Tribal groups
-
గిరిజన, దళిత సంఘాల భారత్ బంద్ పిలుపు
సాక్షి, న్యూఢిల్లీ : అటవీ హక్కుల చట్టం కింద ప్రయోజనాలు నిరాకరించబడిన కుటుంబాలను తక్షణమే ఆయా ప్రాంతాల నుంచి తరలించాలని ఫిబ్రవరి 13న సుప్రీం కోర్టు ఇచ్చిన ఉత్తర్వులకు వ్యతిరేకంగా గిరిజన, దళిత సంఘాలు మంగళవారం భారత్ బంద్‌కు పిలుపు ఇచ్చాయి. సుప్రీం ఉత్తర్వులతో పది లక్షల మంది గిరిజనులు, అడవిపై ఆధారపడిన వారి హక్కులకు విఘాతం కలుగుతుందని భావిస్తున్నారు. అటవీ హక్కుల చట్టాన్ని పునరుద్ధరించాలని కోరుతూ గిరిజన సంఘాలు దేశ రాజధానిలో మండీ హౌస్ నుంచి జంతర్ మంతర్ వరకూ భారీ ప్రదర్శన చేపడుతున్నాయి. గిరిజనులు, ఆదివాసీల హక్కుల పరిరక్షణను న్యాయస్ధానంలో కేంద్ర ప్రభుత్వం సమర్ధంగా తన వాదనను వినిపించలేదని గిరిజన సంఘాలు భగ్గుమంటున్నాయి. అటవీ హక్కుల చట్టం కింద తమ ప్రయోజనాలను పరిరక్షించేందుకు ఎన్డీఏ ప్రభుత్వం తక్షణమే ఆర్డినెన్స్‌ను తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నాయి. కాగా గుజరాత్, రాజస్తాన్, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ సహా పలు ఈశాన్య రాష్ట్రాలు నేటి బంద్‌లో పాల్గొంటున్నాయి. మరోవైపు యూనివర్సిటీల్లో ఫ్యాకల్టీ సభ్యుల నియామకంలో ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లకు సంబంధించి అలహాబాద్ హైకోర్టు ఉత్తర్వులను సర్వోన్నత న్యాయస్ధానం సమర్ధించినందుకు నిరసనగా గిరిజన సంఘాల సమ్మెలో పాల్గొనాలని దళిత సంఘాలు నిర్ణయించాయి. -
గిరిజన హక్కుల్ని కాలరాస్తున్న ప్రభుత్వం
► గిరిజన సంఘాల ఐక్య కూటమి నేతలు ► అభివృద్ధిపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ పూర్ణానందంపేట(విజయవాడ) : గిరిజన సంఘాల అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని గిరిజన సంఘాల ఐక్యకూటమి చైర్మన్ వివేక్వినాయక్ డిమాండ్ చేశారు. గిరిజన సంఘాల జేఏసీ రాష్ట్ర సమావేశం ఆదివారం పూర్ణానందంపేటలోని ఓ హోటల్లో ని ర్వహించారు. రాష్ట్ర విభజన తర్వాత రాజ్యాంగబద్ధంగా గిరిజనులకు సం క్రమించాల్సిన హక్కులను ప్రభుత్వం అడ్డుకుంటోందని మండిపడ్డారు. గిరిజనులకు ప్రభుత్వం చేసిందేమీ లేదు : ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు గడిచినా ఇప్పటి వరకూ గిరిజనులకు చేసిందేమీ లేదన్నారు. ఎస్టీల రిజర్వేషన్లశాతం, ఎస్టీ చైర్మన్‌పై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలేదని విమర్శించారు. గిరిజనుల పట్ల రాష్ట్రప్రభుత్వం చిన్నచూపు చూస్తోందన్నారు. కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలను నడుపుతూ గిరిజనులకు ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేస్తోందని మండిపడ్డారు. గిరిజన హక్కులు కాలరాస్తున్న సీఎం చంద్రబాబు ఉపన్యాసాలకు మాత్రమే పరిమితమైన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గిరిజనుల హక్కులు కాలరాస్తున్నరని ఆవేదన వ్యక్తంచేశారు. టీడీపీలో ఎస్టీ ఎమ్మెల్యే ఉన్నా గిరిజన సంక్షేమశాఖకు దళిత వర్గానికి చెందిన రావేళ్ల కిషోర్‌బాబును నియమించడం అన్యాయమన్నారు. రాష్ట్రంలో ఎంతో మంది గిరిజనులు ఉన్నత స్థానాల్లో ఉన్నా వారేవరికి నామినేటేడ్ పదవుల్లో స్థానం కల్పించకపోవడానికి గిరిజనుల పట్ల ప్రభుత్వం చూపిస్తున్న వివక్షతే కారణమన్నారు. గిరిజనులపట్ల టీడీపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు ఆపకపోతే ప్రభుత్వంపై పోరాడతామన్నారు. అదే తరహాలో పోరాడతాం : ఏజేన్సీ ప్రాంతాల్లో బాక్సైట్ తవ్వకాలను గిరిజనులు ఏ రకంగా అడ్డుకున్నారో అదే తరహాలో తమ హక్కులకోసం పోరాడతామన్నారు. ప్రపంచ ఆదివాసి దినోత్సవమైన అగస్టు 9న గిరిజనులతో కలసి రాష్ట్రంలో భారీసభ నిర్వహిస్తున్నట్లు వివరించారు. గిరిజన సంఘాల ఐక్యకూటమి వైస్‌చైర్మన్ రామస్వామి, స్టేద్వా జల్లా అధ్యక్షుడు పుల్లయ్య, ఎస్టీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు ప్రవీన్‌కుమార్, పి.శ్రీనివాసరావు, మిత్ర, కళ్యాణి, గొపాలరావు, సత్యనారాయణలతోపాటు 13 జిల్లాల నుంచి వచ్చిన నాయకులు పాల్గొన్నారు. -
బాక్సైట్ ఉద్యమానికి జేఏసీ ఏర్పాటు
విశాఖ ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాల దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుండడంతో దీనికి వ్యతిరేకంగా ఉద్యమించడానికి ఐక్య కార్యచారణ కమిటీ ఏర్పాటైంది. ఆదివారం విశాఖలోని ఎంవీపీ కాలనీ ప్రాంతంలోని గిరిజన భవన్లో వివిధ ఆదివాసీ సంఘాలు, గిరిజన మేథావులు, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు కెడారి సర్వేశ్వరరావు, గిడ్డి ఈశ్వరి, పి.రాజన్నదొర, రాజేశ్వరి, కళావతి తదితరులు సమావేశమయ్యారు. బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా ఉద్యమించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. ఈ సందర్భంగా పలు తీర్మానాలు చేశారు. బాక్సైట్ తవ్వకాలకు గ్రామసభ ఆమోదాన్ని తప్పనిసరిగా అమలు చేయాలని తీర్మానించారు. తవ్వకాల కోసం ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 97ను రద్దు చేయాలని, గిరిజన సలహా మండలి ఏర్పాటు చేయాలని తీర్మానించారు. -
ట్రైబల్ గ్రూప్స్‌కు రూ. 3.02 కోట్లు
హైదరాబాద్: డెవలప్మెంట్ ఆఫ్ పర్టిక్యులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ సెంట్రల్ సెక్టార్ పథకంలో భాగంగా సాధారణ కార్యకలాపాలు, ఇతరత్రా వాటికి ఖర్చు చేసేందుకు రూ.3.02 కోట్ల నిధులను విడుదల చేస్తూ ఉత్తర్వులను ప్రభుత్వం జారీచేసింది. ఈ ఉత్తర్వులకు అనుగుణంగా గిరిజన సంక్షేమ శాఖ పరిపాలనాపరమైన మంజూరునివ్వాలని గురువారం ఆర్థికశాఖ ప్రత్యేకకార్యదర్శి రామకృష్ణరావు ఆదేశాలు జారీ చేశారు. -
తవ్వితే కష్టమే!
‘దేశం’ నేతల్లో బాక్సైట్ గుబులు! ప్రతిపక్షంలో ఉండగా వ్యతిరేక పోరాటం చేసింది మనమే సీఎం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మంత్రులు, ఎమ్మెల్యేల తీర్మానం అడ్డుకునేందుకు ఉమ్మడి ప్రయత్నాలు! ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాలపై ప్రభుత్వ అనుకూల నిర్ణయం స్వపక్షంలోనే గుబులు రేపుతోంది. ఒకపక్క ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా గిరిజన సంఘాలు, మరోపక్క వైఎస్సార్సీపీ ఉద్యమిస్తుండడం, దానికి గిరిజ నుల నుంచి భారీగా మద్దతు లభిస్తుండడంతో జిల్లా ప్రజాప్రతినిధులకు సంకటంగా మారింది. సాక్షి, విశాఖపట్నం : ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాలకు అనుమతులివ్వాలన్న సీఎం చంద్రబాబు నిర్ణయానికి వ్యతిరేకంగా ఆదిలోనే స్వపక్షం నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఒకప్పుడు ప్రతిపక్షంలో ఉండి బాక్సైట్ తవ్వకాలు వ్యతిరేకించి తీరా ఇప్పుడు అధికారంలోకి వచ్చాక సమ్మతిస్తే ప్రజల్లో అభాసుపాలవుతామని సొంత పార్టీ మంత్రులతోపాటు ఎమ్మెల్యేలు సీఎం నిర్ణయాన్ని తప్పుబడుతున్నారు. ప్రశాంతంగా ఉన్న మన్యంలో మళ్లీ మావోయిస్టులు బలపడేందుకు స్వయంగా ప్రభుత్వమే పూనుకున్నట్లు అవుతుదంటూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. విశాఖ అభివృద్ధిపై చర్చించడానికి మంత్రి గంటా ఆదివారం పార్టీ ఎమ్మెల్యేలతో భేటీ నిర్వహించారు. ఇందులో ప్రజాప్రతినిధులంతా ప్రభుత్వం నిర్ణయాన్ని తప్పుబట్టారు. సీఎంను కలిసి వాస్తవాలు వివరించి ఆయనతో నిర్ణయం ఉపసంహరించేలా చేయాలని తీర్మానించారు. ‘విశాఖ జిల్లా ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాలకు అనుమతి ఇస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఇప్పుడు ఆదిశగా ప్రయత్నిస్తున్నారు. ఇది సరికాదు. ఒకప్పుడు ప్రతిపక్షంలో ఉండగా బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా ఉద్యమించి పోరాటం చేసింది మనమే. కాని ఇప్పుడు అధికారంలోకి రాగానే మళ్లీ గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను మనమే చేస్తే ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడుతుంది. అందుకే ఎమ్మె ల్యేలు, మంత్రులు అంతా కలిసి సీఎం చంద్రబాబును కలుద్దాం. బాక్సైట్ తవ్వకాల అనుమతులు ఇవ్వకుండా ఆయన్ను ఒప్పిద్దాం. వాస్తవాలు వివరించకపోతే ఆతర్వాత నష్టపోయేది మనమే’.. అంటూ ఎమ్మెల్యేలంతా ముక్తకంఠంతో గంటాకు వివరించారు. దీంతో ఆయనకూడా పార్టీ నేతల అభిప్రాయంతో ఏకీభవించారు. భేటీకి మరో మంత్రి అయ్యన్న హాజరుకాకపోయినా ఆయన కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నారని పలువురు ప్రజాప్రతినిధులు మంత్రి గంటా దృష్టికి తీసుకువచ్చారు. విశాఖ అభివృద్ధికి అసెంబ్లీలో సీఎం ప్రకటించిన ప్రాజెక్టులే కాకుండా మరిన్ని కొత్తవి తెచ్చుకోవడంతోపాటు నగరాభివృద్ధికి ఇంకా ఏంచేయాలి? అనేదానిపై మంత్రి గంటా, ఎమ్మెల్యేలు చర్చించారు. విశాఖ అభివృద్ధితోపాటు ఉత్తరాంధ్ర అభివృద్ధి చాలా కీలకమని అందువల్ల మూడు జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు కలిసి ఈ ప్రాంతాన్ని అభివృద్ధిచేసుకోవాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. ఎయిర్‌పోర్టులు, ఐఐటీ, మెడికల్ కాలేజీలు, ఐఐఎంలతోపాటు ఉత్తరాంధ్రకు పెద్దదిక్కైన కేజీహెచ్ అభివృద్ధి ఇలా అన్ని ప్రాజెక్టులు మూడు జిల్లాలతో ముడిపడి ఉన్నందున జిల్లాల వారీగా విడిపోయి ప్రయత్నించే బదులు ఉత్తరాంధ్ర మంత్రులు,ఇతర ప్రజాప్రతినిధులు కలిసి పనిచేస్తే మేలనే భావనకు వచ్చారు. ముఖ్యంగా రైల్వేజోన్ సాధన కోసం చంద్రబాబు అనుమతితో ఢిల్లీ వెళ్లి ప్రధానిని కలవాలని ఉమ్మడి నిర్ణయం వెలిబుచ్చారు. అయ్యన్న డుమ్మా.. : జిల్లా అభివృద్ధిపై మంత్రి గంటా నిర్వహించిన భేటీకి మరో మంత్రి అయ్యన్న గైర్హాజరు కావడం మరోసారి ఇద్దరిమంత్రుల మధ్య ముదిరిన విబేధాలను స్పష్టం చేస్తున్నాయి. ఎన్నికల ముందు నుంచీ ఈ ఇద్దరు ఉప్పునిప్పుగా ఉంటున్నారు. సాక్షాత్తూ సీఎం చంద్రబాబు సైతం ఇద్దరినీ పిలిచి క్లాస్ పీకినా మంత్రుల్లో మాత్రం మార్పు రావడంలేదు. తాజాగా ఆదివారం నాటి భేటీకి అయ్యన్నతోపాటు ఆయన వర్గం విశాఖపట్నం తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి కూడా హాజరుకాలేదు. ముందే హెచ్చరించిన వైఎస్సార్ సీపీ వాస్తవానికి గత నెలలో సీఎం చంద్రబాబు నగరంలో జరిగిన గిరిజన సదస్సుకు హాజరై ఏజెన్సీలో బాక్సైట్ తవ్వితే ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుందని ప్రకటించారు. ఆ వెంటనే నిరసనగా వైఎస్సార్సీపీ పాడేరు, అరకు ఎమ్మెల్యేలు గిడ్డిఈశ్వరి,కిడారి సర్వేశ్వరరావు అభ్యంతరం వ్యక్తం చేశారు. మన్యం జోలికి రావద్దని హెచ్చరించారు. ఆ తర్వాత ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఏజెన్సీలోని 11 మండలాల గిరిజన సంఘాలు, ప్రజాసంఘాలు రోజుల తరబడి ఇప్పటికీ ఆందోళనలు నిర్వహిస్తున్నాయి. వైఎస్సార్సీపీ సైతం మద్దతుగా నిలిచి పోరాటబాట పట్టింది. ఇటీవల కొందరు మావోయిస్టులు సైతం బాక్సైట్ వ్యతిరేక ఉద్యమం చేపడతామని ప్రకటించారు. దీంతో వరుసపెట్టి ప్రభుత్వనిర్ణయానికి వ్యతిరేకంగా ఆందోళనలు పెరుగుతుండడంతో జిల్లా అధికార పార్టీలో కాక రేపింది. -
తండాలకు మహర్దశ
- గిరిజన పల్లెలు ఇక పంచాయతీలు - 500 జనాభా పైగా ఉన్న తండాల గుర్తింపు - జిల్లాలో 142తండాలకు పంచాయతీ హోదా - ప్రతిపాదనలు సిద్ధం చేసిన అధికారులు సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: నిత్యం సమస్యలతో సతమతమవుతున్న గిరిజన తండాలకు ఇక మహర్దశ కలగనుంది. వాటికి పంచాయతీ హోదా కల్పించడంతో పాటు అభివృద్ధికి పెద్దపీట వేయనున్నారు. ఈ మేరకు గిరిజన తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చుతామన్న ప్రభుత్వ హామీకి అనుగుణంగా జిల్లా అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. జిల్లాలో 500 మందికిపైగా జనాభా ఉన్న గిరిజన ఆవాసాలను గుర్తించారు. ‘మా తండాలో మా పాలన’ నినాదంతో గిరిజన తండాలను పంచాయతీలుగా మార్చాలంటూ గిరిజన సంఘాలు డిమాండు చేస్తూ వస్తున్నాయి. తండాలకు పంచాయతీ హోదా దక్కితే అధికార వికేంద్రీకరణ జరగడంతో పాటు పాలనలో పారదర్శకత సాధ్యమనే భావన వ్యక్తమవుతోంది. జిల్లాలో 1202 గిరిజన ఆవాసాలు ఉండగా, వీటిని మూడు కేటగిరీలుగా అధికారులు వర్గీకరించారు. 2011 జనాభా లెక్కలను ప్రాతిపదికగా తీసుకుని 500 మంది లోపు జనాభా, 500 కంటే ఎక్కువ, వెయ్యి కంటే ఎక్కువ జనాభా కలిగి ఉన్న తండాలను గుర్తించారు. మహబూబ్‌నగర్ రెవెన్యూ డివిజన్‌లోనే తండాలు ఎక్కువ సంఖ్యలో ఉన్నట్లు నివేదిక వెల్లడిస్తోంది. గ్రామ పంచాయతీ, రెవెన్యూ విభాగాల సహకారంతో నివేదిక సిద్ధం చేసినట్లు అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం జిల్లాలో 1329 గ్రామ పంచాయతీలు, 13566 వార్డులు ఉన్నాయి. జిల్లా జనాభాలో 8.99 శాతంగా ఉన్న గిరిజనులకు 151 గ్రామ పంచాయతీలు, 1384 వార్డులను ప్రత్యేకించారు. 500 జనాభా పైబడిన గిరిజన తండాలను గ్రామ పంచాయతీలుగా గుర్తిస్తే జిల్లాలో 142 గిరిజన తండాలకు పంచాయతీహోదా దక్కుతుంది. సమస్యలతో సతమతం జన జీవన స్రవంతికి దూరంగా విసిరేసినట్లు ఉంటున్న గిరిజనతండాల్లో సమస్యలు రాజ్యమేలుతున్నాయి. విద్య, వైద్యం, మురుగు కాల్వలు, విద్యుత్ వంటి మౌలిక సమస్యలు తాండవిస్తున్నాయి. రోడ్డు సౌకర్యం లేకపోవడంతో నిత్యావసరాల కోసం సమీప గ్రామాలకు కిలోమీటర్ల కొద్దీ నడవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ అమల్లో ఉన్నా జనాభా ప్రాతిపదికన నిధులు కేటాయిస్తుండటంతో కొద్ది సంఖ్యలో జనాభా వున్న తండాలను పట్టించుకునే పరిస్థితి లేదు. నిధుల వినియోగంలోనూ పారదర్శకత ఉండటం లేదనే విమర్శలొస్తున్నాయి. పట్టణాలకు దగ్గరలో ఉండే గిరిజన తండాల వైపు మాత్రమే అధికారులు దృష్టి సారిస్తున్నారు. తండాలు పంచాయతీలుగా మారితే ‘స్థానిక’ పరిపాలనలో తమ భాగస్వామ్యం పెరుగుతుందన్న ఆశ గిరిజనల్లో వ్యక్తమవుతోంది. తండాల వారీగా గిరిజన జనాభా వివరాలను ప్రభుత్వానికి పంపించామని..పంచాయతీగా మార్చే నిర్ణయం ప్రభుత్వం చేతిలోనే ఉందని డీపీఓ రవీందర్ ‘సాక్షి’తో అన్నారు.