ఏజెంట్ హత్యకు కారణం.. త్రిముఖ ప్రేమ
బరంపురం: సాక్షాత్తు భగవంతునితో పోల్చే వైద్యుడు ప్రజల పాణాలు కాపాడ వలసింది పోయి ఓ ప్రైవేట్ బ్యాంక్ ఏజెంట్‌ను హత్య చేసి పరారైన సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. ఒక ప్రైవేట్ బ్యాంక్ ఏజెంట్‌ను హత్య చేసి పరారైన నిందిత వైద్యుడిని పట్టుకునేందుకు బరంపురం పోలీసులు సవాల్‌గా తీసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ పినాకి మిశ్రా శుక్రవారం అందించిన సమాచారం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. గంజాం జిల్లాలోని కళ్లికోట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో గల చికిలి గ్రామానికి చెందిన విష్ణు ప్రసాద్ గౌడ బరంపురంలో గల ఒక ప్రైవేట్ కార్పొరేట్ బ్యాంక్ ఏజెంట్‌గా పనిచేస్తున్నాడు.
కొత్త బస్‌స్టాండ్ వెనుక వైపు ఉన్న గాయత్రి క్లినిక్‌లో నర్సుగా పని చేస్తున్న మహిళతో బ్యాంక్ ఏజెంట్ విష్ణు ప్రసాద్ గౌడ వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. సొంత క్లినిక్ నడుపుతున్న వైద్యుడు రుషీకేశ్ త్రిపాఠి కూడా అదే నర్సుతో వివాహేతర సబంధం కలిగి ఉండడంతో ఆ వైద్యుడు పలుమార్లు బ్యాంక్ ఏజెంట్ విష్ణు ప్రసాద్ గౌడను హెచ్చరించాడు. వైద్యుడు రుషీకేశ్ త్రిపాఠి హెచ్చరించినా ఏజెంట్ విష్ణుప్రసాద్ గౌడ నర్సుతో వివాహేతర సబంధం కొనసాగించడంతో వైద్యుడు రుషీకేశ్ త్రిపాఠి హత్యకు పథకం వేసి అవకాశంకోసం ఎదురు చూశాడు.
రెండు వారాల క్రితం ఏజెంట్ విష్ణుప్రసాద్ గౌడ బీఎన్‌పూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో గల కొత్త బస్ స్టాండ్ వెనుకవైపు ఉన్న గాయత్రి క్లినిక్‌కు రావడంతో వైద్యుడు రుషీకేశ్ త్రిపాఠి గమనించి మత్తు మందు ఇచ్చి క్లినిక్ పైన ఉన్న తన తన గదిలోకి తీసుకు వెళ్లి విష్ణు ప్రసాద్ గౌడ తల, మొండెం వేరు చేసి క్లినిక్‌లో పనిచేసే వ్యక్తితో కలిసి నగర శివారు బోడ గుమలాలో వ్యర్థ పదార్థాలు పాతిపెట్టే తోటలోకి తీసుకువెళ్లి ఏజెంట్ అవయవాలను గోతిలో పాతిపెట్టాడు.
మృతుని భార్య ఫిర్యాదుతో దర్యాప్తు
తన భర్త కనబడడం లేదని విష్ణు గౌడ భార్య పోలీసులకు ఫిర్యాదు చేసిన అధారంగా విష్ణు గౌడ సెల్‌ఫోన్ అధారంగా పోలీసులు కేసు దర్యాప్తు చేశారు. అప్పటికే వైద్యుడు రుషీకేశ్ త్రిపాఠి పరారయ్యాడు. దీంతో క్లినిక్‌లో పనిచేస్తున్న వ్యక్తి గంగా బెహరాను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో ప్రశ్నించగా విష్ణు గౌడ హత్య విషయం వెలుగులోకి వచ్చింది. అనంతరం పోలీసులు నగర శివారులో గల వ్యర్థ పదార్థాల తోటకు వెళ్లి గోతిలో పాతి పెట్టిన మొండెం, తల, కాళ్లు బయటకు వెలికి తీశారు. తల భాగం పూర్తిగా మట్టిలో కుళ్లిపోవడంతో చేతికి ధరించిన ఉంగరాల అధారంగా విష్ణు గౌడ మృతదేహంగా కుటుంబ సభ్యుల సమాచారంతో పోలీసులు గుర్తించారు.
పరారీలో ఉన్న వైద్యుడు రుషీకేశ్ త్రిపాఠీని పట్టు కునేందుకు ఎస్పీ పినాకి మిశ్రా నియమించిన పోలీస్ బృందాలు పాత బస్‌స్టాండ్‌లో గల రుషీకేశ్ త్రిపాఠీ క్లినిక్‌పై దాడులు చేసి విష్ణు గౌడ అవయవాలు తరలించేందుకు వినియోగించిన రెండు కార్లు, ఒక బైక్ స్వాధీనం చేసుకున్నారు. వైద్యుని కుటుంబ సభ్యులైన భార్య, కుమారుడిని అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌లో ప్రశ్నిస్తున్నామని త్వరలో మరిన్ని వివరాలు వెలుగులోకి రానున్నాయని, పరారీలో ఉన్న నిందిత వైద్యుడు రుషీకేశ్ త్రిపాఠీని అరెస్ట్ చేయనున్నామని ఈ హత్యకు ముఖ్యకారణం త్రిముఖ ప్రేమేనని ఎస్పీ పినాకి మిశ్రా వివరించారు.