ఏప్రిల్‌లో కరెంటు మోత!
♦ ధనికులు, వాణిజ్య సంస్థలు, పరిశ్రమలపై చార్జీల బాదుడు
♦ పేద, మధ్య తరగతి గృహ వినియోగదారులకు ఊరట
♦ పంటలకు 9 గంటల సరఫరాతో రూ.2 వేల కోట్ల అదనపు భారం
♦ 6 వేల కోట్ల నుంచి 8 వేల కోట్లకు పెరగనున్న ఉచిత విద్యుత్ వ్యయం
♦ పెంపు భారం రూ.1000 కోట్లకు మించకుండా చూపేందుకు తర్జనభర్జనలు
♦ ఈఆర్‌సీలో ఏఆర్‌ఆర్‌ల సమర్పణకు నేటితో ముగియనున్న గడువు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఏప్రిల్ నుంచి విద్యుత్ చార్జీలు పెరగబోతున్నాయి. చార్జీల పెంపు భారం నుంచి పేద, మధ్య తరగతి గృహ వినియోగదారులకు ఊరట లభించనుండగా ధనికుల గృహాలు, వాణిజ్య సంస్థలు, పరిశ్రమలపై మాత్రం భారం తప్పేలా లేదు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. గృహ కేటగిరీలో 100 యూనిట్ల లోపు వినియోగంపై ఈసారీ చార్జీల్లో మార్పులు ఉండవు. గృహ కేటగిరీలో 50 యూనిట్లలోపు యూనిట్‌కు రూ.1.45 పైసలు.. అదేవిధంగా 51-100 యూనిట్లలోపు యూనిట్‌కు రూ.2.60 పైసలు చొప్పున ఉన్న ప్రస్తుత విద్యుత్ చార్జీలు యథాతథంగా ఉండనున్నాయి.
అయితే, 101-150, 151-200 యూనిట్ల వినియోగ శ్రేణిపై గతేడాది చార్జీలు పెంచకపోయినా ఈ ఏడాది స్వల్పంగా పెరగనున్నాయి. 200-400 యూనిట్ల వినియోగంపై మాత్రం ఒక శాతం వరకు బాదుడు ఉండనుంది. వినియోగం 400 యూనిట్లు మించితే ప్రస్తుతం యూనిట్‌పై రూ.8.50 చొప్పున చార్జీలు విధిస్తుండగా.. ఇకపై రూ.9కి పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. అదేవిధంగా వాణిజ్య, పరిశ్రమల రంగాలపై 5-10 శాతం మధ్య చార్జీలను పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థల(డిస్కం)లు 2016-17 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తమ వార్షిక ఆదాయ అవసరాల నివేదిక (ఏఆర్‌ఆర్)ను రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్‌సీ)కి సోమవారంలోపు సమర్పించాల్సి ఉంది. ఈ ప్రతిపాదనలపై ప్రజాభిప్రాయ సేకరణ అనంతరం 2016-17కి సంబంధించిన రిటైల్ టారిఫ్ ఉత్తర్వులను ఈఆర్‌సీ జారీ చేయనుంది. సీఎం కేసీఆర్‌తో చర్చలు జరిపిన అనంతరం ఏఆర్‌ఆర్‌లపై డిస్కంలు తుది నిర్ణయం తీసుకోనున్నాయి. సోమవారం సాయంత్రంలోగా స్పష్టత రాని పక్షంలో మళ్లీ గడువు పెంపు కోరనున్నాయి.
పంటలకు 9 గంటల సరఫరాతో...
ఉజ్వల్ డిస్కం యోజన (ఉదయ్)లో చేరాలని నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం.. 2015 సెప్టెంబర్ 30లోగా డిస్కంలపై ఉన్న రూ.12 వేల కోట్లకు పైగా నష్టాల ప్రభావం ఏఆర్‌ఆర్‌లపై పూర్తిగా తప్పనుంది. అయితే, వచ్చే ఏప్రిల్ నుంచి వ్యవసాయానికి పగటి పూటే 9 గంటలు విద్యుత్ సరఫరా చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. పంటలకు 6 గంటల ఉచిత విద్యుత్ సరఫరాతో ప్రస్తుతం డిస్కంలపై ఏటా రూ.6 వేల కోట్ల భారం పడుతుండగా.. ప్రభుత్వం రూ.4,300 కోట్ల సబ్సిడీని చెల్లిస్తోంది. వ్యవసాయానికి సరఫరాను 9 గంటలకు పెంచితే రూ.2 వేల కోట్ల అదనపు భారం పడనుంది. మొత్తం ఉచిత విద్యుత్ భారం రూ.8 వేల కోట్లకు చేరనుండగా.. రాష్ట్ర ప్రభుత్వం సైతం సబ్సిడీని రూ.5,500 కోట్లకు పెంచాలని నిర్ణయించినట్లు సమాచారం. సబ్సిడీ పోగా రూ.2,500 కోట్ల లోటు ఉండనుండగా, చార్జీల పెంపు ద్వారా రూ. వెయ్యి కోట్ల వరకు సర్దుబాటు చేయనున్నారు. మిగిలిన రూ.1,500 కోట్ల లోటును భర్తీ చేసేందుకు డిస్కంలు ఎప్పటిలాగే ఏఆర్‌ఆర్ నివేదికలో అంకెల గారడీ చేయనున్నాయని ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరుగుతోంది.