బాక్సైట్ భయం
- ఐటీడీఏ అధికారుల్లో ఆందోళన
- మారుమూల ప్రాంతాల్లో పర్యటనకు వెనకడుగు
పాడేరు ఐటీడీఏను ఇప్పుడు బాక్సైట్ భూతం భయపెడుతోంది. పార్టీలకతీతంగా ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాలను వ్యతిరేకిస్తుండగా జనం ఇప్పటికే రోడ్లపైకి వస్తుండడంతో అధికారుల్లో గుబులు మొదలైంది. పులిమీద పుట్రలా మావోయిస్టులు ఐటీడీఏను టార్గెట్ చేయడం కలకలం రేపుతోంది.
పాడేరు : ఐటీడీఏ ద్వారా బాక్సైట్ తవ్వకాలు చేపట్టి గిరిజనుల అభివృద్ధికే నిధులను వెచ్చిస్తామని ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 9న విశాఖలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించినప్పటి నుంచి అందరి దృష్టి పాడేరు ఐటీడీఏ పైనే పడింది. గిరిజనుల సంక్షేమం కోసం ఆవిర్భవించిన ఐటీడీఏను బాక్సైట్ తవ్వకాల వ్యాపార సంస్థగా మార్చి వేయనుందనే ప్రచారం జోరందుకుంది. అదే సమయంలో ఏజెన్సీ అంతటా పార్టీలకతీతంగా ఆందోళన మొదలైంది.
ప్రశాంతంగా ఉన్న పాడేరు ఐటీడీఏలో బాక్సైట్ తవ్వకాల ప్రకటన కలకలం రేపింది. పులిమీద పుట్రలా మావోయిస్టులు కూడా బాక్సైట్ తవ్వకాల ప్రకటనను నిరసిస్తు ఈ కార్యాలయాన్ని కూల్చివేస్తామని ప్రకటించడం అధికారులను కలవరానికి గురి చేస్తోంది. ఐటీడీఏ కార్యాలయ సముదాయంలో ప్రాజెక్టు ఆఫీసర్ చాంబర్‌తోపాటు కాఫీ, ఉద్యానవనం, వ్యవసాయ, పంచాయతీరాజ్, గిరిజన సంక్షేమ ఇంజినీరింగ్ విభాగాలు, గిరిజన సంక్షేమ డీడీ కార్యాలయం, అదనపు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం, జాతీయ ఉపాధి హామీ పథకం విభాగాలు పని చేస్తున్నాయి.
అన్ని శాఖల ఉన్నతాధికారులు ఇక్కడే విధులు నిర్వహిస్తున్నారు. బాక్సైట్ తవ్వకాల ప్రకటన వీరందరినీ కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఏ క్షణానికి ఏం జరుగుతుందోనన్న ఆందోళన వెంటాడుతోంది. ముఖ్యమంత్రి ప్రకటన సమయం నుంచి ప్రాజెక్టు అధికారితో సహా ఇతర శాఖల ఉన్నతాధికారులు మారుమూల గ్రామాల పర్యటనలకు ఇబ్బంది పడుతున్నారు.
ఇటీవల మావోయిస్టుల కార్యకలాపాలు అధికమవడం, బాక్సైట్ వ్యతిరేక ఉద్యమాలకు శ్రీకారం చుట్టడంతో అధికార యంత్రాంగం మారుమూల ప్రాంతాలకు వెళ్లడంలేదు. ప్రశాంతంగా ఉన్న ఐటీడీఏకు బాక్సైట్ తవ్వకాల ప్రకటన అశాంతిని నెలకొల్పింది. పోలీసు ఉన్నతాధికారులు కూడా ఈ కార్యాలయంపేనే ప్రధానంగా దృష్టి కేంద్రీకరించారు. ఈ కార్యాలయ ప్రాంతంలో ఎలాంటి ఆందోళన
కార్యక్రమాలు జరిగినా అప్రమత్తమవుతోంది. ఇక్కడ అధికారులకు కూడా పలు సూచనలు జారీచేసినట్లు కూడా సమాచారం.