పెంపును ఆసరా చేసుకుని బస్సు టికెట్ ధరలు పెంచాలని నిర్ణయించింది. దీనికి సంబంధించి బుధవారం కసరత్తు ప్రారంభించిన అధికారులు... రెండు మూడు రోజుల్లో ఇటు తెలంగాణ ప్రభుత్వానికి, అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్ర విభజన జరిగినా ప్రస్తుతం ఆర్టీసీ ఉమ్మడిగానే ఉండటంతో రెండు రాష్ట్రాల్లోనూ చార్జీలు పెంచే ప్రతిపాదన సిద్ధం చేయాలని ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది. ఈ పెంపు 10 శాతం వరకు ఉండనుందని సమాచారం. ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు స్పందించే తీరుపై ఈ పెంపు అమలు ఆధారపడనుంది. ఎనిమిది నెలల్లో రెండోసారి.. గత సంవ త్సరం నవంబర్‌లో అప్పటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం భారీగా ఆర్టీసీ చార్జీలు పెంచింది. తీవ్ర నష్టాల్లో ఉన్న ఆర్టీసీకి ఈ పెంపు సరిపోలేదు. దీంతో ఈ సారి ఏకంగా 10 శాతం మేర చార్జీలు పెంచాలని ఆర్టీసీ యాజమాన్యం ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తులు.. తీవ్ర నష్టాల్లో ఉన్నందున ఆర్టీసీకి ప్రభుత్వం నుంచి తక్షణ ఆర్థిక చేయూత అవసరమని.. త్వరలో ప్రవేశపెట్టబోయే రాష్ట్ర బడ్జెట్లో ఈ మేరకు చోటు కల్పించాలని బుధవారం తెలంగాణ రవాణా మంత్రి మహేందర్‌రెడ్డిని కలిసి ఆర్టీసీ జేఎండీ రమణారావు విజ్ఞప్తి చేశారు. ఇంధనంపై విధిస్తున్న పన్ను తగ్గింపు, అవసరమైన మొత్తం రీయింబర్స్‌మెంటు తదితర అంశాలనూ ఆయన ప్రస్తావించారు. ప్రభుత్వం నుంచి తగిన చేయూత అందితే చార్జీల పెంపును విరమించుకోవాలని.. లేనిపక్షంలో కచ్చితంగా పెంచాల్సిందేనని ప్రభుత్వానికి నివేదించాలని బుధవారం సాయంత్రం అధికారులు నిర్ణయించి ప్రతిపాదనలు సిద్ధం చేసే పని ప్రారంభించినట్టు సమాచారం. -
రైలు చార్జీల పెంపును నిరసిస్తూ కమ్యూనిస్టుల ధర్నా
ఏలూరు (ఫైర్స్ట్టేషన్ సెంటర్) : పెంచిన రైలు చార్జీలను కేంద్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ సీపీఎం, సీపీఐ ఎంఎల్ (న్యూడెమోక్రసీ) కార్యకర్తలు ఏలూరు పవర్‌పేట రైల్వే స్టేషన్ వద్ద ఆదివారం ధర్నా నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సీపీఎం నాయకులు ఎ.రవి, బి.జగన్నాథం మాట్లాడుతూ రైల్వేచార్జీల పెంపును ప్రజలంతా ఐక్యంగా వ్యతిరేకించాలన్నారు. బి.సోమయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధిక ధరలు నియంత్రించలేక పోయిందని విమర్శించి అధికారంలోకి వచ్చిన బీజేపీ కూడా అవే విధానాలను అవలంభించడం సిగ్గుచేటన్నారు. ప్రజలపై భారాలు మోపితే ప్రతిపక్ష పాత్ర పోషిస్తానన్న జనసేన నాయకుడు పవన్ కల్యాణ్ ఎందుకు మాట్లాడటంలేదని ప్రశ్నించారు. ధర్నా అనంతరం నాయకులు కార్యకర్తలు పవర్ పేట నుంచి ప్రభావతి ఆసుపత్రి వరకు నినాదాలు చేస్తూ ప్రదర్శన నిర్వహించారు. న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో ఏలూరు పెద్ద రైల్వేస్టేషన్ వద్ద ధర్నా నిర్వహించారు. నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కె.పొలారి, యు.వెంకటేవ్వరరావు, బద్దా వెంకట్రావు, కాకర్ల అప్పారావు తదితరులు నాయకత్వం వహించారు. -
చార్జీల కూత
స్లీపర్, ఏసీ చార్జీల పెంపు 14.2 శాతం వాత ప్రయాణికులపై రూ.50 కోట్లు భారం వాల్తేరు డివిజన్‌కు రూ.500 కోట్లుఅదనపు ఆదాయం విశాఖపట్నం : రైలు ప్రయాణికులపై చార్జీల భారం పడింది. రైల్వే బడ్జెట్ ప్రకటించకమునుపే బీజేపీ ప్రభుత్వం ఊహించని రీతిలో 14.2 శాతం చార్జీలను వడ్డించింది. రైల్వేలో వసతులు మెరుగుపరుస్తామంటూ అదనపు భారం వేశారు. పెరిగిన చార్జీలు ఈ నెల 25 నుంచి అమల్లోకి రానున్నాయి. చార్జీల పెంపు వల్ల వాల్తేర్ డివిజన్ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులపై ఏటా దాదాపు రూ.50 కోట్ల అదనపు భారం పడనుంది. బొగ్గు, ఇనుప ఖనిజం, ఇనుము, పెట్రోలియం, ఫెర్టిలైజర్స్, ఆహార ధాన్యాల ఋఎగుమతుల రవాణా వల్ల కూడా వాల్తేరు డివిజన్‌పై అధిక భారం పడనుంది. కొత్తగా ఎలాంటి సరకు రవాణా పెరగకపోయినా గత ఏడాదిలాగే రవాణా జరిగితే అదనంగా రూ.450 కోట్ల ఆదాయం వాల్తేరు డివిజన్‌కు సమకూరనుంది. ప్రయాణికుల చార్జీలు పెంపు, సరకు రవాణా పెంపు వల్ల వాల్తేరు డివిజన్‌కు రూ.500 కోట్ల అదనపు ఆదాయం సమకూరే అవకాశం ఉన్నట్టు రైల్వే వర్గాలు అంచనా వేశాయి. ఇప్పటికే వాల్తేరు రైల్వే ఆదాయం రూ.6265.28 కోట్లకు చేరింది. తాజా పెంపుతో రూ. 6765 కోట్లకు పెరిగే అవకాశాలున్నాయి. సమీపంలో ఇంత భారీ ఆదాయాన్ని ఆర్జించే రైల్వే డివిజన్లు లేవు. విజయవాడ రైల్వే డివిజన్ ఏటా రూ.3279 కోట్లు, గుంతకల్ రూ. 1300 కోట్లు, గుంటూరు రూ. 452 కోట్లు, సంబల్పూర్ రూ. 630 కోట్లు, కుర్దా డివిజన్ రూ. 3630 కోట్లు మాత్రమే ఆర్జిస్తున్నాయి. విశాఖ నుంచి రోజూ దాదాపు 90 రైళ్లలో ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. విశాఖ రైల్వే స్టేషన్ నుంచే రోజూ 25 వేల నుంచి 30 వేల మంది ప్రయాణాలు చేస్తున్నారు. సికింద్రాబాద్, విజయవాడ, భువనేశ్వర్, హౌరా, చెన్నై ప్రాంతాలకు ఎక్కువ మంది విశాఖ నుంచి బయల్దేరుతుంటారు. సికింద్రాబాద్‌కు ఎన్ని రైళ్లు వేసినా అవన్నీ నిత్యం రద్దీగానే నడుస్తుంటాయి. తాజాగా పెరిగిన రవా ణా చార్జీలతో నిత్యావసర ధరలు చుక్కలనంటే ప్రమాదం ఉందని సామాన్యులు భయపడుతున్నారు. ఆహార ధాన్యాలన్నీ రైళ్లలోనే రవాణా అవుతుం టాయి. పెట్రోలియం ఉత్పత్తులకు కూడా ఈ చార్జీల మోత తోడైతే రవాణా, నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతాయని ఆందోళన చెందుతున్నారు. సౌకర్యాలేవీ...! : ప్రస్తుతం పెంచిన చార్జీల్లో 4.2 శాతం మౌలిక వసతుల కల్పనకేనని రైల్వే మంత్రి సదానంద గౌడ ప్రకటించారు. కానీ ఆచరణలో మాత్రం సౌకర్యాలేవీ కనిపించడం లేదని ప్రయాణికులు పెదవి విరుస్తున్నారు. టాయిలెట్లు నిత్యం కంపుకొడుతూనే ఉంటున్నాయని, నీళ్లు కూడా రాని పరిస్థితి ఉందని చె బుతున్నారు. ప్రయాణికుల నుంచి 4.2 శాతం అదనపు చార్జీలను వసూలు చేయడం సరికాదని రైల్వేపై నిప్పులు చెరుగుతున్నారు. వసతులు, సదుపాయాలు, పరిశుభ్రతకు పెద్దపీట వేయకుండా చార్జీలు పెంచడాన్ని రైల్వే వర్గాలు సైతం తప్పుబడుతున్నాయి. ఉపసంహరించుకోవాలి బీజేపీ ప్రభుత్వం రైల్వే చార్జీల పెంపును ఉపసంహరించుకోవాలి. గత ప్రభుత్వంలా కాకుండా తమ హయాంలో అందరికీ మేలు చేకూరుతుందంటూ అధికారం చేపట్టిన నెలరోజులకే ప్రయాణికులపై భారం మోపడం శోచనీయం. ఈ విషయంలో ప్రభుత్వం పునరాలోచించాలి. -సీహెచ్. మైఖేల్, న్యాయవాది, అనకాపల్లి. సామాన్యులకు కష్టమే.. ప్రయాణ,రవాణా చార్జీలను రైల్వే పెంచడంతో పరోక్షం గా నిత్యావసర ధరలు విపరీతంగా పెరిగే అవకాశం ఉం ది. ఇప్పటికే పెరిగిన బస్సు చార్జీలతో అల్లాడిపోతున్న సామాన్యులకు ఇక నుంచి రైలు ప్రయాణం కూడా కష్టమవుతుంది. -ఎ. పరమేశ్వరావు, ఉద్యోగి అనకాపల్లి. చార్జీల పెంపు దారుణం అధికారం ఉంది కదాని ప్రయాణికులపై ఇలా భారం మోపడం సరికాదు. ఏసీ ప్రయాణికులపై కాకుండా సాధారణ ప్రయాణికులు వెళ్లే స్లీపర్ క్లాస్‌పై వడ్డించడం బాధాకరం. పెంచిన ధరలు తగ్గించేందుకు బీజేపీ, టీడీపీ నేతలు ఢిల్లీ వెళ్లి పోరాటాలు చేయాలి. - గుడివాడ అమరనాథ్, వైఎస్సార్సీపీ నేత -
రేపట్నుంచి రాజధాని, శతాబ్ది, దురంతో రైలు ఛార్జీల పెంపు
రాజధాని, శతాబ్ది, దురంతో లాంటి రైళ్లలో అయితే త్వరగా, సౌఖ్యంగా వెళ్లిపోవచ్చని అనుకుంటున్నారా? అయితే మీ జేబుకు మాత్రం కాస్తంత భారం తప్పదు. ఎందుకంటే, ఆయా రైళ్లలోని కేటరింగ్ ఛార్జీలను రైల్వే శాఖ 2 నుంచి 4 శాతం వరకు పెంచుతోంది. ఈ పెంపు గురువారం నుంచి అమలులోకి రానుంది. ఈ రైళ్ల ఛార్జీలలోనే అందులో ఇచ్చే ఆహార పదార్థాల ఖర్చుకూడా కలిసుంటుందన్న విషయం తెలిసిందే. వాటి ఖరీదునే ఇప్పుడు పెంచారు. గడిచిన పది రోజుల్లో ప్రయాణికులపై భారం పెరగడం ఇది రెండోసారి. ఈనెల ఏడో తేదీనే రైల్వేశాఖ ఇంధన సర్దుబాటు పేరుతో ప్రయాణికుల ఛార్జీలను పెంచిన విషయం తెలిసిందే. ఇంతకుముందే ఈ రైళ్లకు టికెట్లు కొనుక్కున్నవాళ్లు మాత్రం మిగిలిన ఛార్జీని టీటీఈలకు చెల్లించాల్సి ఉంటుందని రైల్వేశాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఈ తరహా రైళ్లలో కేటరింగ్ ఛార్జీలను 14 సంవత్సరాల తర్వాత పెంచుతున్నారు. చిట్టచివరి సారిగా వీటిని 1999లో పెంచారు. ఛార్జీ పెంచడమే కాదు, మెనూలో కొత్త కొత్త వెరైటీలు కూడా చేరుస్తున్నారు. ఏసీ -1, ఎగ్జిక్యూటివ్ క్లాస్‌లలో చేపల వేపుడు, స్టఫ్డ్ పరోటా, అన్ని తరగతుల వారికీ ఫ్లేవర్డ్ మిల్క్ కూడా ఇవ్వనున్నారు. అలాగే స్టఫ్ చేసిన రోల్స్ కూడా ఇస్తారు. వీటికి బదులు చాక్లెట్లు, టాఫీలు, పండ్ల రసాలను తొలగించారు. ఉదయం, సాయంత్రం ఇచ్చే టీ ధరను 30-4౦ శాతం వరకు తగ్గించినా, టిఫిన్, మధ్యాహ్న, రాత్రి భోజనాల ధరను మాత్రం 50-60 శాతం పెంచారు. రాజధాని, దురంతో రైళ్లలో కొత్తగా కాంబో మీల్‌ను ప్రవేశపెడుతున్నారు. వీటి ధరలు మామూలు భోజనంతో పోలిస్తే సగమే ఉంటాయట!!