ఇక ఆర్టీసీ వంతు..
10 % మేర టికెట్ ధరలు పెంచే యోచన!
హైదరాబాద్: సామాన్యుడిపై మరో మోతకు రంగం సిద్ధమవుతోంది. ఇప్పటికే మోడీ సర్కారు పెట్టిన రైలు చార్జీల వాత నుంచి ప్రజలు తేరుకోకముందే.. రాష్ట్రంలో ఆర్టీసీ టికెట్ ధరల పెంపుతో విరుచుకుపడబోతోంది. ప్రతినెలా డీజిల్ చార్జీల పెరుగుదలను సాకుగా చూపి ప్రయాణికుల జేబుకు చిల్లుపెట్టనుంది. రైలు చార్జీల పెంపును ఆసరా చేసుకుని బస్సు టికెట్ ధరలు పెంచాలని నిర్ణయించింది. దీనికి సంబంధించి బుధవారం కసరత్తు ప్రారంభించిన అధికారులు... రెండు మూడు రోజుల్లో ఇటు తెలంగాణ ప్రభుత్వానికి, అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్ర విభజన జరిగినా ప్రస్తుతం ఆర్టీసీ ఉమ్మడిగానే ఉండటంతో రెండు రాష్ట్రాల్లోనూ చార్జీలు పెంచే ప్రతిపాదన సిద్ధం చేయాలని ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది. ఈ పెంపు 10 శాతం వరకు ఉండనుందని సమాచారం. ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు స్పందించే తీరుపై ఈ పెంపు అమలు ఆధారపడనుంది.
ఎనిమిది నెలల్లో రెండోసారి..
గత సంవ త్సరం నవంబర్‌లో అప్పటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం భారీగా ఆర్టీసీ చార్జీలు పెంచింది. తీవ్ర నష్టాల్లో ఉన్న ఆర్టీసీకి ఈ పెంపు సరిపోలేదు. దీంతో ఈ సారి ఏకంగా 10 శాతం మేర చార్జీలు పెంచాలని ఆర్టీసీ యాజమాన్యం ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది.
ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తులు..
తీవ్ర నష్టాల్లో ఉన్నందున ఆర్టీసీకి ప్రభుత్వం నుంచి తక్షణ ఆర్థిక చేయూత అవసరమని.. త్వరలో ప్రవేశపెట్టబోయే రాష్ట్ర బడ్జెట్‌లో ఈ మేరకు చోటు కల్పించాలని బుధవారం తెలంగాణ రవాణా మంత్రి మహేందర్‌రెడ్డిని కలిసి ఆర్టీసీ జేఎండీ రమణారావు విజ్ఞప్తి చేశారు. ఇంధనంపై విధిస్తున్న పన్ను తగ్గింపు, అవసరమైన మొత్తం రీయింబర్స్‌మెంటు తదితర అంశాలనూ ఆయన ప్రస్తావించారు. ప్రభుత్వం నుంచి తగిన చేయూత అందితే చార్జీల పెంపును విరమించుకోవాలని.. లేనిపక్షంలో కచ్చితంగా పెంచాల్సిందేనని ప్రభుత్వానికి నివేదించాలని బుధవారం సాయంత్రం అధికారులు నిర్ణయించి ప్రతిపాదనలు సిద్ధం చేసే పని ప్రారంభించినట్టు సమాచారం.