trend setter
-
AP: దేశంలోనే తొలిసారి.. సెకీతో ఒప్పందం ఓ ట్రెండ్‌సెట్టర్
సాక్షి, అమరావతి: దేశంలోనే తొలిసారిగా రాష్ట్ర ప్రభుత్వం సోలార్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సెకీ)తో చేసుకున్న ఒప్పందం దేశ వ్యవసాయ రంగంలో ట్రెండ్‌సెట్టర్‌గా నిలుస్తుందని ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ అన్నారు. సచివాలయంలోని ఇంధన శాఖ కార్యాలయంలో గురువారం బాధ్యతలు చేపట్టిన అనంతరం విద్యుత్ సంస్థల అధికారులతో ఆయన తొలి సమీక్ష నిర్వహించారు. వ్యవసాయ రంగానికి రానున్న 30 ఏళ్ల పాటు ఉచిత విద్యుత్‌ను హక్కుగా అందించాలనేది సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సంకల్పమని తెలిపారు. చదవండి: ఐఆర్సీటీసీ స్పెషల్ టూర్ ప్యాకేజీలు.. వివరాలు ఇదిగో.. అందులో భాగంగానే తక్కువ ధరకు 7 వేల మెగావాట్ల విద్యుత్‌ను పాతికేళ్ల పాటు రాష్ట్రానికి సరఫరా చేసేలా సెకీతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుందన్నారు. వ్యవసాయానికి పగటి పూటే 9 గంటల ఉచిత విద్యుత్ అందించేందుకు సీఎం వైఎస్ జగన్ ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నారని ఆయన గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో జెన్కో, ట్రాన్స్‌కో ఎండీ శ్రీధర్, ట్రాన్స్‌కో జేఎండీలు.. పృథ్వీతేజ్, మల్లారెడ్డి, డిస్కంల సీఎండీలు.. హెచ్.హరనాథరావు, పద్మజనార్దనరెడ్డి, సంతోషరావు, నెడ్కాప్ ఎండీ ఎస్.రమణారెడ్డి పాల్గొన్నారు. -
ట్రెండ్ సెట్టర్
డిజిటల్ మీడియా అందుబాటులోకి వచ్చాక మరుగున పడిన, మారుమూల ప్రాంతాల్లోని ఎంతోమంది ప్రతిభ వెలుగులోకి వస్తోంది. వినూత్న నైపుణ్యాలతో తామేంటో నిరూపించుకుంటూ ట్రెండ్సెట్టర్లుగా నిలుస్తున్నవారు ఎందరో. ఈ కోవకు చెందిన వారే జ్యోతి అధవ్. కార్పొరేట్ రంగంలోనేగాక, సామాజిక సేవారంగంలోనూ విశేషమైన సేవలందించి 2022 సంవత్సరానికి గానూ టైమ్స్ ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. మహిళలు బలహీనులు కాదు, మనసుపెట్టి పనిచేస్తే ఒకచేత్తో ఎన్నో పనులు చక్కదిద్దగలుగుతారు అని నిరూపిస్తోంది జ్యోతి అధవ్. పూనేకు చెందిన జ్యోతి క్రియేటివ్ ఆర్టిస్టేగాక, విజయవంతంగా రాణిస్తోన్న వ్యాపారవేత్త. ఒక పక్క నైరూప్య చిత్రకారిణిగా రాణిస్తూనే, బిజినెస్ ఉమెన్‌గా దూసుకుపోతూ, ఎన్జీవోని నడుపుతున్నారు. జ్యోఆర్ట్స్ అండ్ డెకార్స్‌కు వ్యవస్థాపక డైరెక్టర్‌గానూ పనిచేస్తోంది. తన చిత్రకళా నైపుణ్యంతో అల్ట్రా మోడ్రన్ ఆర్ట్ స్టూడియోను నిర్వహిస్తూ...చిత్రకళానైపుణ్యంతో స్పష్టమైన, ప్రత్యేకమైన డెకరేటింగ్ ఉత్పత్తులను తయారు చేసి విక్రయిస్తోంది. పూనే కేంద్రంగా నడుస్తోన్న మసాలా కంపెనీ ‘సాఫ్రో’కు ఒక డైరెక్టర్‌గా పనిచేస్తోంది. గత కొన్నేళ్లుగా తన ఉత్పత్తులను దేశ, విదేశాల్లో విక్రయిస్తూ మంచి లాభాలను ఆర్జిస్తోంది. ఇలా అనేక వ్యాపారాలను ఎంతో నైపుణ్యంతో చూసుకుంటూ అభివృద్ధి పథంలో నడిపించడం విశేషం. వసుమతి వెల్ఫేర్ మంచి కళాకారిణిగానేగాక విజయవంతమైన వ్యాపారవేత్తగా రాణిస్తోన్న జ్యోతికి మానవత్వ గుణాలు కాస్త ఎక్కువే. సమాజానికి తిరిగిచ్చేయాలన్న ఉద్దేశ్యంతో భర్త విజయ్ అధవ్ సహకారంతో వసుమతి వెల్ఫేర్ ఫౌండేషన్‌ను స్థాపించింది. ఈ ఫౌండేషన్ ద్వారా ఆసరా కోల్పోయిన వారు, నిరుపేదలకు సాయం చేస్తోంది. పేదల ఆకలి తీర్చడం, అనారోగ్యంగా ఉన్నవారికి వైద్యసదుపాయాలను అందిస్తోంది. అంతేగాక మహిళ అభ్యున్నతికి కృషిచేస్తోంది. ఆడపిల్లల విద్యను ప్రోత్సహిస్తూ వారి విద్యకయ్యే ఖర్చునూ భరిస్తోంది. నాలుగో తరగతి నుంచి పదో తరగతి వరకు అయ్యే ఖర్చును ఈ ఫౌండేషన్ అందిస్తోంది. కరోనా సమయంలోనూ రోగులకు వైద్య సదుపాయం, ఆహారం, నీటిప్యాకెట్లు, వంట సరుకులను ఉచితంగా పంపిణీ చేసింది. చిత్రకళాకారిణిగా, వ్యాపార వేత్తగా, మానవతా వాదిగా అనేక సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తోన్న జ్యోతి అధవ్ ఎంతోమందికి ప్రేరణగా నిలుస్తుండడం వల్లే ఆమె 2022 సంవత్సరానికి గాను ‘టైమ్స్ అప్లోడ్స్ ట్రెండ్ సెట్టర్’గా నిలిచింది. కష్టపడేతత్వం, ఓర్పు సహనం ఉండాలేగానీ నాలుగైదు పనులు ఒక్కసారే చేయవచ్చు అని నిరూపిస్తోంది జ్యోతి. ప్రతి మనిషికీ ఉండేది 24 గంటల సమయమే. కానీ జ్యోతి అధవ్ లాంటి వాళ్లు ఆ ఇరవై నాలుగు గంటల్లోనే ఎన్నో పనులు చేసి ట్రెండ్ సెట్ చేస్తున్నారు. చిత్రకళాకారిణిగా, వ్యాపార వేత్తగా, మానవతా వాదిగా అనేక సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తోన్న జ్యోతి అధవ్ ఎంతోమందికి ప్రేరణగా నిలుస్తుండడం వల్లే ఆమె 2022 సంవత్సరానికి గాను ‘టైమ్స్ అప్లోడ్స్ ట్రెండ్ సెట్టర్’గా నిలిచింది. -
‘రైస్ గమ్’ మీమ్ గుర్తుందా.. యువకుడి తలరాతను మార్చేసింది
ట్రెండ్ ఫాలో అయ్యేవారు కొందరు. ఇది ఎంతో వీజీ. ట్రెండ్ సెట్ చేసేవారు కొందరు. ఇది చాలా కష్టం. ఇష్టమైన పనికోసం కష్టపడితే.... ట్రెండ్ సెట్ చేయడం చిటిక వేసినంత పని అంటున్నాడు అమీర్. నాలుగు సంవత్సరాలు వెనక్కి వెళ్లి యూట్యూబ్‌లో ‘రైస్ గమ్’ అనే మీమ్‌ను చూడండి. అది ఒక యువకుడి తలరాతను మార్చిన మీమ్. అమీర్ అనే కుర్రాడు ట్రెండ్‌సెట్టర్‌గా మారడానికి శ్రీకారం చుట్టిన మీమ్... ఎవరీ అమీర్? ‘కెనడాలో జన్మించిన అమీర్ ఉస్మాన్ ఫ్రెంచ్ మాట్లాడుతూ పెరిగాడు. వాళ్ల కుటుంబం లెబనాన్ నుంచి కెనడాకు వలస వచ్చింది....’ ఒకప్పుడు అమీర్ గురించి చెప్పడానికి ఈమాత్రం సరిపోతుంది. ‘ట్రెండ్ సెట్టర్’గా యూత్‌కు ఆదర్శంగా నిలిచిన అదే అమీర్ గురించి చెప్పడానికి ఇప్పుడు చాలా ఉంది. మన ఇంట్లో లేదా ఇరుగింటి, పొరుగింటి కుర్రాళ్లలాగే స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్స్‌లో విహరించడం అంటే అమీర్‌కు ఇష్టం. ఫస్ట్ పర్సన్ షూటర్ వీడియోగేమ్ ‘కాల్ ఆఫ్ డ్యూటీ’లాంటివి ఆడడం అంటే ఇష్టం. ఇక ‘ఫేజ్ క్లాన్’లాంటి యూట్యూబర్స్ అంటే మామూలు ఇష్టం కాదు. ‘అథెంటిక్ అండ్ రిలేటబుల్’ వీడియోలు రూపొందిస్తుంటారు అని వేనోళ్ల పొగిడేవాడు. ఒకరోజు ఎందుకో సరాదాగా మీమ్ చేయాలనిపించింది. అనుకున్నదే ఆలస్యం ‘రైస్గమ్’ అనే మీమ్ చేసి యూట్యూబ్‌లోకి వదిలి మరిచిపోయాడు. ‘ఇంత రెస్పాన్స్ వస్తుంది’ ‘అంత రెస్పాన్స్ వస్తుంది’ అని లెక్కలేమీ వేసుకోలేదు. మూడు రోజుల తరువాత ఈ మీమ్‌కు అనూహ్యమైన స్పందన వచ్చింది. వ్యూస్, నొటిఫికేషన్లతో ఫోన్ బరువుగా మారింది. కామెంట్స్‌లో ఒకచోట... ‘నేను మీ సబ్స్రైబర్ను. ఏదో ఒకరోజు మీరు బిగ్ యూట్యూబర్ అవుతారు’ అని ఎవరో ఆశీర్వదించారు. వారి మాట నిజమైంది!‘రైస్గమ్’ మీమ్‌కు వచ్చిన రెస్పాన్స్ చూసిన తరువాత ‘యస్.నేను చేయగలను. అందరినీ ఆకట్టుకునేలా కంటెంట్ క్రియేట్ చేయగలను’ అనే నమ్మకానికి ఉత్సాహం వచ్చింది. ప్రఖ్యాత మొబైల్ గేమ్ ‘పోక్‌మన్’ను దృష్టిలో పెట్టుకొని క్రియేట్ చేసిన కంటెంట్‌కు వచ్చిన రెస్పాన్స్ అదిరిపోయింది. మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వచ్చాయి. రకరకాల ఛానళ్ల వాళ్లు దీన్ని మురిపెంగా ప్రసారం చేశారు. ఒలింపిక్ ఆటలపై తయారుచేసిన మీమ్స్ కూడా అదరహో అదరహో! తన టీ అంటే ఇష్టం. అలా తన పేరును ‘టీవాప్’గా, బ్రాండ్‌గా మలిచి, దాన్ని యూట్యూబ్ చానల్ చేసి ట్రెండింగ్ టాపిక్స్‌ను దృష్టిలో పెట్టుకొని కంటెంట్ క్రియేట్ చేయడం మొదలు పెట్టాడు. తన తమ్ముడి సహాయం కూడా తీసుకున్నాడు. ‘టీవాప్’ వీడియోలు ఎంత పాప్లర్ అయ్యాయి అంటే...‘యూట్యూబ్ వీడియోలలో ఇదొక కొత్తగాలి’ అని ప్రశంసలు అందుకున్నాయి. కంటెంట్ విషయం పక్కన పెడితే ఎడిటింగ్, ప్రయోగాలు చేయడంలో ట్రెండ్‌సెట్టర్ అనిపించుకున్నాయి. ‘హౌ టు ఎడిట్ లైక్ టీవాప్’ పేరుతో రకరకాల వీడియోలు హల్చల్ చేస్తున్న సమయంలో ‘ఆ పని మనమే ఎందుకు చేయకూడదు’ అని సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన తమ్ముడు ఐమన్ ఉస్మాన్‌తో కలిసి రంగంలోకి దిగి ఆటోమేషన్, యానిమేషన్ నిపుణులతో చర్చించాడు అమీర్. కొత్త క్రియేటర్లకు సులువుగా ఎడిటింగ్‌లో మెలకువలు నేర్పించే చిట్కాలతో పాటు హై–క్వాలిటీ యానిమేషన్స్ 5 నిమిషాల్లో డౌన్లోడ్ చేసుకునే సాంకేతికజ్ఞానాన్ని రెడీ చేశాడు. ‘మీకు ఇష్టమైన పనిలో బాగా కష్టపడితే, మీకు ఉపాధి లభించడమే కాదు ఆ కష్టం మిమ్మల్ని ఎక్కడికో తీసుకువెళుతుంది’ అంటున్నాడు అమీర్. అక్షరసత్యం అని చెప్పడానికి అడ్డేముంది! -
ట్రెండ్ సెట్టర్‌గా ధరణి
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ, వ్యవసాయేత ఆస్తుల తక్షణ రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించనున్న ధరణి పోర్టల్ దేశంలోనే ట్రెండ్ సెట్టర్‌గా నిలవనుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సోమేశ్ కుమార్ అన్నారు. ఈ పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్ సేవల్లో రెవెన్యూ అధికారుల బాధ్యత మరింత పెరిగిందని, వారు రెవెన్యూ విధులతో పాటు జాయింట్ సబ్ రిజిస్ట్రార్‌గానూ బాధ్యతలు నిర్వహించవలసి ఉంటుందని పేర్కొన్నారు. రెవెన్యూ అధికారులు ఒక బృంద పనితీరుతో ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు. ధరణి పోర్టల్‌పై మంగళవారం ఇక్కడ రెవెన్యూ అధికారులకు ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమంలో సీఎస్ మాట్లాడారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఈ నెల 29న ధరణిని ప్రారంభించనున్నారని, ఆయన అంచనాల మేరకు సులభంగా, పారదర్శకంగా, వేగంగా ప్రజలకు సేవలందించాలని రెవెన్యూ సిబ్బందిని సీఎస్ ఆదేశించారు. ధరణి ద్వారా రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ వెంటనే జరగాలన్నారు. సాంకేతిక సమస్యల పరిష్కారానికి కంట్రోల్ రూమ్... ధరణి పోర్టల్ పనితీరును పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా రెవెన్యూ అధికారులకు సీఎస్ వివరించారు. స్లాట్ బుకింగ్, సిటిజన్ ఓపెన్ పోర్టల్ సక్సెసర్ మాడ్యూల్స్, పార్టిషన్ మాడ్యూల్స్ ఎలా చేయాలో తెలిపారు. తహసీల్దార్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్ల విధులు, బాధ్యతలను వివరించారు. ధరణి సాంకేతిక సమస్యల పరిష్కారానికి రాష్ట్ర స్థాయిలో ఏర్పాటు చేసే కంట్రోల్ రూంతో పాటు జిల్లా స్థాయి టెక్నికల్ సపోర్ట్ బృందాలు పనిచేస్తాయని చెప్పారు. ధరణి పటిష్ట అమలుకు అవసరమైన సౌకర్యాలను తహసీల్దార్ కార్యాలయాల్లో సిద్ధంగా ఉంచుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో రహదారులు, భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి సునీల్ శర్మ, రెవెన్యూ డిజాస్టర్ మేనేజ్మెంట్ కార్యదర్శి రాహుల్ బొజ్జా పాల్గొన్నారు. మూడుచింతలపల్లిలో ధరణికి శ్రీకారం రేపు పోర్టల్‌ను ప్రారంభించనున్న సీఎం కేసీఆర్ శామీర్‌పేట/హైదరాబాద్: వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తుల తక్షణ రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొస్తున్న ధరణి పోర్టల్‌కు వేదిక, ముహూర్తం ఖరారయ్యాయి. మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లాలోని సీఎం దత్తత గ్రామం, మండల కేంద్రమైన మూడుచింతలపల్లి తహసీల్దార్ కార్యాలయంలో పోర్టల్‌ను ఈ నెల 29న మధ్యాహ్నం 12.30 గంటలకు సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారు. ఈ మేరకు సీఎస్ సోమేశ్ కుమార్, పోలీస్ కమిషనర్ సజ్జనార్ మంగళవారం తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. పోర్టల్‌లో అందించే సేవలపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా రెవెన్యూ అధికారులకు సీఎస్ వివరించారు. అలాగే సీఎం మరో దత్తత గ్రామమైన లింగాపూర్ తండాలోనూ సీఎస్, సీపీ, పలువురు ఉన్నతాధికారులు పర్యటించారు. -
2019 ట్రెండ్ సెట్టర్స్
-
మళ్లీ నటించాలనే..
చెన్నై 28 చిన్న చిత్రాల్లో 2004లో ట్రెండ్ సెట్టర్ చిత్రం ఇది. అనూహ్య విజయంతో పాటు చాలా మంది నూతన కళాకారులకు సినీ జీవితాన్నిచ్చిన చిత్రం. స్ట్రీట్ క్రికెట్‌ను తెరపై అత్యంత సహజంగా తెరపై ఆవిష్కరించిన చిత్రం చెన్నై 28. ఆ చిత్రంతో వెండితెరపై ఆవిష్కృతమైన తారల్లో నటి విజయలక్ష్మి ఒకరు. పక్కింటి పరువాల అమ్మాయిగా నటించి మంచి మార్కులు కొట్టేసిన ఈ అచ్చ తమిళ బ్యూటీ ఆ తరువాత చాలా చిత్రాల్లో నాయకిగా నటించారు. అంతే కాదు ఏకంగా సూపర్‌స్టార్ రజనీకాంత్ సరసన నటించే స్థాయికి చేరుకున్నారు. ఆయనకు జంటగా సుత్తాన్ ది వారియర్ యానిమేషన్ చిత్రంలో నటించారు. దురదృష్టవశాత్తు ఆ చిత్రం పూర్తి కాలేదు గానీ లేకుంటే విజయలక్ష్మి మరో స్థాయికి చేరి ఉండేవారు. నటిగా తక్కువ కాలంలోనే ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ భామ నటనకు కొంత కాలం దూరం అయ్యారు. ఆ తరువాత దర్శకుడు వెంకట్‌ప్రభు చెన్నై 28కు సీక్వెల్‌ను రూపొందించనున్నట్లు వెల్లడించారు. ఈ చిత్రంలో తొలి భాగంలో నటించిన తారలే నటిస్తారని ప్రకటించారు. అయితే పెళ్లి చేసుకుని నటనకు దూరంగా ఉన్న విజయలక్ష్మి చెన్నై 28 రెండో భాగంలో నటిస్తారా? అన్న సందేహం వ్యక్తమైంది.అయితే దర్శకుడు వెంకట్‌ప్రభు ఆమెనే నటింపజేయడంలో సఫలీకృతుడయ్యారు.చిన్న గ్యాప్ తరువాత మళ్లీ ముఖానికి రంగేసుకున్నా నటి విజయలక్ష్మిని చెన్నై 28 సీక్వెల్లో నటించడానికి కారణమేమిటన్న ప్రశ్నకు నటిగా మరుప్రవేశం చేయాలన్న నిర్ణయమేనని బదులిచ్చారు. అయితే చాలా కాలంగా బుల్లితెరలో చేస్తున్న యాంకరింగ్‌ను మానుకోనని అన్నారు.చెన్నై 28కు సీక్వెల్లో నటించడం ఆనందంగా ఉందన్నారు. పాత మిత్రులందరినీ కలుసుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. చిత్రంలో ఎక్కువ, తక్కువ కాకండా మాట్లాడతానేమో గానీ షూటింగ్ సెట్లో కో ఆర్టిస్టులతో జోకుల వేస్తూ చాలా సరదాగా గడిపేస్తానన్నారు. ఒక షూటింగ్‌లా కాకుండా కుటుంబ సభ్యులతో పిక్నిక్కు వెళ్లినట్లు చాలా జాలీగా చెన్నై 28 సీక్వెల్ షూటింగ్ సెట్లో గడిపామన్నారు. విజయలక్ష్మి ఇటీవల నిర్మాతగా మారి తన భర్త ఫరోజ్ దర్శకత్వంలో పండిగై అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారన్న విషయం తెలిసిందే. చిత్ర నిర్మాణం అన్నది బాధ్యతతో కూడినది అయినా తాను అందులోనూ ఎంజాయ్ చేస్తూ చేస్తున్నానని అన్నారు. -
ఒక్క ఫుట్‌బాల్... ఆ ఊరినే మార్చేసింది!
ప్రపంచమంతా ఫుట్‌బాల్ మానియాతో ఊగిపోతున్న ఈ సమయంలో, ‘ఫుట్‌బాల్’ ఆటతో అభివృద్ధి చెంది పంజాబ్ రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు పొందిన ‘రుక్ర కలన్’ ఊరి గురించి చెప్పుకోవడం సందర్భోచితమే కాదు స్ఫూర్తిదాయకంగా కూడా ఉంటుంది. పంజాబ్‌లోని జలంధర్ జిల్లాలో ఉంది ఈ గ్రామం. చిన్న ఊరే అయినా ఊరి చరిత్రకు మాత్రం పెద్ద పేరు ఉంది. ‘గదర్ ఉద్యమం’లో ఈ ఊరి నుంచి 22 మంది స్వాతంత్య్ర సమరయోధులు పాల్గొన్నారు. ఇక ఫుట్‌బాల్ విషయానికి వస్తే ఈ ఊరు ‘ట్రెండ్ సెట్టర్’గా గుర్తింపు పొందింది. ఈ ఊరి నుంచి అయిదుగురి వరకు అంతర్జాతీయ ఫుట్‌బాల్ పోటీలలో ఆడారు. జాతీయస్థాయిలో నైతే వందల మంది ఆడారు. ఆట ఆట కోసమేనా? ఆటను ఊరు బాగా కోసం ఉపయోగించుకోలేమా? అని ఆలోచించారు గ్రామస్థులు. తమ ప్రియమైన ఆటను ఊరి సంక్షేమం కోసం వినియోగించాలనుకున్నారు. అలా ఊళ్లో ఫుట్‌బాల్ క్లబ్ కొత్తగా ఏర్పడింది. ఈ క్లబ్ దేశవ్యాప్తంగా రకరకాల ఫుట్‌బాల్ టోర్నమెంట్లలో పాల్గొని గెలుచుకున్న బహుమతి మొత్తాన్ని, భవన నిర్మాణం, విద్య, ఇతర సంక్షేమ కార్యక్రమాలకు ఉపయోగిస్తుంది. దీనికి దాతల సహాయం కూడా తోడైంది. ఆటతో పాటు పాటను కూడా నమ్ముకుంది ఫుట్‌బాల్ క్లబ్. జిల్లాలో ఉత్సవాలు జరిగినప్పుడు భాంగ్రా నృత్య ప్రదర్శన ఇచ్చి ఆ మొత్తాన్ని కూడా ‘విలేజ్ డెవలప్మెంట్ ఫండ్’కు జత చేసేవారు. గురుద్వారాల దగ్గర సైకిల్‌స్టాండ్ నిర్వహించడం ద్వారా వచ్చిన మొత్తాన్ని కూడా ఊరి అభివృద్ధికి ఖర్చు చేసేవారు. దీనికి ఊరి పెద్ద రైతులు, ఎన్ఆర్ఐలు తమ వంతు సహాయం అందించడం ప్రారంభించారు. ‘‘మన ఊరికి ఒక మంచి ఫుట్‌బాల్ మైదానం ఉంటే బాగుంటుంది’’ అని క్లబ్ సభ్యులు అడగగానే ఊరి చివర ఉన్న ఖాళీ స్థలంలో రైతులందరూ కలిసి 300 ట్రాలీల మట్టిని పోశారు. ఫీల్డ్ తయారు చేయడానికి ఆబాలగోపాలం చెమట చిందించింది. మట్టి మీద పచ్చటి గడ్డిని మొలిపించారు. అండర్‌గ్రౌండ్ ఇరిగేషన్ సిస్టమ్‌ను ఏర్పాటు చేసుకున్నారు. అలా బ్రహ్మాండమైన ఫుట్బాల్ఫీల్డ్ తయారైంది. ఊళ్లో వాళ్లకు ఏ సమస్య వచ్చినా ‘‘మేమున్నాం’’ అంటూ క్లబ్లో ఉన్న 40 మంది సభ్యులు ముందుకు వస్తారు. సంక్షేమ కార్యక్రమాలు... యాభై లక్షల వ్యయంతో గ్రామంలో ‘యూత్ అండ్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ సెంటర్’ నిర్మించారు. ఇలాంటి కేంద్రం జిల్లాలోనే ఎక్కడా లేదు. ఇందులో కంప్యూటర్ లేబరేటరి, స్టడీ రూమ్‌లు, మల్టీ యాక్టివ్ రూమ్‌లు ఉన్నాయి. ఎల్సిడి ప్రాజెక్టర్, థియేటర్ సిస్టమ్, బోర్డింగ్, లాడ్జింగ్ సౌకర్యాలు ఉన్నాయి. దీంతో పాటు ఒక ఎన్ఆర్ఐ సహకారంతో అల్ట్రా మోడ్రన్ హెల్త్ క్లబ్‌ను కూడా నిర్మించారు. దీనిలో కెరీర్ కౌన్సెలింగ్, గైడ్లైన్ సెంటర్‌తో పాటు చిన్న గ్రంథాలయం కూడా ఉంది. ఊరి ప్రజలకు ఆధునిక సాంకేతిక జ్ఞానాన్ని పరిచయం చేస్తుంది ఈ కేంద్రం. ఇక సెమినార్ హాల్లో గ్రామ అభివృద్ధి గురించి రకరకాల చర్చా కార్యక్రమాలు జరుగుతాయి. దేశం నలుమూలల్లో తమ తమ ఊరి అభివృద్ధికి పాటు పడిన వారి ఉపన్యాసాలు ఉంటాయి. పేద విద్యార్థుల కోసం క్లబ్ ఆధ్వర్యంలో కుట్టుమిషన్ కేంద్రం, బ్యూటీషియన్ ట్రైనింగ్ సెంటర్, కంప్యూటర్ ఎడ్యుకేషన్ సెంటర్లు నడుస్తున్నాయి. శిక్షణ తీసుకునేవారికి ఉపకారవేతనం కూడా ఇస్తారు. ఆయన వల్లే... ఊరి వారందరిని ఏకతాటిపై నడిపించిన ఘనత గురుమంగళ్ దాస్ సోనికి దక్కుతుంది. అమెరికాలోని ‘యూనివర్శిటీ ఆఫ్ నెవద రెనో’లో ఇంజనీరింగ్ చదువుకున్న దాస్‌కు ఊరంటే ఎంతో ప్రేమ. అయితే చాలామందిలా ఆ ప్రేమ మాటలకే పరిమితం కాలేదు. ఊరి వాళ్లకు ఫుట్‌బాల్ ఆట అంటే వ్యామోహం అనే విషయం అతనికి తెలుసు. అందుకే- ‘ఆటతో అభివృద్ధి’ అనే నినాదంతో రంగంలోకి దిగాడు. గ్రామంలోని తన ఇంట్లో పుట్‌బాల్ దిగ్గజాలుగా పేరున్న స్థానిక ఆటగాళ్లతో సమావేశం నిర్వహించాడు. వారి నుంచి సూచనలు తీసుకున్నాడు. గ్రామ యువకులకు ఫుట్‌బాల్‌లను ఉచితంగా పంచిపెట్టాడు. యూరప్‌లోని వివిధ దేశాలకు వెళ్లి అక్కడి స్వచ్ఛందసంస్థలు, ఫుట్బాల్క్లబ్లతో మాట్లాడి నిధుల సమీకరణ చేశాడు. ఏదో ఒకరోజు ఫుట్‌బాల్ ఆటలో తమ ఊరు అంతర్జాతీయ స్థాయికి వెళుతుందనేది దాస్ కల. ఆయన కల నెరవేరే రోజు ఎంతో దూరం లేదనిపిస్తోంది! ఒక పద్ధతి ప్రకారం, శాస్త్రీయంగా పిల్లలకు శిక్షణ ఇస్తే ఫుట్‌బాల్ ఆటలో అద్భుతాలు సృష్టిస్తారనడంలో సందేహం లేదు. ఏదో ఒక రోజు అంతర్జాతీయ స్థాయిలో మా ఊరి ఆటగాళ్ల గురించి గొప్పగా మాట్లాడుకుంటారు. - గురుమంగళదాస్