పెద్ద నోట్ల రద్దుతో దేశంలో ఆర్థిక సంక్షోభం
- ఆలిండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ కార్యదర్శి రాంబాబు
- 2 శాతం మందితో నగదురహిత సమాజం ఎలా సాధ్యం: చాడ
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం అకస్మాత్తుగా, అనాలోచితంగా తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయం.. భారత ఆర్థిక వ్యవస్థను సంక్షోభంలోకి నెడుతుందని ఆలిండియా బ్యాంక్ ఎంప్లాయీస్ జాతీయ కార్యదర్శి బీఎస్ రాంబాబు హెచ్చరించారు. సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం జరిగిన తెలంగాణ జిల్లాల కార్యదర్శుల వర్క్‌షాపులో ఆయన ముఖ్యఅతిథిగా పాలొ ్గన్నారు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం దేశవ్యాప్తంగా సామాన్యులు, మధ్య తరగతి ప్రజల జీవితాలను తీవ్రంగా దెబ్బ తీసిందని రాంబాబు చెప్పారు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని ప్రకటించడానికి ముందుగానే దానికి సంబంధించిన ఏర్పాట్లను చేసుకుంటే బాగుండేదన్నారు.
బ్యాంకుల్లో కరెన్సీని, ఏటీఎంల్లో నగదును అందుబాటులో ఉంచ కుండా ఇలాంటి నిర్ణ యం తీసుకోవడం వల్ల ఆర్థిక వ్యవస్థ అతలాకు తలమైందని విమర్శిం చారు. పాత నోట్లు రద్దు కావడంతో కొత్త కరెన్సీకి అనుగుణంగా ఏటీఎంల్లో సాంకేతిక మార్పులు చేయాల్సి ఉందన్నారు. దీంతో ప్రజలంతా ఏటీఎంల ముందు, బ్యాంకుల ముందు రోజంతా బారులు తీరినా కరెన్సీ దొరకని పరిస్థితి తలెత్తిందన్నారు. క్యూలో నిలబడి ఇప్పటికే 74 మంది చనిపోరుునా పాలకులకు చీమ కుట్టినట్టు కూడా లేదని విమర్శించారు. పెద్ద నోట్ల రద్దు ప్రక్రియ ఆచరణలో విఫలం కాగానే నగదురహిత సమాజాన్ని నిర్మిద్దామని ప్రధాని చెప్పడం ప్రజలను వంచించడం కాదా? అని ప్రశ్నించారు.
నగదు రహిత వ్యవస్థను తీసుకురావడానికి ముందు దానికి ఎదురయ్యే ఇబ్బందులను పరిశీలించకుండా, నగదురహిత సమాజ నిర్మాణం గురించి ప్రకటన చేయడం మరో తప్పు అవుతుందని రాంబాబు హెచ్చరించారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ.. అత్యంత అభివృద్ధి చెందిన అమెరికాలో ఇప్పటికి 45 శాతం మందే నగదు రహిత లావాదేవీలను నిర్వహిస్తున్నారని, చైనాలో 10 శాతమే జరుగుతున్నాయని చెప్పారు. మనదేశంలో ప్రస్తుతం 2 శాతమే నగదు రహిత లావాదేవీలు జరుగుతున్నాయని వివరించారు. టెక్నాలజీ అందుబాటులో లేకుండా, ప్రజలకు అవగాహన కల్పించకుండా, కేవలం 2 శాతం మందితో నగదు రహిత సమాజాన్ని నిర్మిస్తామని ప్రధాని చెప్పడం మరో మోసం కాదా? అని ప్రశ్నించారు.
దేశంలో 65 శాతానికి పైగా ప్రజలు వ్యవసాయం, వ్యవసాయాధారిత పరిశ్రమలపై ఆధారపడి ఉన్నారని, వీరితో నగదురహిత సమాజాన్ని ఎలా నిర్మిస్తారని ప్రశ్నించారు. కుబేరులను ప్రోత్సహించే విధంగా తప్ప పేదలకు ఉపయోగపడేలా మోదీ నిర్ణయం లేదని చాడ విమర్శించారు. సమావేశంలో సీపీఐ జాతీయ నేతలు అజీజ్‌పాషా, పల్లా వెంకటరెడ్డి, ఈర్ల నర్సింహా, పశ్య పద్మ, ఆదిరెడ్డి, బాల మల్లేశ్ తదితరులు పాల్గొన్నారు.