సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రజలకు విద్యుత్ చార్జీల విషయంలో కొంత ఊరట లభించనుంది. వచ్చే ఏడాది కూడా ప్రస్తుత విద్యుత్ చార్జీలే అమలు కానున్నాయి. ఈ మేరకు ప్రస్తుత చార్జీలనే 2018–19లో అమలు చేస్తామని రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మం డలి (ఈఆర్సీ)కి ప్రతిపాదించాయి. దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్‌ఎస్పీడీసీఎల్), ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్‌ఎన్పీడీసీఎల్)ల యాజమాన్యాలు గురువారం 2018–19కి సంబంధించిన తమ వార్షిక ఆదాయ అవసరాల అం చనాలు (ఏఆర్‌ఆర్), టారీఫ్ ప్రతిపాదనలను ఈఆర్సీకి సమర్పించాయి.
వచ్చే ఆర్థిక సంవత్సరంలో వార్షిక వ్యయం రూ.35,714 కోట్లు కాగా, ప్రస్తుత చార్జీలను యథాతథంగా అమ లు చేస్తే రూ.9,700 కోట్ల ఆదాయ లోటు ఏర్పడనుందని తమ నివేదికలో తెలిపాయి. విద్యుత్ సబ్సిడీరూపంలో డిస్కంలకు రూ.5,400 కోట్లను కేటాయిస్తామని రాష్ట్ర ప్రభుత్వం డిస్కంలకు హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో సబ్సిడీ పోగా రూ.4,300 కోట్ల ఆదాయలోటు డిస్కంలకు మిగలనుంది.
సీఎం ఆదేశం మేరకే..
విద్యుత్ చార్జీలను పెంచవద్దని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఇప్పటికే విద్యుత్ శాఖను ఆదేశించారు. వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో చార్జీల పెంపునకు వెళ్లవద్దని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే రూ.4,300 కోట్ల ఆదాయ లోటును ఎలా అధిగమిస్తారన్న విషయంపై డిస్కంలు ఎలాంటి ప్రకటన చేయలేదు. మరోవైపు విద్యుతచార్జీలు పెంచవద్దని డిస్కంలు చేసిన ప్రతిపాదనలపై ఈఆర్సీ త్వరలో తుది నిర్ణయం తీసుకోనుంది. డిస్కంల ప్రతిపాదనలపై ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించి వచ్చే ఏడాది మార్చి లోగా టారీఫ్ ఉత్తర్వులు జారీ చేయనుంది.
ప్రస్తుత చార్జీలనే అమలు చేసేందుకు ఈఆర్సీ అనుమతించే అవకాశాలు అధికంగా ఉన్నాయి. అయితే ఆదాయ లోటును పూడ్చుకోవడానికి స్పల్పంగా చార్జీలను పెంచాలని ఈఆర్సీ ఆదేశించే అవకాశాలున్నాయి. లేదా అనవసర విద్యుత్ కొనుగోళ్లు తగ్గించి వ్యయాన్ని తగ్గించుకోవడం ద్వారా ఆదాయ లోటును పూడ్చుకోవాలని సూచించే అవకాశాలున్నాయని విద్యుత్ రంగ నిపుణులు పేర్కొంటున్నారు. వచ్చే ఏడాది డిస్కంల వార్షిక అవసరాలు రూ.35,714 కోట్లు కాగా, అందులో విద్యుత్ కొనుగోళ్లకే రూ.27,903 కోట్లు వెచ్చించాల్సి ఉంటుందని డిస్కంలు నివేదించాయి.
67,573 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను కొనుగోలు చేయనున్నామని, అయితే వాస్తవ డిమాండ్ 64,291 మిలియన్ యూనిట్లే ఉండనుందని ఏఆర్‌ఆర్‌లో తెలిపాయి. అవసరానికి మించి 3,282 మిలియన్ యూనిట్ల కొనుగోలుకు ఒప్పందాలు చేసుకున్న నేపథ్యంలో.. ఈ అనవసర విద్యుత్‌ను వదులుకోవడం ద్వారా వ్యయం తగ్గించుకోవాలని డిస్కంలకు ఈఆర్సీ సూచించే అవకాశాలున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment