transco CMD Prabhakar rao
-
కేంద్రం వల్లే విద్యుత్ సంక్షోభం
సాక్షి, హైదరాబాద్: ‘దేశంలో ఇటీవల తలెత్తిన విద్యుత్ సంక్షోభానికి డిస్కంలను తప్పుబట్టలేం. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలే అందుకు కారణం. విద్యుత్ ఉమ్మడి అంశమని మరిచిపోయిన కేంద్రం... రాష్ట్రాల సమ్మతి లేకుండానే వాటిపై ఏకపక్ష విధానాలను రుద్దుతోంది. విదేశీ బొగ్గు దిగుమతులు చేయాలని ఒత్తిడి చేస్తోంది. సింగరేణి నుంచి తెలంగాణ జెన్కో థర్మల్ విద్యుత్ ప్లాంట్లకు ఏటా 16 మిలియన్ టన్నుల బొగ్గు సరఫరా ఉంది. జెన్కోకు సొంత (క్యాప్టివ్) బొగ్గు గని సైతం ఉంది. మేమెందుకు బొగ్గు దిగుమతి చేయాలి? ఆ భారం ప్రజలపై ఎందుకు వేయాలి?’ అని తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు ప్రశ్నించారు. విద్యుత్ చట్ట సవరణ ముసాయిదా బిల్లు, విద్యుత్‌రంగ ప్రైవేటీకరణ, బొగ్గు దిగుమతులతోపాటు ఇతర కేంద్ర ప్రభుత్వ విద్యుత్ విధానాలకు వ్యతిరేకంగా శనివారం హైదరాబాద్ లో జరిగిన అఖిల భారత విద్యుత్ ఇంజనీర్ల సమాఖ్య కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. బొగ్గు దిగుమతుల ఖర్చుకు డిస్కంలు ప్రతి వారం విద్యుదుత్పత్తి కంపెనీలకు 15 శాతం బిల్లులు చెల్లించాలని కేంద్రం ఆదేశించడాన్ని ప్రభాకర్‌రావు తప్పబట్టారు. ప్రైవేటీకరణ కోసమే... ప్రభుత్వ నియంత్రణ లో విద్యుత్ పంపిణీ, ధరల నిర్ణయం ఉండ కూడదన్న భావనతోనే కేంద్రం విద్యుత్‌రంగ ప్రైవేటీకరణకు ప్రయత్నిస్తోందని ప్రభాకర్‌రా వు విమర్శించారు. -
కొండపోచమ్మ లిఫ్టు సిద్ధం చేయండి
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుతం రంగనాయకసాగర్ వరకు విజయవంతంగా కాళేశ్వరం ప్రాజెక్టు నీరు వస్తున్నదని, ఆ నీటిని ఈ వానాకాలంలోనే కొండపోచమ్మసాగర్ వరకు తరలించేందుకు విద్యుత్ శాఖ చేస్తున్న ఏర్పాట్ల పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సంతృప్తి వ్యక్తం చేశారు. అక్కారం, మర్కూక్ పంపుహౌజుల వద్ద తనిఖీలు నిర్వహిస్తున్న ట్రాన్స్‌కో సీఎండీ డి.ప్రభాకర్‌రావుకు సీఎం ఫోన్ చేసి మాట్లాడారు. కొండపోచమ్మసాగర్ వరకు నీటిని తరలించేందుకు జరుగుతున్న లిఫ్టు పనులపై ఆరా తీశారు. నాలుగైదు రోజుల్లో లిఫ్టులన్నీ సిద్ధం చేయాలని కోరారు. ఈ వానాకాలంలోనే కొండపోచమ్మసాగర్ వరకు నీటిని తరలిస్తామన్నారు. విద్యుత్ శాఖ మొదటి నుంచి నిర్ణీత గడువులోగా తమ పనులు పూర్తి చేస్తూ మిగతా వారికి ఆదర్శంగా నిలుస్తున్నదని సీఎం ప్రశంసించారు. నాలుగైదు రోజుల్లో లిఫ్టులు సిద్ధం: సీఎండీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు అన్ని లిఫ్టులను నాలుగైదు రోజుల్లోనే సిద్ధం చేస్తామని ట్రాన్స్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు ప్రకటించారు. ప్రస్తుతం కాళేశ్వరం నీటిని రంగనాయక్ సాగర్ వరకు విజయవంతంగా లిఫ్టు చేయగలుగుతున్నామని, అక్కడి నుంచి కొండపోచమ్మసాగర్ వరకు నీటిని తరలించేందుకు యుద్ధ ప్రాతిపదికన పనిచేస్తున్నట్లు వెల్లడించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని అక్కారం, మర్కూక్ పంపుహౌజుల పనులను ప్రభాకర్‌రావు గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడి సిబ్బందికి తగు సూచనలు చేశారు. కరోనా వైరస్ వ్యాప్తి జరగకుండా అన్ని నియమాలు పాటించాలని, భౌతిక దూరం పాటిస్తూ పనులు చేయాలని సూచించారు. ‘ప్రస్తుత కాళేశ్వరం ప్రాజెక్టు నీరు రంగనాయక్ సాగర్ వరకు విజయవంతంగా చేరుకుంది. అక్కడి నుంచి మల్లన్నసాగర్‌కు, తర్వాత కొండపోచమ్మ సాగర్‌కు నీటిని ఎత్తిపోయడానికి అవసరమైన లిఫ్టులను విద్యుత్ శాఖ యుద్ధ ప్రాతిపదికన సిద్ధం చేస్తున్నది. అక్కారంలో 162 మెగావాట్ల సామర్థ్యం కలిగిన పంపుసెట్లు సిద్ధంగా ఉన్నాయి. అక్కడి నుంచి నీరు మర్కూక్ చేరుకుంటుంది. మర్కూక్ నుంచి నీటిని ఎత్తిపోయడానికి 204 మెగావాట్ల సామర్థ్యం కలిగిన పంపులు సిద్ధమయ్యాయి. నాలుగు బృందాలు రేయింబవళ్లు పనిచేస్తున్నాయి. టెస్టింగ్ పూర్తి చేసి, నాలుగైదు రోజుల్లోనే సిద్ధం చేస్తాం’అని సీఎండీ చెప్పారు. ప్రభాకర్‌రావు వెంట ట్రాన్స్‌కో జేఎండీ శ్రీనివాసరావు, డైరెక్టర్ జె.సూర్యప్రకాశ్, ఈడీ ప్రభాకర్‌రావు, ఎస్ఈ ఆంజనేయులు, వేణు తదితరులున్నారు. ముంబై నుంచి నిపుణుల బృందం రాక పంపుహౌజుల కేబుల్ పనులు చేసే రాహుల్ కేబుల్ ఇంజనీరింగ్‌కు చెందిన నిపుణుల బృందం లాక్డౌన్ కారణంగా ముంబైలో చిక్కుకుంది. వారు వస్తే తప్ప ఇక్కడ పనులు జరిగే అవకాశం లేదు. దీంతో ప్రభాకర్‌రావు తెలంగాణ డీజీపీ మహేందర్‌రెడ్డికి లేఖ రాశారు. డీజీపీ మహారాష్ట్ర డీజీపీకి లేఖ రాసి, ఫోన్ ద్వారా మాట్లాడి ప్రత్యేక అనుమతి ఇప్పించారు. దీంతో ప్రత్యేక అనుమతితో కూడిన వాహనాల్లో నిపుణుల బృందం ఈ నెల 21న సిద్దిపేట జిల్లాకు చేరుకుంది. వారి ఆధ్వర్యంలో పంపుహౌజుల కేబుల్ పనులు నడుస్తున్నాయి. తొలగిన అడ్డంకి ► మే 1లోగా కొండపోచమ్మ ముంపు గ్రామాల బాధితుల్ని ఖాళీ చేయించండి ► సిద్దిపేట కలెక్టర్‌కు హైకోర్టు ఆదేశం కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని కొండపోచమ్మ రిజర్వాయర్ ముంపునకు గురయ్యే మామిడ్యాల, బహిలాంపూర్ గ్రామాల వారిని మే 1వ తేదీలోగా ఖాళీ చేయించాలని సిద్దిపేట జిల్లా కలెక్టర్‌ను హైకోర్టు ఆదేశించింది. ములుగు మండలంలోని ఆ రెండు గ్రామాలకు చెందిన 55 కుటుంబాలను పునరావాస పథకం కింద నిర్మించిన గృహాల్లోకైనా.. లేదా తాత్కాలిక నివాసాల్లోకైనా తరలించాలని ఆదేశించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ ఎ.అభిషేక్‌రెడ్డిల ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ రెండు గ్రామాలకు చెందిన 26 మంది దాఖలు చేసిన రిట్ పిటిషన్లను గురువారం మరోసారి విచారణకు వచ్చిన సందర్భంగా ధర్మాసనం.. పిటిషనర్లకు చెల్లించాల్సిన 55 మంది ఇళ్ల పరిహారం, పట్టాలను పిటిషనర్ తరఫు న్యాయవాదికి అందజేయాలని ఆదేశించింది. పరిహార వివాదాల పేరిట ప్రాజెక్టులపై మధ్యంతర ఉత్తర్వులు కొనసాగించలేమని కూడా స్పష్టం చేసింది. ప్రాజెక్ట్ నిర్మాణాలపై అభ్యంతరాలను సామరస్యంగా పరిష్కరించుకోవాలని హితవు చెప్పింది. తదుపరి విచారణను ఈ నెల 27కి వాయిదా వేసింది. -
తెలంగాణ పవర్ గ్రిడ్ సురక్షితం..
సాక్షి, హైదరాబాద్: కరోనా చీకట్లను తరిమికొట్టడానికి దేశమంతా ఒక్కటై సంకల్ప బలాన్ని ప్రదర్శించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఏప్రిల్ 5 ఆదివారం రాత్రి 9 గంటలకు ఇళ్లలో లైట్లు అన్ని ఆర్పేసి దీపాలు, కొవ్వొత్తులు, టార్చిలైట్లు, మొబైల్‌లలో ఫ్లాష్ లైట్లు తొమ్మిది నిమిషాల సేపు వెలిగించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో ప్రధాని తాజా పిలుపుపై విపక్షనేతలు, విద్యుత్తు ఇంజనీర్లు, నిపుణుల నుంచి విమర్శలు చెలరేగుతున్నాయి. ఒకేసారి అన్ని లైట్లను స్విచ్ ఆఫ్ చేయడం వల్ల పవర్ గ్రిడ్ వైఫల్యానికి దారితీయనున్నట్లు విద్యుత్ రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో దీనిపై తెలంగాణ జెన్కో, ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్ రావు శనివారం స్పందించారు. (లైట్లన్నీ ఆర్పేస్తే : గ్రిడ్ కుప్పకూలుతుంది ప్రధాని నరేంద్ర మోదీ పిలుపుతో లైట్లు ఒకేసారి ఆపివేయడం వల్ల తెలంగాణ పవర్ గ్రిడ్‌పై ఎలాంటి ప్రభావం ఉండదని ప్రభాకర్ రావు స్పష్టం చేశారు. ఆదివారం రాత్రి 9 గంటలకు ఎటువంటి అవాంతరాలు జగరకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని ఆయన తెలిపారు. పవర్ గ్రిడ్‌కు ఏ సమస్య రాకుండా అప్రమత్తంగా ఉన్నామని ఆయన చెప్పారు. కరోనా కట్టడికి.. ప్రధాని మోదీ పలుపును విజయవంతం చేయాలని ఆయన ప్రజలను కోరారు. తెలంగాణ ప్రవర్ గ్రిడ్ సురక్షితంగా ఉందని ఆయన పేర్కొన్నారు. ఇప్పటి నుంచే జాగ్రత్తలు పాటించాలని ప్రభాకర్ రావు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. (9 గంటలకు.. 9 నిమిషాల పాటు) -
‘నిరంతర విద్యుత్ కోసం సీఎం కేసీఆర్ ముందుచూపు’
సాక్షి, సూర్యాపేట : నిరంతర విద్యుత్ విషయంలో సీఎం కేసీఆర్ ముందు చూపుతో వ్యవహరిస్తున్నారని తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ ప్రభాకర్ రావు స్పష్టం చేశారు. చింతలపాలెం మండలంలోని పులిచింతల ప్రాజెక్టు విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని మంగళవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. శ్రీశైలం, నాగార్జునసాగర్‌లలో పూర్తి స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నామని తెలిపారు. రైతులకు, పరిశ్రమలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా విద్యుత్ వినియోగించుకునేందుకు గ్రిడ్స్ ద్వారా సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. విద్యుత్ అధికారులు పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉన్నారని, విద్యుత్ విషయంలో ఎల్లప్పుడూ ముఖ్యమంత్రికి పూర్తి నివేదిక అందజేస్తున్నట్లు పేర్కొన్నారు. -
ఓర్వ లేకే విమర్శలు
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా ఘనత ఆ శాఖ ఇంజనీర్లదేనని..దీన్ని జీర్ణించుకోలేని కొందరు వారి ఆత్మస్థైర్యం దెబ్బతీసే విధంగా మాట్లాడటం సరికాదని ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఎంతో ప్రాధాన్యతని స్తోందని, దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో ఉచిత విద్యుత్ పథకం అమలవుతోందన్నారు. ఆర్టీసీ కళ్యాణ మండపంలో శనివారం విద్యుత్ అకౌంట్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ డైరీ–2018 ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. సీఎం కేసీఆర్, మంత్రి జగదీశ్‌రెడ్డి మద్దతుతో విద్యుత్ రంగాన్ని ముందుకు తీసుకెళ్తున్నామన్నారు. జనరేషన్, ట్రాన్స్మిషన్, డిస్ట్రిబ్యూషన్ నష్టాలను తగ్గించామని, ఇది సమష్టి కృషి వల్లే సాధ్యమైందన్నారు. విద్యుత్ సరఫరా, బిల్లుల వసూళ్లు, నష్టాల నివారణ వంటి అంశాల్లో అకౌంట్స్ ఆఫీసర్లు ఇంజనీర్లకు సలహాలివ్వాలని కోరారు. కార్యక్రమంలో ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి, ఎన్పీడీసీఎల్ సీఎండీ గోపాల్‌రావు, విద్యుత్ అకౌంట్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పి.అంజయ్య, అధ్యక్షుడు ఎన్.అశోక్, ప్రతినిధులు శంకర్, వి.పరమేశ్, అనురాధ పాల్గొన్నారు. -
ఈ ఏడాది కరెంట్ చార్జీలు పెంచం
- ట్రాన్స్‌కో సీఎండీ డి. ప్రభాకర్‌రావు స్పష్టీకరణ - డిస్కం అప్పులను టేకోవర్ చేసుకున్నందున సీఎం పెంపు వద్దన్నారు - అంతర్గత సామర్థ్యం పెంపుతో ఆర్థిక లోటు అధిగమిస్తామని వెల్లడి సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఈ ఏడాది విద్యుత్ చార్జీలు పెంచడంలేదని తెలంగాణ ట్రాన్స్‌కో సీఎండీ డి.ప్రభాకర్‌రావు స్పష్టంచేశారు. విద్యుత్ చార్జీలు పెంచబోమని అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చేసిన ప్రకటనకు కట్టుబడి ఉంటామన్నారు. ఉదయ్ పథకంలో చేరడం ద్వారా డిస్కంలకు ఉన్న రూ.8,923 కోట్ల అప్పులను రాష్ట్ర ప్రభుత్వం టేకోవర్ చేసుకున్నందున చార్జీలు పెంచవద్దని సీఎం ఆదేశించినట్లు తెలిపారు. అంతర్గత సామర్థ్యాన్ని పెంచుకుని డిస్కంల ఆర్థిక లోటును అధిగమించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారన్నారు. పరిశ్రమలకు విద్యుత్ విక్రయాలు పెరగడంతో చార్జీల పెంపు అవసరం లేదని సీఎం అభిప్రాయపడినట్లు వివరించారు. విద్యుత్ చార్జీల పెంపు అంశంపై మంగళవారం ‘సాక్షి’తో సీఎండీ ప్రత్యేకంగా మాట్లాడారు. విద్యుత్ చార్జీలు పెంచితే రాష్ట్రంలోని పరిశ్రమలు.. డిస్కంల విద్యుత్‌కు బదులు బహిరంగ మార్కెట్ నుంచి ఓపెన్ యాక్సెస్ విధానంలో తక్కువ ధర విద్యుత్ కొనుగోళ్లు చేస్తున్నట్టు పేర్కొన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో ఏటా 2 వేల మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను పరిశ్రమలు ఓపెన్ యాక్సెస్ విధానంలో కొనుగోలు చేస్తుండడంతో డిస్కంలు రూ.400 కోట్లకు పైగా ఆదాయాన్ని కోల్పోతున్నాయన్నారు. పరిశ్రమలపై మళ్లీ పట్టుబిగించేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారన్నారు. ఆ లోటు కేవలం అంచనానే.. ప్రస్తుత విద్యుత్ చార్జీలనే 2017–18లో అమలు చేస్తే రూ.8,900 కోట్ల ఆర్థిక లోటు భరించాల్సి ఉంటుందన్నది కేవలం డిస్కంల అంచనా మాత్రమేనని ప్రభాకర్ రావు తెలిపారు. ఈ అంచనాలను రాష్ట్ర ప్రభుత్వం కాని, రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి(టీఎస్ఈఆర్సీ) కాని ఆమోదించలేదన్నారు. గతేడాది కూడా రూ.6,800 కోట్ల ఆర్థిక లోటు ఉండవచ్చని డిస్కంలు అంచనా వేస్తే రాష్ట్ర ప్రభుత్వం దాన్ని రూ.4,585 కోట్లకు తగ్గించిందని వెల్లడించారు. ప్రభుత్వం డిస్కంలకు అండగా ఉంటోందన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో విద్యుత్ సబ్సిడీలకు అదనంగా రూ.1,700 కోట్ల మూల ధనాన్ని డిస్కంలకు మంజూరు చేయడంతో సింగరేణి బొగ్గు గనుల సంస్థకు చెల్లించాల్సిన బకాయిలను చెల్లించామన్నారు. ప్రభుత్వం అవసరమైతే డిస్కంలకు సబ్సిడీ కేటాయింపులకు మించి చేయూత అందిస్తుందని దీమా వ్యక్తం చేశారు. అంతర్గ సామర్థ్యం పెంపు ద్వారా మిగిలిన ఆర్థిక లోటు తగ్గింపుపై దృష్టి సారిస్తామన్నారు. తక్కువ ధరకు లభించే జల విద్యుత్, సౌర విద్యుత్ లభ్యత వచ్చే ఏడాది పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దీంతో ఆర్థిక లోటు కొంత మేర తగ్గిపోతుందన్నారు. ప్రస్తుతం తాత్కాలిక విద్యుత్ కొనుగోలు ఒప్పందాలతో కొనుగోలు చేస్తున్న 400 మెగావాట్ల విద్యుత్‌ను సైతం వదులుకుంటామని, దీంతో మరికొంత భారం తగ్గుతుందన్నారు. డిస్కంల సమష్టి ట్రాన్స్మిషన్, వాణిజ్య నష్టాలను(ఏటీ అండ్సీ లాసెస్) సాధ్యమైనంత తగ్గించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. డిస్కంలు విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదనలు సమర్పించకపోవడంతో తమంతట తాము(సుమోటో)గా చార్జీల పెంపుపై నిర్ణయం తీసుకుంటామని ఈఆర్సీ లేఖ రాయడంపై ప్రశ్నించగా... చార్జీలు పెంచొద్దంటూ ఈఆర్సీకి ప్రభుత్వం లేఖ రాస్తుందని తెలిపారు. -
విద్యుత్ సౌధలో ఆంక్షలు!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షకు నిలువెత్తు ప్రతిరూపం విద్యుత్ సౌధ.. ఉద్యమ రోజుల్లో తెలంగాణకు వ్యతిరేకంగా ఎక్కడ ఏం జరిగినా విద్యుత్ సౌధ నుంచి తక్షణమే ప్రతిస్పందన వినిపించేది. సమైక్య రాష్ట్ర పాలకులు సైతం విద్యుత్ ఉద్యోగులను నియంత్రించే సాహసం చేయలేకపోయారు. కానీ ప్రత్యేక రాష్ట్రం వచ్చి రెండేళ్లయినా కాకముందే విద్యుత్ సౌధలో ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. మీడియాతో ఉద్యోగులెవరూ మాట్లాడొద్దని ఆదేశిస్తూ ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు సర్క్యులర్ జారీ చేశారు. దీనిని ఎవరైనా ఉల్లంఘిస్తే ‘దుష్ర్పవర్తన’ కింద పరిగణించి క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ బోర్డు ఉద్యోగుల ప్రవర్తనా నియమావళి చట్టంలోని 43వ నిబంధనను అడాప్ట్ చేస్తున్నట్లు అందులో పేర్కొన్నారు. ఈ నెల 10వ తేదీన జారీ చేసినట్లు పేర్కొంటున్న ఈ సర్క్యులర్‌ను గురువారం ట్రాన్స్‌కో అధికారిక వెబ్సైట్లో ఉంచడంతో వెలుగు చూసింది. అనధికారికంగా పత్రికలకు ఏదైనా ప్రకటన చేసినా, పత్రికలు, మేగజైన్లలో ఏదైనా వార్త కథనానికి సహకరించినా, ముందస్తు అనుమతి లేకుండా రేడియోలో మాట్లాడినా, మీడియా లేక కరపత్రాల ద్వారా విన్నపాలు వినిపించినా... సదరు ఉద్యోగులపై క్రమ శిక్షణ చర్యలు తప్పవని అందులో హెచ్చరించారు. ఇక విద్యుత్ సౌధలో ఇటీవల అడుగడుగునా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి సందర్శకుల రాకపోకలపై నిఘా ఉంచుతున్నారు. దీంతో విలేకరులను కలిసేందుకు కొందరు అధికారులు నిరాకరిస్తున్నారు. ఈఆర్సీకి వెళ్లొద్దు.. విద్యుత్ రంగానికి సంబంధించి ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ విద్యుత్ నియంత్రణ మండలి(ఈఆర్సీ)లో వ్యాజ్యాలు వేయవద్దని విద్యుత్ ఉద్యోగులకు మౌఖిక ఆదేశాలు జారీ అయ్యాయి. సాధారణంగా విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు, చార్జీల పెంపు వంటి వాటికి ఈఆర్సీ ఆమోదం తప్పనిసరి. ప్రభుత్వ నిర్ణయాలను ఆమోదించే ముందు ఈఆర్సీ ప్రజల నుంచి అభ్యంతరాలు, సూచనలను ఆహ్వానిస్తుంది. సాంకేతికంగా క్లిష్టంగా ఉండే విద్యుత్ చట్టాలు, అంశాలపై పట్టున్న విద్యుత్ రంగ నిపుణులు మాత్రమే వీటిపై స్పందించగలుగుతారు. విద్యుత్ రంగ నిపుణులు కె.రఘు, తిమ్మారెడ్డి వంటి కొందరు మాత్రమే ప్రజల తరఫున ఈఆర్సీకి వెళుతున్నారు. ఇటీవల ఛత్తీస్‌గఢ్ విద్యుత్ ఒప్పందంపై తీవ్ర అభ్యంతరాలతో కె.రఘు వేసిన వ్యాజ్యం ప్రభుత్వంలో ప్రకంపనలు సృష్టించింది. ఈ నేపథ్యంలోనే విద్యుత్ ఉద్యోగులు ఎవరూ ఈఆర్సీకి వెళ్లవద్దనే ఆదేశాలు జారీ అయ్యాయి. అలాంటి హక్కు ఎవరికీ లేదు ‘పత్రికలకు సమాచారం ఇవ్వవద్దని సర్క్యులర్ జారీ చేయడం భావ ప్రకటనా స్వేచ్ఛను హరించడమే. అలాంటి హక్కు ఎవరికీ లేదు. దీనిని ఖండిస్తున్నాం..’ - దేవులపల్లి అమర్, ఐజేయూ సెక్రటరీ జనరల్