రైలు చార్జీల పెంపును నిరసిస్తూ కమ్యూనిస్టుల ధర్నా
ఏలూరు (ఫైర్‌స్ట్టేషన్ సెంటర్) : పెంచిన రైలు చార్జీలను కేంద్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ సీపీఎం, సీపీఐ ఎంఎల్ (న్యూడెమోక్రసీ) కార్యకర్తలు ఏలూరు పవర్‌పేట రైల్వే స్టేషన్ వద్ద ఆదివారం ధర్నా నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సీపీఎం నాయకులు ఎ.రవి, బి.జగన్నాథం మాట్లాడుతూ రైల్వేచార్జీల పెంపును ప్రజలంతా ఐక్యంగా వ్యతిరేకించాలన్నారు. బి.సోమయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధిక ధరలు నియంత్రించలేక పోయిందని విమర్శించి అధికారంలోకి వచ్చిన బీజేపీ కూడా అవే విధానాలను అవలంభించడం సిగ్గుచేటన్నారు.
ప్రజలపై భారాలు మోపితే ప్రతిపక్ష పాత్ర పోషిస్తానన్న జనసేన నాయకుడు పవన్ కల్యాణ్ ఎందుకు మాట్లాడటంలేదని ప్రశ్నించారు. ధర్నా అనంతరం నాయకులు కార్యకర్తలు పవర్ పేట నుంచి ప్రభావతి ఆసుపత్రి వరకు నినాదాలు చేస్తూ ప్రదర్శన నిర్వహించారు. న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో ఏలూరు పెద్ద రైల్వేస్టేషన్ వద్ద ధర్నా నిర్వహించారు. నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కె.పొలారి, యు.వెంకటేవ్వరరావు, బద్దా వెంకట్రావు, కాకర్ల అప్పారావు తదితరులు నాయకత్వం వహించారు.