Train stopping
-
బామ్మ సాహసం.. తప్పిన పెను ప్రమాదం
సాక్షి బెంగళూరు: రైలు పట్టాలపై ఓ పెద్ద చెట్టు విరిగిపడింది. అంతలోనే ఆ పట్టాలపై రైలు వస్తోంది. మరికొద్ది నిమిషాల్లో పెను ప్రమాదం జరిగేదే. కానీ.. ఓ బామ్మ ఎరుపు రంగు వస్త్రంతో దేవతలా వచ్చి ఆ రైలును ఆపేసింది. ఇదేదో సినిమాలో సీన్ కాదు. నిజంగా జరిగిన ఉదంతం. ఈ ఘటన మంగళూరు–పడీల్ జోకెట్ట మధ్యలో గల పచ్చనాడి సమీపంలోని మందారలో మార్చి 21వ తేదీన చోటుచేసుకోగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల ప్రకారం.. మార్చి 21న మధ్యాహ్నం 2.10 గంటలకు రైలు పట్టాలపై ఒక భారీ వృక్షం విరిగి పడింది. అదే సమయంలో మంగళూరు నుంచి ముంబై వెళ్లే మత్స్యగంధ రైలు వస్తోంది. దీన్ని గమనించిన 70 ఏళ్ల వృద్ధురాలు చంద్రావతి ఇంట్లోంచి ఎరుపు రంగు వస్త్రం తెచ్చి రైలుకు ఎదురుగా వెళ్లి జెండాలా ఊపుతూ నిలబడింది. దీనిని పసిగట్టిన లోకో పైలట్ రైలు వేగాన్ని తగ్గించి ఆపేశాడు. దీంతో పెను ప్రమాదం తప్పింది. అనంతరం స్థానికులు, రైల్వే సిబ్బంది పట్టాలపై పడిన చెట్టును పక్కకు తొలగించారు. పెద్ద ప్రమాదం తప్పడంతో రైల్వే అధికారులు, ప్రయాణికులు చంద్రావతిని అభినందించారు. ‘ఏం చేయాలో పాలుపోలేదు’ ఈ ఘటనపై చంద్రావతి మాట్లాడుతూ ‘ఆ రోజు మధ్యాహ్నం భోజనం చేసి ఇంటి బయట కూర్చొన్నాను. మా అక్క ఇంట్లోనే నిద్రపోతోంది. ఉన్నట్టుండి ఇంటి ఎదురుగా ఉన్న పట్టాలపై పెద్ద చెట్టు విరిగిపడింది. అదే సమయంలో మంగళూరు నుంచి ముంబైకి రైలు వెళుతుందనే విషయం గుర్తుకొచ్చింది. ఏం చేయాలో పాలుపోలేదు. ఎవరికైనా ఫోన్ చేసి చెబుదామని ఇంటి లోపలికి వెళ్లాను. అంతలోనే రైలు హారన్ వినిపించింది. వెంటనే ఇంట్లో ఉన్న ఎరుపు రంగు వస్త్రం తీసుకుని పట్టాల వద్దకు పరుగు తీశాను. నాకు గుండె ఆపరేషన్ అయింది. అయినా లెక్కచేయలేదు. రైలు వస్తున్నప్పుడు పట్టాల పక్కన నిలబడి ఆ ఎరుపు రంగు వస్త్రాన్ని ఊపాను. వెంటనే రైలు నెమ్మదించి ఆగిపోయింది. సుమారు అరగంట పాటు పట్టాలపై రైలు ఆగింది. స్థానికుల సహకారంతో ఆ చెట్టును తొలగించారు’ అని చెప్పింది. చంద్రావతి చేసిన సాహస కార్యాన్ని ప్రజలంతా అభినందించారు. -
రైలు ఆపి, ప్రాణం నిలిపి
యశవంతపుర: రైలు పట్టాలపై ఉన్న వ్యక్తిని గమనించిన లోకోపైలట్ రైలు వేగాన్ని తగ్గించి ఆ వ్యక్తి ప్రాణాలను కాపాడిన ఘటన దక్షిణ కన్నడ జిల్లా సుళ్య వద్ద సోమవారం సాయంత్రం జరిగింది. బెంగళూరు నుండి కుక్కే సుబ్రమణ్యరోడ్డు, పుత్తూరు మార్గంలో కారవారకు వెళ్తుండగా సరిమొగరు, ఎడమంగల స్టేషన్ల మధ్య రైలు వేగంగా వస్తోంది. అదే సమయంలో పట్టాలపై 45 ఏళ్ల వ్యక్తి ఉండటాన్ని దూరం నుంచి గమనించిన లోకోపైలెట్ అతని ప్రాణాలను కాపాడాలని రైలు వేగాన్ని తగ్గిస్తూ వచ్చాడు. అతని సమీపానికి వచ్చేలోపే రైలు పూర్తిగా వేగం తగ్గింది. అతనికి ఢీకొనగా చిన్నపాటి గాయాలయ్యాయి. ఆ వెంటనే లోకోపైలెట్, టీసీ బాధితుడిని అదే రైలులో తీసుకుని పుత్తూరు రైల్వేస్టేషన్‌కు తీసుకువచ్చారు. అక్కడి నుంచి రైల్వే సిబ్బంది అంబులెన్స్‌లో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సదరు వ్యక్తి వివరాలు తెలియాల్సి ఉంది. (చదవండి: హెలికాప్టర్ సర్వీస్ అని రూ. 17 వేలు టోపి) -
పుత్తూరులో రైళ్ల స్టాపింగ్‌కు వినతి
చెన్నై, సాక్షి ప్రతినిధి: వివిధ ప్రాంతాల నుంచి తిరుత్తణి కి వచ్చే రైళ్లకు పుత్తూరులో సైతం స్టాపింగ్ కల్పించాలని దక్షిణ రైల్వే జనరల్ మేనేజర్‌కు నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా విజ్ఞప్తి చేశారు. నగరి నియోజకవర్గ పరిధిలోని రైలు ప్రయాణికులు సమస్యల పరిష్కారం కోసం బుధవారం ఆమె చెన్నైకి వచ్చి రైల్వే జీఎంను కలుసుకున్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ, ఎమ్మెల్యేగా ఎన్నికైన తరువాత తొలిసారిగా జీఎంను కలిసేందుకు వచ్చానని తెలిపారు. తన నియోజకవర్గ సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. ఎముకల వైద్యచికిత్సలో పుత్తూరు కట్టు వందేళ్లుగా ప్రసిద్ధి చెంది ఉందని, తమిళనాడు నుంచి కూడా పెద్ద సంఖ్యలో రోగులు వస్తున్నందున వారి సౌకర్యార్థం తిరుత్తణి వరకు వచ్చే రైళ్లను పుత్తూరు వరకు పొడిగించి స్టాపింగ్ కల్పించాలని కోరినట్లు తెలిపారు. బురద, మట్టితో దుర్భరంగా ఉన్న రైల్వే అజమాయిషీలోని ఏకాంబరకుప్పం సబ్వేను ఎమ్మెల్యే నిధులతో తాను పూర్తిచేస్తానని చెప్పగా, త్వరలో తామే ఆ పనులు చేపడతామని జీఎం హామీ ఇచ్చినట్లు తెలిపారు. చెన్నై-తిరుపతి మధ్య ప్రవేశపెట్టిన లోకల్ రైలును కేవలం వారం రోజులకే రద్దుచేశారని దీనిని పునరుద్ధరించాలని జీఎంకు విజ్ఞప్తి చేసినట్లు ఆమె తెలిపారు. బాంబేమెయిల్కు ఏకాంబరకుప్పంలో స్టాపింగ్ కల్పించాలని, కాచిగూడ ఎక్స్‌ప్రెస్ రైలు స్టాపింగ్‌ను కొనసాగించాలని కోరినట్లు చెప్పారు. అన్ని అంశాలకు జీఎం సానుకూలంగా స్పందించినట్లు రోజా తెలిపారు. చుట్టుముట్టిన అభిమానులు జీఎం కార్యాలయానికి రోజా వస్తున్నట్లు తెలుసుకున్న రైల్వే సిబ్బంది వరాండాల్లోనే నిలబడ్డారు. ఆమెరాగానే చుట్టుముట్టి కరచాలనం చేశారు. మహిళా సిబ్బంది రోజాతో ఫొటో తీసుకున్నారు. అందరినీ ఆప్యాయంగా పలకరించి, ఫొటోలు దిగారు.