బ్యాంక్ ఉద్యోగుల సమ్మె
నిలిచిపోయిన లావాదేవీలు
నెల్లూరు(బృందావనం):
ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణ, విలీనాలను వ్యతిరేకిస్తూ యూఎఫ్‌బీఐ ఇచ్చిన పిలుపు మేరకు శుక్రవారం జిల్లాలోని ప్రభుత్వ బ్యాంకుల ఉద్యోగులు ఒక రోజు సమ్మె నిర్వహించారు. దీంతో జిల్లాలోని ప్రభుత్వ బ్యాంకుల్లో లావాదేవీలు నిలిచి పోయాయి. ఈ సందర్భంగా దర్గామిట్టలోని ఆంధ్రాబ్యాంక్ ప్రధానశాఖ వద్ద నిర్వహించిన సమావేశంలో యూఎఫ్‌బీఐ జిల్లా అధ్యక్షుడు ఎన్వీఎస్ ప్రసాద్ మాట్లాడారు. కేంద్రప్రభుత్వం ప్రభుత్వరంగ బ్యాంకులను నిర్వీర్యం చేసేందుకు యత్నిస్తోందన్నారు. ప్రైవేటీకరణతో ఎన్నో సమస్యలు ఉత్పన్నమౌతాయన్నారు. ఈ విధానాలను బ్యాంకు ఉద్యోగులు సమష్టిగా ఎదిరించాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వరంగ బ్యాంకుల మనుగడను కాపాడుకోవాలన్నారు. బ్యాంకు ఉద్యోగులు ఆందోళనకు ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రహ్మణ్యం, ఏఐటీయూసీ, సీఐటీయూ, ఎల్ఐసీ యూనియన్ల నాయకులు దామా అంకయ్య, రామరాజు, మోహన్‌రావు, నగేష్, ఆంజనేయులు, యూఎఫ్‌బీఐ నాయకులు వి.ఉదయ్‌కుమార్, ఆనంద్రాంసింగ్ డి.మురళీకృష్ణ, రమణప్రసాద్, రఘురామ్‌కుమార్, భాస్కర్ తదితరులు మాట్లాడారు. కేంద్రప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా,కార్మిక వ్యతిరేక విధానాలు నిరసిస్తూ నినాదాలు చేశారు.
స్తంభించిన బ్యాంక్‌ల లావాదేవీలు
జిల్లాలో వివిధ ప్రాంతాల్లో ఉన్న సుమారు 200కుపైగా ప్రభుత్వ బ్యాంకుల్లో బ్యాంక్ సిబ్బంది సమ్మెతో వందల కోట్ల రూపాయల లావాదేవీలు నిలిచిపోయినట్లు ఉద్యోగులు తెలిపారు.