tranco
-
ట్రాన్స్మిషన్ లైన్ల సామర్థ్యం పెంపు సక్సెస్
సాక్షి, హైదరాబాద్: జనసాంద్రత అధికంగా ఉండే హైదరాబాద్ వంటి నగర ప్రాంతాల్లో కొత్త విద్యుత్ ట్రాన్స్మిషన్ లైన్ల నిర్మాణానికి అవసరమైన స్థలాల లభ్యత ఉండదు. మరోవైపు ఏటా పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌కు అనుగుణంగా విద్యుత్ సరఫరా, పంపిణీ వ్యవస్థల సామర్థ్యం పెంచుకోక తప్పని పరిస్థితి. కొత్తలైన్ల నిర్మాణానికి స్థలాలు లేకపోవడంతో ఉన్న ట్రాన్స్మిషన్ లైన్ల సరఫరా సామర్థ్యాన్ని కొత్త సాంకేతిక పరిజ్ఞానంతో పెంచుకోవడం ఒక్కటే పరిష్కారం మార్గం. ఈ కోవలో చేపట్టిన 132 కేవీ నుంచి 220 కేవీకి ట్రాన్స్మిషన్ లైన్ల సామర్థ్యం పెంపు (అప్‌గ్రెడేషన్)కు సంబంధించిన పైలట్ ప్రాజెక్టు విజయవంతమైందని ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ, ఎస్ఆర్పీసీ చైర్మన్ ప్రభాకర్‌రావు తెలిపారు. మహారాష్ట్రలోని పుణేలో శనివారం జరిగిన సదరన్ రీజియన్ పవర్ కమిటీ (ఎస్ఆర్పీసీ) సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రయోగాత్మకంగా రెండు టవర్ల మధ్య ప్రస్తుత విద్యుత్ తీగల (కండక్టర్ల)ను తొలగించి వాటి స్థానంలో ‘హై టెంపరేచర్ లోసాగ్ కండక్టర్స్ (హెచ్‌టీఎల్‌ఎస్) తీగలను ఏర్పాటు చేయడంతో ఈ మేరకు విద్యుత్ సరఫరా సామర్థ్యం పెరిగిందని వెల్లడించారు. పైలట్ ప్రాజెక్టు విజయవంతం కావడంతో గచ్చిబౌలి నుంచి రామచంద్రాపురం వరకు 12 కి.మీ. పొడవునా 132 కేవీ ట్రాన్స్మిషన్ లైన్ సామర్థ్యాన్ని 220 కేవీకి పెంచే ప్రాజెక్టును చేపట్టామన్నారు. అదనపు స్థలాలు అవసరం లేకుండానే హెచ్‌టీఎల్‌ఎస్ తీగలతో సరఫరా లైన్ల సామర్థ్యం పెంచుకోవచ్చని ప్రభాకర్‌రావు వివరించారు. హెచ్‌టీఎల్‌ఎస్ తీగలు 210 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతను సైతం తట్టుకొని అధిక సామర్థ్యంతో విద్యుత్‌ను ప్రసారం చేయగలుగుతాయి. సంప్రదాయ తీగలు అధిక ఉష్ణోగ్రతలను తట్టుకోలేక కరిగిపోతాయి. ఎన్టీపీసీపై ఎస్ఆర్పీసీ అసంతృప్తి 2022 చివరిలోగా రామగుండంలోని 1,600 మెగావాట్ల ఎన్టీపీసీ థర్మల్ విద్యుత్ కేంద్రం నిర్మాణం పూర్తి చేస్తామని ఆ సంస్థ చైర్మన్ హామీనిచ్చినా గడువులోగా పూర్తికాలేదని ప్రభాకర్‌రావు అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో తెలంగాణ విద్యుత్ సంస్థలు బయట నుంచి అధిక ధరకు విద్యుత్‌ను కొనుగోలు చేయాల్సి వస్తోందన్నారు. ఇప్పటికైనా ఎన్టీపీసీ నిర్మాణ పనులను సత్వరమే పూర్తిచేయాలని ఎస్ఆర్పీసీ చైర్మన్ హోదాలో ఆదేశించారు. -
జీఐఎస్ సబ్‌స్టేషన్ సక్సెస్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నిర్మించిన తొలి 400 కేవీ గ్యాస్ ఇన్సులేటెడ్ సబ్‌స్టేషన్ (జీఐఎస్)ను తెలంగాణ విద్యుత్ సరఫరా సంస్థ (ట్రాన్స్‌కో) విజయవంతంగా చార్జింగ్ చేసింది. విద్యుత్ సౌధలోని లోడ్ డిస్పాచ్ సెంటర్ నుంచి ట్రాన్స్‌కో సీఎండీ డి.ప్రభాకర్‌రావు బుధవారం రిమోట్ ద్వారా ఈ సబ్‌స్టేషన్‌కు చార్జింగ్ నిర్వహించారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా భూగర్భంలో 120 మీటర్ల దిగువన నిర్మిస్తున్న మేడారం లిఫ్టుకు విద్యుత్ సరఫరా చేసేందుకు రూ.430 కోట్ల వ్యయంతో ఈ సబ్‌స్టేషన్‌ను ట్రాన్స్‌కో నిర్మించింది. మేడారం లిఫ్టులకు అనుసంధానంగా సబ్‌స్టేషన్‌ను భూగర్భంలో నిర్మించాల్సిన అవసరం ఏర్పడింది. ఫీడర్ల మధ్య నిర్దిష్ట దూరంతో సబ్‌స్టేషన్ నిర్మాణానికి కనీసం 30 ఎకరాల స్థలం అవసరం కాగా, భూగర్భంలో మేడారం లిఫ్టునకు అనుసంధానంగా సబ్‌స్టేషన్ నిర్మించడానికి అంత స్థలం అందుబాటులో లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో తక్కువ స్థలంలో నిర్మించేందుకు వీలు కలిగిన గ్యాస్ ఇన్సులేటెడ్ సబ్‌స్టేషన్‌ను మేడారంలో ట్రాన్స్‌కో నిర్మించింది. 3 వేల గజాల స్థలంలో ఈ సబ్‌స్టేషన్ నిర్మాణాన్ని 5 నెలల రికార్డు సమయంలో పూర్తి చేసింది. ఈ సబ్ స్టేషన్‌లోని ఫీడర్ల మధ్య తక్కు వ దూరం ఉన్నా, వాటి ద్వారా ప్రవహించే విద్యుత్ పరస్పరం సంపర్కంలోకి రాకుండా ఫీడర్ల మధ్య సల్ఫర్ హెగ్జాఫ్లోరైడ్ గ్యాస్ విద్యు త్ నిరోధకంగా పని చేయనుంది. ఈ తరహా సబ్‌స్టేషన్ దేశంలో మూడోది అని, రాష్ట్రంలో నిర్మించడం ఇదే తొలిసారి అని ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు ‘సాక్షి’కి తెలిపారు. 870 మెగావాట్ల విద్యుత్.. మేడారం పంపింగ్ స్టేషన్లో 124.4 మెగావాట్ల సామర్థ్యంతో ఏర్పాటుచేస్తున్న 7 పంపులకు ఈ సబ్‌స్టేషన్ ద్వారా 870.80 మెగావాట్ల విద్యుత్ సరఫరా కానుంది. ఈ సబ్‌స్టేషన్‌లో 160 ఎంవీఏ సామర్థ్యం కలిగిన ఏడు పవర్ ట్రాన్స్ఫార్మర్లు, 25 ఎంవీఏల సామర్థ్యం కలిగిన రెండు ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేశారు. రామడుగు 400/33 కేవీ సబ్ స్టేషన్ నుంచి భూగర్భంలోని మేడారం సబ్‌స్టేషన్ వరకు 20.3 కి.మీల 400 కేవీ క్యూఎండీసీ విద్యుత్ లైన్ నిర్మాణం కోసం 2,500 ఎస్‌క్యూఎంఎం కేబుల్‌ను వినియోగించారు. జీఐఎస్ సబ్‌స్టేషన్ చార్జింగ్ విజయవంతం కావడంతో ట్రాన్స్‌కో సీఎండీ, విద్యుత్ శాఖకు సీఎం కేసీఆర్ అభినందనలు తెలిపారు. -
ఏఈ.. అంతా అయోమయమోయీ..
సాక్షి, హైదరాబాద్: నల్లగొండ జిల్లాకు చెందిన ఇ.ఉదయ్‌కుమార్.. తెలంగాణ రాష్ట్ర విద్యుత్ సరఫరా సంస్థ (ట్రాన్స్‌కో)లో అసిస్టెంట్ ఇంజనీర్ (ఏఈ) పోస్టుకు దరఖాస్తు చేసుకున్నాడు. తండ్రి ఆర్మీలో పని చేయడంతో 1 నుంచి 4వ తరగతి వరకు జైపూర్ (రాజస్తాన్), 5 నుంచి 7వ తరగతి వరకు నాసిక్ (మహారాష్ట్ర), 8, 9 తరగతులను దారంగద్ర(గుజరాత్), 10వ తరగతిని తిన్సూకియా (అస్సాం)లో చదువుకున్నాడు. ఇంటర్, ఇంజనీరింగ్‌ను హైదరాబాద్‌లో పూర్తి చేశాడు. స్థానికేతరుడు అన్న కారణంతో ట్రాన్స్‌కో యాజమాన్యం ఇతడికి ఏఈ పోస్టు రాత పరీక్ష కోసం హాల్‌టికెట్ జారీ చేయలేదు. దీంతో ఉదయ్‌కుమార్ ట్రాన్స్‌కో సీఎండీ డి.ప్రభాకర్‌రావును కలసి మొరపెట్టుకోగా, దరఖాస్తును పునఃపరిశీలన జరిపి అతడికి ప్రత్యేకంగా హాల్‌టికెట్ ఇప్పించారు. ఇలా అర్హతలున్నా హాల్‌టికెట్ అందుకోని అభ్యర్థులు ట్రాన్స్‌కో యాజమాన్యాన్ని సంప్రదించని కారణంగా నష్టపోయే పరిస్థితి నెలకొంది. దరఖాస్తులు తీసుకుని.. ట్రాన్స్‌కోలో 330 ఏఈ పోస్టుల భర్తీకి ఆదివారం రాత పరీక్ష జరగనుండగా.. కొందరు అభ్యర్థులకు హాల్‌టికెట్లు జారీ కాలేదు. స్థానికేతరులనే కారణంతో పెద్ద సంఖ్యలో అభ్యర్థుల దరఖాస్తులను తిరస్కరించిన సంస్థ యాజమాన్యం.. మరికొందరు అభ్యర్థుల విషయంలో ఇటు దరఖాస్తులు తిరస్కరించకుండా అటు హాల్‌టికెట్లు జారీ చేయకుండా అయోమయంలో పడేసింది. 250 ఏఈ (ఎలక్ట్రికల్), 31 ఏఈ (టెలికం), 49 ఏఈ (సివిల్) పోస్టుల భర్తీకి సంస్థ యాజమాన్యం గత డిసెంబర్ 28న నోటిఫికేషన్ జారీ చేయగా, వేలాది మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఉద్యోగ నియామకాల్లో ఓపెన్ కేటగిరీ కింద 20 శాతం పోస్టులకు దేశ పౌరులెవరైనా అర్హులని రిజర్వేషన్ల నిబంధనలు పేర్కొంటుండగా, ట్రాన్స్‌కో ఏఈ పోస్టులకు కేవలం తెలంగాణ స్థానికత ఉన్న అభ్యర్థులే అర్హులని ఉద్యోగ నియామక ప్రకటనలోనే సంస్థ యాజమాన్యం స్పష్టం చేసింది. తెలంగాణ స్థానికత ఉన్న అభ్యర్థుల నుంచే దరఖాస్తులు స్వీకరించింది. తెలంగాణ ప్రాంత అభ్యర్థులమంటూ పేర్కొని దరఖాస్తు చేసుకున్న రాష్ట్రేతర అభ్యర్థుల దరఖాస్తులను తిరస్కరించింది. ఈ క్రమంలో తెలంగాణ ప్రాంతవాసులైనప్పటికీ తల్లిదండ్రుల ఉద్యోగాల రీత్యా దేశంలోని వివిధ ప్రాంతాల్లో చదువుకున్న అభ్యర్థుల దరఖాస్తులు కూడా తిరస్కరణకు గురైనట్లు సమాచారం. మాజీ సైనికోద్యోగుల పిల్లల దరఖాస్తులు వీటిలో ఉన్నాయి. ఇలా హాల్‌టికెట్లు అందని పలువురు అభ్యర్థులు శుక్ర, శనివారాల్లో ట్రాన్స్‌కో అధికారుల వద్ద మొరపెట్టుకున్నారు. వీరి దరఖాస్తులను పునఃపరిశీలించిన సంస్థ యాజమాన్యం అర్హులైన అభ్యర్థులకు అప్పటికప్పుడు ప్రత్యేక హాల్‌టికెట్లు జారీ చేసింది. ఏపీ అభ్యర్థులకు హాల్‌టికెట్లు ఇవ్వలేదు తెలంగాణ స్థానికత ఉన్న అభ్యర్థులకే హాల్‌టికెట్లు జారీ చేశాం. ఏపీ అభ్యర్థులకు హాల్‌టికెట్లు రావు. తెలంగాణ మాజీ సైనికోద్యోగుల పిల్లలకు శనివారం హాల్‌టికెట్లు ఇచ్చాం. అర్హులందరికీ హాల్‌టికెట్లు వచ్చాయి. – శ్రీనివాసరావు, ట్రాన్స్‌కో జేఎండీ 330 పోస్టులకు 68,171 మంది పోటీ రాష్ట్రంలో నెలకొన్న నిరుద్యోగ సమస్యకు తెలంగాణ ట్రాన్స్‌కోలో ఏఈ పోస్టుల భర్తీకి వచ్చిన స్పందన అద్దం పడుతోంది. ట్రాన్స్‌కోలో 330 ఏఈ పోస్టులకు 68,171 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. ఎలక్ట్రికల్ విభాగంలో 250 పోస్టులకు గాను 37,732 మంది, టెలికం విభాగంలో 31 పోస్టులకు 18,616 మంది, సివిల్ విభాగంలో 49 పోస్టులకు గాను 11,823 మంది అభ్యర్థులు ఆదివారం జరిగే రాత పరీక్షకు హాజరు కానున్నారని ట్రాన్స్‌కో వర్గాలు తెలిపాయి. -
యథేచ్ఛగా ఇటుక బట్టీలు
మేడ్చల్ : రైతుల బలహీనతలు, ఆర్థిక సంపాదనలు అంతంత మాత్రంగా ఉండటంతో వాటిని ఆసరా చేసుకున్న ఇటుక బట్టీల వ్యాపారులు మేడ్చల్ డివిజన్లోని మేడ్చల్, కీసర, శామీర్‌పేట్, మేడ్చల్ శివారు మండలం కుత్బుల్లాపూర్ మండలాల్లో వివిధ గ్రామాల్లో పేదలకు కేటాయించిన అసైన్డ్ భూముల్లోనే ఇటుక బట్టీలను ఏర్పాటు చేస్తున్నారు. ప్రభుత్వం రైతుల పంట సాగుకు ఉచిత కరెంట్ సరఫరా చేస్తుండగా వ్యాపారులు ఇటుకల తయారీకి ఉచిత విద్యుత్‌ను అక్రమంగా వాడుతున్నారు. డివిజన్ మండలాల్లో ఇటుక బట్టీల వ్యాపారం యథేచ్చగా కొనసాగుతున్నా రెవెన్యూ, ట్రాన్స్‌కో శాఖ అధికారులు మామూళ్ల మాయలో కళ్లకు గంతలు కట్టుకున్నారు. ప్రభుత్వం పేదల బతుకుదెరువు కోసం ఇచ్చిన అసైన్డ్ భూముల్లో నిబంధనలకు విరుద్ధంగా కొందరు వ్యాపారులు వీటిని ఏర్పాటు చేసి లక్షల రూపాయలు ఆర్జిస్తున్నారు. వంద ఎకరాల అసైన్డ్ భూముల్లో.... మేడ్చల్ మండలంలోని గౌడవెళ్లి, శ్రీరంగవరం, బండమాదారం, రాయిలాపూర్, గుండ్లపోచంపల్లి, నియోజకవర్గంలోని కీసరతో పాటు యాద్గార్పల్లి, తిమ్మాయిపల్లి, కరీంగూడ,భోగారం, శామీర్‌పేట మండలం ఉద్దెమర్రి, అలియాబాద్, జవహర్‌నగర్, కుత్బుల్లాపూర్ మండలం నాగులూర్, దుండిగల్ గ్రామాల పరిధిలో దాదాపు 300 ఎకరాల భూములను ఇటుక బట్టీల కోసం వినియోగిస్తున్నారు. ఇందులో 100 ఎకరాల వరకు అసైన్డ్ భూముల్లో ఇటుక బట్టీలు ఉన్నాయి. ప్రస్తుత నిర్మాణ రంగం పెరగడంతో పాటు హైదరాబాద్ నగర శివారు ప్రాంతాలైన మేడ్చల్, కీసర, శామీర్‌పేట్ మండలాల్లో ఇటుకల వ్యాపారానికి డిమాండ్ పెరిగింది. ఇదే అదునుగా భావించిన వ్యాపారులు ప్రైవేట్, ప్రభుత్వ అసైన్డ్ పొలాల్లో బట్టీలను ఏర్పాటు చేస్తున్నారు. దుర్వినియోగం అవుతున్న ఉచిత విద్యుత్ ఇటుక బట్టీల నిర్వాహకులు వ్యవసాయ బోర్ల నీటినే వాడుతున్నారు. దీంతో ప్రభుత్వం వ్యవసాయ రంగానికి అందిస్తున్న ఉచిత విద్యుత్ దుర్వినియోగమవుతుంది. డివిజన్లో సుమారు 300 వరకు ఇలా ఇటుక బట్టీలను నిర్వహిస్తున్నారు. ఇందులో 90 శాతం వరకు అక్రమంగా విద్యుత్‌ను వాడుతున్నారు. ఇటుకల తయారీకి పొలాల్లో ఉండే బోర్ల నుంచి బట్టీల వరకు పైప్లైన్ల వేసుకుంటున్నారు. కొందరైతే బట్టీల వద్ద ఎకంగా కాలువలు తవ్వేస్తున్నారు. ప్రభుత్వ ఆధాయానికి గండీ కొడుతున్నా అధికారులు మాత్రం ఏమీ ఎరగనట్లు వ్యవహరించడం గమనార్హం. అక్రమార్కులకు అధికారుల అండదండలు ఇటుక బట్టీల వ్యాపారంలో అక్రమార్కులకు గ్రామస్థాయి నుంచి మండల స్థాయి వరకు ఉన్న కొంతమంది అధికారులు అక్రమ వ్యాపారాన్ని పెంచి ప్రోత్సహిస్తున్నారు. గ్రామాల్లో ఉండే రెవెన్యూ అధికారులకు ఏవి అసైన్డ్ భూములో ఏవి పట్టా భూములో ఖచ్చితంగా తెలుసు. కానీ అసైన్డ్ భూముల్లో ఇటుక బట్టీలు నడుస్తున్నా పట్టించుకోరు. గ్రామాల రెవెన్యూ అధికారులు బట్టీల వ్యాపారులతో నెలకు కొంత అమౌంట్ ఇవ్వాలని వ్యాపారం ప్రారంభంకాక ముందే మాట్లాడుకుంటున్నారని పలువురు బహీరంగంగానే అంటున్నారు. ట్రాన్స్‌కో వారికి కాసుల పంట ఇటుక బట్టీల వ్యాపారం ట్రాన్స్‌కో అధికారులకు కాసుల పంటగా మారింది. గ్రామాల్లో ఉచిత కరెంట్ బోరు నుంచి నీరు అందెలా చూసేది కరెంటోళ్లే. పేరుకు ఒక చోట కమర్షియల్ మీటర్ పెట్టి మిగతాదంతా ఉచిత కరెంటును వాడుకుంటున్నారు. విద్యుత్ సిబ్బందికి అన్ని తెలిసినా వారికి ముట్టాల్సింది ముట్టడంతో అక్రమ వ్యాపారులకు అండగా నిలబడుతున్నారని స్థానికులు అనుకుంటున్నారు. తాము ఉన్నామని చెప్పుకునేందుకు అప్పుడప్పుడు విజిలెన్స్ అధికారులతో కలిసి దాడులు చేసి నామమాత్రపు అపరాధ రుసుములు విధిస్తున్నారు. -
ట్రాన్స్‌కో డీఈకి ఘన సన్మానం
సూర్యాపేటటౌన్ : తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్ చేతుల మీదుగా రాష్ట్ర ఉత్తమ అవార్డు తీసుకున్న ట్రాన్స్ కో డీఈ ఎ.శ్రీనివాసులును సూర్యాపేట పట్టణ ముదిరాజ్ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక పబ్లిక్ క్లబ్ ఫంక్షన్ హాల్లో ఘనంగా పూలమాలలు, శాలువాలతో సన్మానించారు. ఈ సందర్భంగా డీఈ శ్రీనివాసులు మాట్లాడుతూ 25ఏళ్ల నుంచి డిపార్ట్మెంట్లో చేసిన కృషి ఫలితమే తనకు ఈ అవార్డు లభించిందన్నారు. అలాగే సంఘం జిల్లా అధ్యక్షుడు ఉప్పరబోయిన స్వామి ముదిరాజ్, టీఆర్ఎస్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ ఆకుల లవకుశలు హాజరై మాట్లాడారు. పతాని నర్సయ్య అధ్యక్షత జరిగిన ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ వెలుగు సంతోషి, నారబోయిన విజయ్, నక్క రవి, నక్క రాంభానేష్, సారగండ్ల రాములు, అర్వపల్లి లింగయ్య, మాణిక్యమ్మ, వెలుగు వెంకన్న, చందనబోయిన వెంకన్న తదితరులు పాల్గొన్నారు.