హోరెత్తిన ముంబై
సాక్షి, ముంబై : ఇటీవల రైతు ఆందోళనలతో హోరెత్తిన ముంబై తాజాగా రైల్వే ఉద్యోగార్థుల ఆందోళనతో ఉలిక్కిపడింది. రైల్వే పోస్టుల కోసం పరీక్షలు రాసిన అభ్యర్ధులు నియామకాలు కోరుతూ మంగళవారం పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. మతుంగ, ఛత్రపతి శివాజీ టెర్మినస్ స్టేషన్ల మధ్య నిరసనలకు దిగడంతో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. ఉద్యోగార్ధుల ఆందోళనల నేపథ్యంలో అధికారులు 60కి పైగా లోకల్ ట్రైన్స్‌ను రద్దు చేశారు.
విధులకు హాజరుకావాల్సిన ఉద్యోగులు, ఇతర ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రైల్వే ట్రాక్స్‌పై ఆందోళన చేపట్టిన నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జి చేశారు. పోలీసులపైకి ఆందోళనకారులు రాళ్లు రువ్వడంతో ఉద్రిక్తత నెలకొంది. రైల్వేలు నిర్వహించిన పరీక్షలకు తాము హాజరైనా ఇప్పటివరకూ నియామకాలు చేపట్టలేదని ఆందోళనకు దిగిన ఉద్యోగార్ధులు పేర్కొన్నారు. ముంబబై సెంట్రల్ లైన్ మీదుగా లోకల్ ట్రైన్స్‌లో రోజూ 40 నుంచి 42 లక్షల మంది ప్రయాణీకులు రాకపోకలు సాగిస్తుంటారు. కాగా,అభ్యర్థులు ఆందోళన విరమించారని, రైళ్ల రాకపోకలు పునరుద్ధరించినట్టు అధికారులు పేర్కొన్నారు.