ఈ ఏడాది కరెంట్ చార్జీలు పెంచం
- ట్రాన్స్‌కో సీఎండీ డి. ప్రభాకర్‌రావు స్పష్టీకరణ
- డిస్కం అప్పులను టేకోవర్ చేసుకున్నందున సీఎం పెంపు వద్దన్నారు
- అంతర్గత సామర్థ్యం పెంపుతో ఆర్థిక లోటు అధిగమిస్తామని వెల్లడి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఈ ఏడాది విద్యుత్ చార్జీలు పెంచడంలేదని తెలంగాణ ట్రాన్స్‌కో సీఎండీ డి.ప్రభాకర్‌రావు స్పష్టంచేశారు. విద్యుత్ చార్జీలు పెంచబోమని అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చేసిన ప్రకటనకు కట్టుబడి ఉంటామన్నారు. ఉదయ్ పథకంలో చేరడం ద్వారా డిస్కంలకు ఉన్న రూ.8,923 కోట్ల అప్పులను రాష్ట్ర ప్రభుత్వం టేకోవర్ చేసుకున్నందున చార్జీలు పెంచవద్దని సీఎం ఆదేశించినట్లు తెలిపారు. అంతర్గత సామర్థ్యాన్ని పెంచుకుని డిస్కంల ఆర్థిక లోటును అధిగమించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారన్నారు. పరిశ్రమలకు విద్యుత్ విక్రయాలు పెరగడంతో చార్జీల పెంపు అవసరం లేదని సీఎం అభిప్రాయపడినట్లు వివరించారు.
విద్యుత్ చార్జీల పెంపు అంశంపై మంగళవారం ‘సాక్షి’తో సీఎండీ ప్రత్యేకంగా మాట్లాడారు. విద్యుత్ చార్జీలు పెంచితే రాష్ట్రంలోని పరిశ్రమలు.. డిస్కంల విద్యుత్‌కు బదులు బహిరంగ మార్కెట్ నుంచి ఓపెన్ యాక్సెస్ విధానంలో తక్కువ ధర విద్యుత్ కొనుగోళ్లు చేస్తున్నట్టు పేర్కొన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో ఏటా 2 వేల మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను పరిశ్రమలు ఓపెన్ యాక్సెస్ విధానంలో కొనుగోలు చేస్తుండడంతో డిస్కంలు రూ.400 కోట్లకు పైగా ఆదాయాన్ని కోల్పోతున్నాయన్నారు. పరిశ్రమలపై మళ్లీ పట్టుబిగించేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారన్నారు.
ఆ లోటు కేవలం అంచనానే..
ప్రస్తుత విద్యుత్ చార్జీలనే 2017–18లో అమలు చేస్తే రూ.8,900 కోట్ల ఆర్థిక లోటు భరించాల్సి ఉంటుందన్నది కేవలం డిస్కంల అంచనా మాత్రమేనని ప్రభాకర్ రావు తెలిపారు. ఈ అంచనాలను రాష్ట్ర ప్రభుత్వం కాని, రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి(టీఎస్‌ఈఆర్సీ) కాని ఆమోదించలేదన్నారు. గతేడాది కూడా రూ.6,800 కోట్ల ఆర్థిక లోటు ఉండవచ్చని డిస్కంలు అంచనా వేస్తే రాష్ట్ర ప్రభుత్వం దాన్ని రూ.4,585 కోట్లకు తగ్గించిందని వెల్లడించారు. ప్రభుత్వం డిస్కంలకు అండగా ఉంటోందన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో విద్యుత్ సబ్సిడీలకు అదనంగా రూ.1,700 కోట్ల మూల ధనాన్ని డిస్కంలకు మంజూరు చేయడంతో సింగరేణి బొగ్గు గనుల సంస్థకు చెల్లించాల్సిన బకాయిలను చెల్లించామన్నారు. ప్రభుత్వం అవసరమైతే డిస్కంలకు సబ్సిడీ కేటాయింపులకు మించి చేయూత అందిస్తుందని దీమా వ్యక్తం చేశారు. అంతర్గ సామర్థ్యం పెంపు ద్వారా మిగిలిన ఆర్థిక లోటు తగ్గింపుపై దృష్టి సారిస్తామన్నారు. తక్కువ ధరకు లభించే జల విద్యుత్, సౌర విద్యుత్ లభ్యత వచ్చే ఏడాది పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
దీంతో ఆర్థిక లోటు కొంత మేర తగ్గిపోతుందన్నారు. ప్రస్తుతం తాత్కాలిక విద్యుత్ కొనుగోలు ఒప్పందాలతో కొనుగోలు చేస్తున్న 400 మెగావాట్ల విద్యుత్‌ను సైతం వదులుకుంటామని, దీంతో మరికొంత భారం తగ్గుతుందన్నారు. డిస్కంల సమష్టి ట్రాన్స్‌మిషన్, వాణిజ్య నష్టాలను(ఏటీ అండ్‌సీ లాసెస్) సాధ్యమైనంత తగ్గించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. డిస్కంలు విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదనలు సమర్పించకపోవడంతో తమంతట తాము(సుమోటో)గా చార్జీల పెంపుపై నిర్ణయం తీసుకుంటామని ఈఆర్సీ లేఖ రాయడంపై ప్రశ్నించగా... చార్జీలు పెంచొద్దంటూ ఈఆర్సీకి ప్రభుత్వం లేఖ రాస్తుందని తెలిపారు.