తవ్వితే కష్టమే! | 'Country' bauxite among the foliage! | Sakshi
Sakshi News home page

తవ్వితే కష్టమే!

Published Mon, Sep 8 2014 12:29 AM | Last Updated on Wed, Apr 3 2019 9:27 PM

తవ్వితే కష్టమే! - Sakshi

తవ్వితే కష్టమే!

  • ‘దేశం’ నేతల్లో బాక్సైట్ గుబులు!
  •   ప్రతిపక్షంలో ఉండగా వ్యతిరేక పోరాటం చేసింది మనమే
  •   సీఎం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మంత్రులు, ఎమ్మెల్యేల తీర్మానం
  •   అడ్డుకునేందుకు ఉమ్మడి ప్రయత్నాలు!
  • ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాలపై ప్రభుత్వ అనుకూల నిర్ణయం స్వపక్షంలోనే గుబులు రేపుతోంది. ఒకపక్క ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా గిరిజన సంఘాలు, మరోపక్క వైఎస్సార్‌సీపీ ఉద్యమిస్తుండడం, దానికి గిరిజ నుల నుంచి భారీగా మద్దతు లభిస్తుండడంతో జిల్లా ప్రజాప్రతినిధులకు సంకటంగా మారింది.
     
    సాక్షి, విశాఖపట్నం : ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాలకు అనుమతులివ్వాలన్న సీఎం చంద్రబాబు నిర్ణయానికి వ్యతిరేకంగా ఆదిలోనే స్వపక్షం నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఒకప్పుడు ప్రతిపక్షంలో ఉండి బాక్సైట్ తవ్వకాలు వ్యతిరేకించి తీరా ఇప్పుడు అధికారంలోకి వచ్చాక సమ్మతిస్తే ప్రజల్లో అభాసుపాలవుతామని సొంత పార్టీ మంత్రులతోపాటు ఎమ్మెల్యేలు సీఎం నిర్ణయాన్ని తప్పుబడుతున్నారు. ప్రశాంతంగా ఉన్న మన్యంలో మళ్లీ మావోయిస్టులు బలపడేందుకు  స్వయంగా ప్రభుత్వమే పూనుకున్నట్లు అవుతుదంటూ  అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

    విశాఖ అభివృద్ధిపై చర్చించడానికి మంత్రి గంటా ఆదివారం పార్టీ ఎమ్మెల్యేలతో భేటీ నిర్వహించారు. ఇందులో ప్రజాప్రతినిధులంతా ప్రభుత్వం నిర్ణయాన్ని తప్పుబట్టారు. సీఎంను కలిసి వాస్తవాలు వివరించి ఆయనతో నిర్ణయం ఉపసంహరించేలా చేయాలని తీర్మానించారు. ‘విశాఖ జిల్లా ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాలకు అనుమతి ఇస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఇప్పుడు ఆదిశగా ప్రయత్నిస్తున్నారు. ఇది సరికాదు.

    ఒకప్పుడు ప్రతిపక్షంలో ఉండగా బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా ఉద్యమించి పోరాటం చేసింది మనమే. కాని ఇప్పుడు అధికారంలోకి రాగానే మళ్లీ గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను మనమే చేస్తే ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడుతుంది. అందుకే ఎమ్మె ల్యేలు, మంత్రులు అంతా కలిసి సీఎం చంద్రబాబును కలుద్దాం. బాక్సైట్ తవ్వకాల అనుమతులు ఇవ్వకుండా ఆయన్ను ఒప్పిద్దాం. వాస్తవాలు వివరించకపోతే ఆతర్వాత నష్టపోయేది మనమే’.. అంటూ  ఎమ్మెల్యేలంతా ముక్తకంఠంతో గంటాకు వివరించారు. దీంతో ఆయనకూడా పార్టీ నేతల అభిప్రాయంతో ఏకీభవించారు. భేటీకి మరో మంత్రి అయ్యన్న హాజరుకాకపోయినా ఆయన కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నారని పలువురు ప్రజాప్రతినిధులు మంత్రి గంటా దృష్టికి తీసుకువచ్చారు.
     
    విశాఖ అభివృద్ధికి అసెంబ్లీలో సీఎం ప్రకటించిన ప్రాజెక్టులే కాకుండా మరిన్ని కొత్తవి తెచ్చుకోవడంతోపాటు నగరాభివృద్ధికి ఇంకా ఏంచేయాలి? అనేదానిపై మంత్రి గంటా, ఎమ్మెల్యేలు  చర్చించారు. విశాఖ అభివృద్ధితోపాటు ఉత్తరాంధ్ర అభివృద్ధి చాలా కీలకమని అందువల్ల మూడు జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు కలిసి ఈ ప్రాంతాన్ని అభివృద్ధిచేసుకోవాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. ఎయిర్‌పోర్టులు, ఐఐటీ, మెడికల్ కాలేజీలు, ఐఐఎంలతోపాటు ఉత్తరాంధ్రకు పెద్దదిక్కైన కేజీహెచ్ అభివృద్ధి ఇలా అన్ని ప్రాజెక్టులు మూడు జిల్లాలతో ముడిపడి ఉన్నందున జిల్లాల వారీగా విడిపోయి ప్రయత్నించే బదులు ఉత్తరాంధ్ర మంత్రులు,ఇతర ప్రజాప్రతినిధులు కలిసి పనిచేస్తే మేలనే భావనకు వచ్చారు. ముఖ్యంగా రైల్వేజోన్ సాధన కోసం చంద్రబాబు అనుమతితో ఢిల్లీ వెళ్లి ప్రధానిని కలవాలని ఉమ్మడి నిర్ణయం వెలిబుచ్చారు.
     
    అయ్యన్న డుమ్మా.. : జిల్లా అభివృద్ధిపై మంత్రి గంటా నిర్వహించిన భేటీకి మరో మంత్రి అయ్యన్న గైర్హాజరు కావడం మరోసారి ఇద్దరిమంత్రుల మధ్య ముదిరిన విబేధాలను స్పష్టం చేస్తున్నాయి. ఎన్నికల ముందు నుంచీ ఈ ఇద్దరు ఉప్పునిప్పుగా ఉంటున్నారు. సాక్షాత్తూ సీఎం చంద్రబాబు సైతం ఇద్దరినీ పిలిచి క్లాస్ పీకినా మంత్రుల్లో మాత్రం మార్పు రావడంలేదు. తాజాగా ఆదివారం నాటి భేటీకి అయ్యన్నతోపాటు ఆయన వర్గం విశాఖపట్నం తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి కూడా హాజరుకాలేదు.
     
    ముందే హెచ్చరించిన వైఎస్సార్ సీపీ

    వాస్తవానికి గత నెలలో సీఎం చంద్రబాబు నగరంలో జరిగిన గిరిజన సదస్సుకు హాజరై ఏజెన్సీలో బాక్సైట్ తవ్వితే ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుందని ప్రకటించారు. ఆ వెంటనే నిరసనగా వైఎస్సార్‌సీపీ పాడేరు, అరకు ఎమ్మెల్యేలు గిడ్డిఈశ్వరి,కిడారి సర్వేశ్వరరావు అభ్యంతరం వ్యక్తం చేశారు. మన్యం జోలికి రావద్దని హెచ్చరించారు. ఆ తర్వాత ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఏజెన్సీలోని 11 మండలాల గిరిజన సంఘాలు, ప్రజాసంఘాలు రోజుల తరబడి ఇప్పటికీ ఆందోళనలు నిర్వహిస్తున్నాయి. వైఎస్సార్‌సీపీ సైతం మద్దతుగా నిలిచి పోరాటబాట పట్టింది. ఇటీవల కొందరు మావోయిస్టులు సైతం బాక్సైట్ వ్యతిరేక ఉద్యమం చేపడతామని ప్రకటించారు. దీంతో వరుసపెట్టి ప్రభుత్వనిర్ణయానికి వ్యతిరేకంగా ఆందోళనలు పెరుగుతుండడంతో జిల్లా అధికార పార్టీలో కాక రేపింది.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement