సాక్షి, హైదరాబాద్: నల్లగొండ జిల్లాకు చెందిన ఇ.ఉదయ్‌కుమార్.. తెలంగాణ రాష్ట్ర విద్యుత్ సరఫరా సంస్థ (ట్రాన్స్‌కో)లో అసిస్టెంట్ ఇంజనీర్ (ఏఈ) పోస్టుకు దరఖాస్తు చేసుకున్నాడు. తండ్రి ఆర్మీలో పని చేయడంతో 1 నుంచి 4వ తరగతి వరకు జైపూర్ (రాజస్తాన్), 5 నుంచి 7వ తరగతి వరకు నాసిక్ (మహారాష్ట్ర), 8, 9 తరగతులను దారంగద్ర(గుజరాత్), 10వ తరగతిని తిన్‌సూకియా (అస్సాం)లో చదువుకున్నాడు. ఇంటర్, ఇంజనీరింగ్‌ను హైదరాబాద్‌లో పూర్తి చేశాడు. స్థానికేతరుడు అన్న కారణంతో ట్రాన్స్‌కో యాజమాన్యం ఇతడికి ఏఈ పోస్టు రాత పరీక్ష కోసం హాల్‌టికెట్ జారీ చేయలేదు. దీంతో ఉదయ్‌కుమార్ ట్రాన్స్‌కో సీఎండీ డి.ప్రభాకర్‌రావును కలసి మొరపెట్టుకోగా, దరఖాస్తును పునఃపరిశీలన జరిపి అతడికి ప్రత్యేకంగా హాల్‌టికెట్ ఇప్పించారు. ఇలా అర్హతలున్నా హాల్‌టికెట్ అందుకోని అభ్యర్థులు ట్రాన్స్‌కో యాజమాన్యాన్ని సంప్రదించని కారణంగా నష్టపోయే పరిస్థితి నెలకొంది.
దరఖాస్తులు తీసుకుని..
ట్రాన్స్‌కోలో 330 ఏఈ పోస్టుల భర్తీకి ఆదివారం రాత పరీక్ష జరగనుండగా.. కొందరు అభ్యర్థులకు హాల్‌టికెట్లు జారీ కాలేదు. స్థానికేతరులనే కారణంతో పెద్ద సంఖ్యలో అభ్యర్థుల దరఖాస్తులను తిరస్కరించిన సంస్థ యాజమాన్యం.. మరికొందరు అభ్యర్థుల విషయంలో ఇటు దరఖాస్తులు తిరస్కరించకుండా అటు హాల్‌టికెట్లు జారీ చేయకుండా అయోమయంలో పడేసింది. 250 ఏఈ (ఎలక్ట్రికల్), 31 ఏఈ (టెలికం), 49 ఏఈ (సివిల్) పోస్టుల భర్తీకి సంస్థ యాజమాన్యం గత డిసెంబర్ 28న నోటిఫికేషన్ జారీ చేయగా, వేలాది మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఉద్యోగ నియామకాల్లో ఓపెన్ కేటగిరీ కింద 20 శాతం పోస్టులకు దేశ పౌరులెవరైనా అర్హులని రిజర్వేషన్ల నిబంధనలు పేర్కొంటుండగా, ట్రాన్స్‌కో ఏఈ పోస్టులకు కేవలం తెలంగాణ స్థానికత ఉన్న అభ్యర్థులే అర్హులని ఉద్యోగ నియామక ప్రకటనలోనే సంస్థ యాజమాన్యం స్పష్టం చేసింది.
తెలంగాణ స్థానికత ఉన్న అభ్యర్థుల నుంచే దరఖాస్తులు స్వీకరించింది. తెలంగాణ ప్రాంత అభ్యర్థులమంటూ పేర్కొని దరఖాస్తు చేసుకున్న రాష్ట్రేతర అభ్యర్థుల దరఖాస్తులను తిరస్కరించింది. ఈ క్రమంలో తెలంగాణ ప్రాంతవాసులైనప్పటికీ తల్లిదండ్రుల ఉద్యోగాల రీత్యా దేశంలోని వివిధ ప్రాంతాల్లో చదువుకున్న అభ్యర్థుల దరఖాస్తులు కూడా తిరస్కరణకు గురైనట్లు సమాచారం. మాజీ సైనికోద్యోగుల పిల్లల దరఖాస్తులు వీటిలో ఉన్నాయి. ఇలా హాల్‌టికెట్లు అందని పలువురు అభ్యర్థులు శుక్ర, శనివారాల్లో ట్రాన్స్‌కో అధికారుల వద్ద మొరపెట్టుకున్నారు. వీరి దరఖాస్తులను పునఃపరిశీలించిన సంస్థ యాజమాన్యం అర్హులైన అభ్యర్థులకు అప్పటికప్పుడు ప్రత్యేక హాల్‌టికెట్లు జారీ చేసింది.
ఏపీ అభ్యర్థులకు హాల్‌టికెట్లు ఇవ్వలేదు
తెలంగాణ స్థానికత ఉన్న అభ్యర్థులకే హాల్‌టికెట్లు జారీ చేశాం. ఏపీ అభ్యర్థులకు హాల్‌టికెట్లు రావు. తెలంగాణ మాజీ సైనికోద్యోగుల పిల్లలకు శనివారం హాల్‌టికెట్లు ఇచ్చాం. అర్హులందరికీ హాల్‌టికెట్లు వచ్చాయి.
– శ్రీనివాసరావు, ట్రాన్స్‌కో జేఎండీ
330 పోస్టులకు 68,171 మంది పోటీ
రాష్ట్రంలో నెలకొన్న నిరుద్యోగ సమస్యకు తెలంగాణ ట్రాన్స్‌కోలో ఏఈ పోస్టుల భర్తీకి వచ్చిన స్పందన అద్దం పడుతోంది. ట్రాన్స్‌కోలో 330 ఏఈ పోస్టులకు 68,171 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. ఎలక్ట్రికల్ విభాగంలో 250 పోస్టులకు గాను 37,732 మంది, టెలికం విభాగంలో 31 పోస్టులకు 18,616 మంది, సివిల్ విభాగంలో 49 పోస్టులకు గాను 11,823 మంది అభ్యర్థులు ఆదివారం జరిగే రాత పరీక్షకు హాజరు కానున్నారని ట్రాన్స్‌కో వర్గాలు తెలిపాయి.
Comments
Please login to add a commentAdd a comment