పుత్తూరులో రైళ్ల స్టాపింగ్‌కు వినతి
చెన్నై, సాక్షి ప్రతినిధి: వివిధ ప్రాంతాల నుంచి తిరుత్తణి కి వచ్చే రైళ్లకు పుత్తూరులో సైతం స్టాపింగ్ కల్పించాలని దక్షిణ రైల్వే జనరల్ మేనేజర్‌కు నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా విజ్ఞప్తి చేశారు. నగరి నియోజకవర్గ పరిధిలోని రైలు ప్రయాణికులు సమస్యల పరిష్కారం కోసం బుధవారం ఆమె చెన్నైకి వచ్చి రైల్వే జీఎంను కలుసుకున్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ, ఎమ్మెల్యేగా ఎన్నికైన తరువాత తొలిసారిగా జీఎంను కలిసేందుకు వచ్చానని తెలిపారు. తన నియోజకవర్గ సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. ఎముకల వైద్యచికిత్సలో పుత్తూరు కట్టు వందేళ్లుగా ప్రసిద్ధి చెంది ఉందని, తమిళనాడు నుంచి కూడా పెద్ద సంఖ్యలో రోగులు వస్తున్నందున వారి సౌకర్యార్థం తిరుత్తణి వరకు వచ్చే రైళ్లను పుత్తూరు వరకు పొడిగించి స్టాపింగ్ కల్పించాలని కోరినట్లు తెలిపారు.
బురద, మట్టితో దుర్భరంగా ఉన్న రైల్వే అజమాయిషీలోని ఏకాంబరకుప్పం సబ్‌వేను ఎమ్మెల్యే నిధులతో తాను పూర్తిచేస్తానని చెప్పగా, త్వరలో తామే ఆ పనులు చేపడతామని జీఎం హామీ ఇచ్చినట్లు తెలిపారు. చెన్నై-తిరుపతి మధ్య ప్రవేశపెట్టిన లోకల్ రైలును కేవలం వారం రోజులకే రద్దుచేశారని దీనిని పునరుద్ధరించాలని జీఎంకు విజ్ఞప్తి చేసినట్లు ఆమె తెలిపారు. బాంబేమెయిల్‌కు ఏకాంబరకుప్పంలో స్టాపింగ్ కల్పించాలని, కాచిగూడ ఎక్స్‌ప్రెస్ రైలు స్టాపింగ్‌ను కొనసాగించాలని కోరినట్లు చెప్పారు. అన్ని అంశాలకు జీఎం సానుకూలంగా స్పందించినట్లు రోజా తెలిపారు.
చుట్టుముట్టిన అభిమానులు
జీఎం కార్యాలయానికి రోజా వస్తున్నట్లు తెలుసుకున్న రైల్వే సిబ్బంది వరాండాల్లోనే నిలబడ్డారు. ఆమెరాగానే చుట్టుముట్టి కరచాలనం చేశారు. మహిళా సిబ్బంది రోజాతో ఫొటో తీసుకున్నారు. అందరినీ ఆప్యాయంగా పలకరించి, ఫొటోలు దిగారు.