చార్జీల కూత
- స్లీపర్, ఏసీ చార్జీల పెంపు
- 14.2 శాతం వాత
- ప్రయాణికులపై రూ.50 కోట్లు భారం
- వాల్తేరు డివిజన్‌కు రూ.500 కోట్లుఅదనపు ఆదాయం
విశాఖపట్నం : రైలు ప్రయాణికులపై చార్జీల భారం పడింది. రైల్వే బడ్జెట్ ప్రకటించకమునుపే బీజేపీ ప్రభుత్వం ఊహించని రీతిలో 14.2 శాతం చార్జీలను వడ్డించింది. రైల్వేలో వసతులు మెరుగుపరుస్తామంటూ అదనపు భారం వేశారు. పెరిగిన చార్జీలు ఈ నెల 25 నుంచి అమల్లోకి రానున్నాయి. చార్జీల పెంపు వల్ల వాల్తేర్ డివిజన్ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులపై ఏటా దాదాపు రూ.50 కోట్ల అదనపు భారం పడనుంది.
బొగ్గు, ఇనుప ఖనిజం, ఇనుము, పెట్రోలియం, ఫెర్టిలైజర్స్, ఆహార ధాన్యాల ఋఎగుమతుల రవాణా వల్ల కూడా వాల్తేరు డివిజన్‌పై అధిక భారం పడనుంది. కొత్తగా ఎలాంటి సరకు రవాణా పెరగకపోయినా గత ఏడాదిలాగే రవాణా జరిగితే అదనంగా రూ.450 కోట్ల ఆదాయం వాల్తేరు డివిజన్‌కు సమకూరనుంది. ప్రయాణికుల చార్జీలు పెంపు, సరకు రవాణా పెంపు వల్ల వాల్తేరు డివిజన్‌కు రూ.500 కోట్ల అదనపు ఆదాయం సమకూరే అవకాశం ఉన్నట్టు రైల్వే వర్గాలు అంచనా వేశాయి.
ఇప్పటికే వాల్తేరు రైల్వే ఆదాయం రూ.6265.28 కోట్లకు చేరింది. తాజా పెంపుతో రూ. 6765 కోట్లకు పెరిగే అవకాశాలున్నాయి. సమీపంలో ఇంత భారీ ఆదాయాన్ని ఆర్జించే రైల్వే డివిజన్లు లేవు. విజయవాడ రైల్వే డివిజన్ ఏటా రూ.3279 కోట్లు, గుంతకల్ రూ. 1300 కోట్లు, గుంటూరు రూ. 452 కోట్లు, సంబల్‌పూర్ రూ. 630 కోట్లు, కుర్దా డివిజన్ రూ. 3630 కోట్లు మాత్రమే ఆర్జిస్తున్నాయి. విశాఖ నుంచి రోజూ దాదాపు 90 రైళ్లలో ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు.
విశాఖ రైల్వే స్టేషన్ నుంచే రోజూ 25 వేల నుంచి 30 వేల మంది ప్రయాణాలు చేస్తున్నారు. సికింద్రాబాద్, విజయవాడ, భువనేశ్వర్, హౌరా, చెన్నై ప్రాంతాలకు ఎక్కువ మంది విశాఖ నుంచి బయల్దేరుతుంటారు. సికింద్రాబాద్‌కు ఎన్ని రైళ్లు వేసినా అవన్నీ నిత్యం రద్దీగానే నడుస్తుంటాయి. తాజాగా పెరిగిన రవా ణా చార్జీలతో నిత్యావసర ధరలు చుక్కలనంటే ప్రమాదం ఉందని సామాన్యులు భయపడుతున్నారు. ఆహార ధాన్యాలన్నీ రైళ్లలోనే రవాణా అవుతుం టాయి. పెట్రోలియం ఉత్పత్తులకు కూడా ఈ చార్జీల మోత తోడైతే రవాణా, నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతాయని ఆందోళన చెందుతున్నారు.
సౌకర్యాలేవీ...! : ప్రస్తుతం పెంచిన చార్జీల్లో 4.2 శాతం మౌలిక వసతుల కల్పనకేనని రైల్వే మంత్రి సదానంద గౌడ ప్రకటించారు. కానీ ఆచరణలో మాత్రం సౌకర్యాలేవీ కనిపించడం లేదని ప్రయాణికులు పెదవి విరుస్తున్నారు. టాయిలెట్లు నిత్యం కంపుకొడుతూనే ఉంటున్నాయని, నీళ్లు కూడా రాని పరిస్థితి ఉందని చె బుతున్నారు. ప్రయాణికుల నుంచి 4.2 శాతం అదనపు చార్జీలను వసూలు చేయడం సరికాదని రైల్వేపై నిప్పులు చెరుగుతున్నారు. వసతులు, సదుపాయాలు, పరిశుభ్రతకు పెద్దపీట వేయకుండా చార్జీలు పెంచడాన్ని రైల్వే వర్గాలు సైతం తప్పుబడుతున్నాయి.
ఉపసంహరించుకోవాలి
బీజేపీ ప్రభుత్వం రైల్వే చార్జీల పెంపును ఉపసంహరించుకోవాలి. గత ప్రభుత్వంలా కాకుండా తమ హయాంలో అందరికీ మేలు చేకూరుతుందంటూ అధికారం చేపట్టిన నెలరోజులకే ప్రయాణికులపై భారం మోపడం శోచనీయం. ఈ విషయంలో ప్రభుత్వం పునరాలోచించాలి.
-సీహెచ్. మైఖేల్, న్యాయవాది, అనకాపల్లి.
సామాన్యులకు కష్టమే..
ప్రయాణ,రవాణా చార్జీలను రైల్వే పెంచడంతో పరోక్షం గా నిత్యావసర ధరలు విపరీతంగా పెరిగే అవకాశం ఉం ది. ఇప్పటికే పెరిగిన బస్సు చార్జీలతో అల్లాడిపోతున్న సామాన్యులకు ఇక నుంచి రైలు ప్రయాణం కూడా కష్టమవుతుంది.
-ఎ. పరమేశ్వరావు, ఉద్యోగి అనకాపల్లి.
చార్జీల పెంపు దారుణం
అధికారం ఉంది కదాని ప్రయాణికులపై ఇలా భారం మోపడం సరికాదు. ఏసీ ప్రయాణికులపై కాకుండా సాధారణ ప్రయాణికులు వెళ్లే స్లీపర్ క్లాస్‌పై వడ్డించడం బాధాకరం. పెంచిన ధరలు తగ్గించేందుకు బీజేపీ, టీడీపీ నేతలు ఢిల్లీ వెళ్లి పోరాటాలు చేయాలి.
- గుడివాడ అమరనాథ్, వైఎస్సార్‌సీపీ నేత