'రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలి'
హైదరాబాద్: ఏజెన్సీ ప్రాంతాల్లో విష జ్వరాలు ప్రభలి 16 మంది మృత్యువాత పడ్డారని, ఈ మరణాలకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబే బాధ్యత వహించాలని ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి అన్నారు. ఆయనిక్కడ విలేకరులతో మాట్లాడుతూ చనిపోయిన వారికి ఎక్స్గ్రేషియా ప్రకటించడంలో సీఎం ఒక మాట, డిప్యూటీ సీఎం మరో మాట మాట్లాడటం సర్కార్ నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు.
తక్షణం హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రలో దళితుల పట్ల దాడులు టీడీపీ ప్రభుత్వంలో సర్వసాధారణంగా మారాయన్నారు. దళితులను సంఘ బహిష్కరణలు చేసినా ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు. దళితులను బహిష్కరించినా పట్టించుకోని పోలీసులు.. వారిని పరామర్శించేందుకు వెళ్లిన కాంగ్రెస్ నేతలను అడ్డుకోవడం సిగ్గుచేటన్నారు. ఈ విషయంలో ఆ గ్రామ ప్రజలపై కాదు.. సీఎం చంద్రబాబు పైనే నేరుగా అట్రాసిటీ కేసు నమోదు చేయాలని సూచించారు.
విభజన చట్టంలో ఇచ్చిన హామీలను సాధించడంలో నిర్లక్ష్యం చేస్తున్న బాబు, కేసీఆర్, వెంకయ్యనాయుడులు రెండు తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపునకు కోసం మాత్రం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. వీళ్లకు రాష్ట్ర ప్రయోజనాల కన్నా రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమన్నారు. నంద్యాల ఉపఎన్నికల్లో కాంగ్రెస్ పోటీ చేసి తీరుతుందని స్పష్టం చేశారు..