Rajanna Dora: ధ్యాసంతా గిరిజనంపైనే..
సాక్షి, విజయనగరం: గిరిజన బిడ్డగా, గిరిజన సహకార సంస్థ మాజీ అధికారిగా, ఎస్టీ రిజర్వుడు నియోజకవర్గం సాలూరు నుంచి వరుసగా నాలుగు సార్లు గెలిచిన సీనియర్ నాయకుడిగా పీడిక రాజన్నదొరకు గుర్తింపు. ఇప్పుడు గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా, రాష్ట్ర ఉపముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్రవ్యాప్తంగా మరోసారి అందరి దృష్టిని ఆకర్షించారు. పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా బుధవారం ఆయన విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ఆయన ‘సాక్షి ప్రతినిధి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..
చదవండి: ఆరోగ్యయజ్ఞంలో దివ్యౌషధమవుతా: మంత్రి విడదల రజిని
సాక్షి: గిరిజన సంక్షేమ శాఖ మంత్రిత్వ శాఖతో పాటు ఉపముఖ్యమంత్రి బాధ్యతలు కూడా మీకు రావడంపై మీ అభిప్రాయం?
రాజన్నదొర: సాలూరు నియోజకవర్గం నుంచి నాలుగు దఫాలుగా ఎమ్మెల్యే అయ్యాను. మహిళల కు ప్రాధాన్యం ఇచ్చే ప్రభుత్వం మాది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తొలిసారి తన మంత్రివర్గంలో మహిళలకు ప్రాధాన్యం ఇచ్చారు. అలా గిరిజన, ఎస్సీ, బీసీ మహిళలకు ఉన్నత స్థానం కల్పించారు. రెండున్నరేళ్ల తర్వాత మంత్రివర్గాన్ని మార్పు చేస్తానని సీఎం అప్పుడే చెప్పారు. రెండో దఫాలో నాకు అవకాశం ఇస్తానని నాడే హామీ ఇచ్చారు. అలా ఇప్పుడు నాకు మంత్రి పదవి ఇచ్చారు. ఆయనకు ఎప్పుడూ రుణపడి ఉంటాను. గిరిజనుల తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నాకు పదవి రావడానికి పార్టీ పెద్దలు విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, సుబ్బారెడ్డి, బొత్స సత్యనారాయణ, జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావుతో పాటు విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, శ్రేయోభిలాషులు, ప్రజల ఆశీస్సులు కారణం. వారికి సర్వదా కృతజ్ఞుడిని.
సాక్షి: గిరిజన బిడ్డగా, వారి కష్టసుఖాలు తెలిసిన మీరు గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా వారి సంక్షేమం కోసం ఎలా పనిచేస్తారు?
రాజన్నదొర: రాష్ట్రంలో వేర్వేరు ప్రాంతాల్లో 31 తెగల గిరిజనులు ఉన్నారు. వారి సంక్షేమానికి ముఖ్యమంత్రి పెద్దపీట వేస్తున్నారు. ఇప్పటికే పలు పథకాలను అమలు చేస్తున్నారు. ఐటీడీఏ ప్రాజెక్టు డైరెక్టర్లు కూడా కాలానుగుణ పరిస్థితులను బట్టి ప్రణాళికలను రచించారు. గతంలో అటవీ ఉత్పత్తులే గిరిజనులకు ఆధారం కాబట్టి వాటికి మార్కెటింగ్, గిట్టుబాటు ధరలు కల్పించడానికి ప్రణాళికలు అమలు చేసేవారు. ఇప్పుడు వ్యవసాయం, ఉద్యాన పంటలపై కూడా ఆధారపడుతున్నారు. విద్య ప్రాధాన్యం తెలుసుకున్నారు. ఇప్పుడీ పరిస్థితులకు తగినట్లుగా, ప్రాంతాలకు అనుగుణంగా గిరిజన సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, కమిషనర్, గిరిజన ఎమ్మెల్యేలమంతా చర్చించి ప్రణాళికలను సిద్ధం చేస్తాం. అందుబాటులోనున్న నిధులను సది్వనియోగం చేసుకుంటూ గిరిజనులకు తక్షణమే లబ్ధి కలిగేలా చూస్తాను.
సాక్షి: ఉమ్మడి విజయనగరం జిల్లాలో సీనియర్ ఎమ్మెల్యేగా మీరు గుర్తించిన సమస్యలను ఏవిధంగా పరిష్కరిస్తారు?
రాజన్నదొర: గిరిజనులకు విద్య, వైద్య సౌకర్యాలు జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ హయాంలోనే మెరుగుపడ్డాయి. వారికి నాణ్యమైన విద్యను అందేలా నా వంతు ప్రయత్నం చేస్తాను. నాడు–నేడు కార్యక్రమంలో పాఠశాలల రూపురేఖలు మారాయి. కొన్నిచోట్ల హాస్టళ్లకు సొంత భవనాలు లేవు. అవన్నీ సమకూర్చుతాం. వైద్యం విషయానికొస్తే పార్వతీపురంలో మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి మంజూరైంది. నిర్మాణ పనులు వేగవంతం చేస్తాం. సీహెచ్‌సీల్లో వైద్య సౌకర్యాలు, మౌలిక వసతులు మెరుగుచేసే పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. గిరిశిఖర గ్రామాలకు రోడ్ల నిర్మాణంపై దృష్టి పెడతాను. ఒడిశాలో రహదారుల నిర్మాణానికి అటవీ శాఖ అధికారులు ఎలాంటి అభ్యంతరాలు చెప్పట్లేదు. ఇక్కడ మాత్రం భిన్నంగా వ్యవహరిస్తున్నారు. వాటన్నింటిపైనా ఆయా అధికారులతో చర్చించి రోడ్ల నిర్మాణ పనులు వేగవంతం చేస్తాం.
సాక్షి: మంత్రి పదవితో మీ సేవలకు గుర్తింపు వచ్చిందని భావిస్తున్నారా?
రాజన్నదొర: మహానాయకుడు వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబంతో నాకు తొలి నుంచి సాన్నిహిత్యం ఉంది. దానితో పాటు నా కష్టం, పనితీరు, నిబద్ధత చూసే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నాకు మంత్రివర్గంలో స్థానం కల్పించారు. ఈ అవకాశాన్ని సది్వనియోగం చేసుకొని ముఖ్యమంత్రికి, ప్రభుత్వానికి, పారీ్టకి మంచిపేరు వచ్చేలా పనిచేస్తాను.
సాక్షి: ఆంధ్రప్రదేశ్–ఒడిశా రాష్ట్రాల మధ్య దీర్ఘకాలంగానున్న కొటియా సమస్యపై ఏవిధంగా దృష్టి పెడతారు?
రాజన్నదొర: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గత నవంబర్ 9న ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పటా్నయక్తో చర్చలు జరిపారు. అప్పటికే ఒడిశా ప్రభుత్వం సుప్రీంకోర్టులో కేసు వేసింది. కొటియా ప్రజలు మాత్రం ఆంధ్రప్రదేశ్‌లోనే ఉండాలని బలంగా కోరుకుంటున్నారు. ఒడిశాలో సామాజిక పింఛన్ రూ.500 మాత్రమే ఇస్తున్నారు. మన రాష్ట్రంలో జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం రూ.2,500 చొప్పున ఇస్తోంది. అంతేకాదు ఇక్కడ అమలు జరుగుతున్నన్ని సంక్షేమ పథకాలు ఒడిశాలో లేవు. పేదలందరికీ ఇళ్లు, రైస్‌కార్డు, అమ్మ ఒడి, వైఎస్సార్ చేయూత, చేదోడు... నవరత్నాలన్నీ కొటియా గ్రామాల్లో అమలవుతున్నాయి. ఏదేమైనా అక్కడి ప్రజల మనోభావాలకు అనుగుణంగా సరిహద్దుపై నిర్ణయం తీసుకోవాలని ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కోరతాను.