అమెరికాలో కిరాతకం
లెగ్జింటన్: అమెరికా స్పింటర్ టైసన్ గే కుమార్తె ట్రినిటీ గే(15) దారుణ హత్యకు గురైంది. కెంటకీ యూనివర్సిటీ మెడికల్ సెంటర్ లో ఆమెను కాల్చిచంపినట్టు టైసన్ గే ప్రతినిధి మార్క్ వెట్ మోర్ తెలిపారు. రెస్టరెంట్ పార్కింగ్ ప్రాంతంలో ట్రినిటీ మృతదేహాన్ని గుర్తించినట్టు అసోసియేటెడ్ ప్రెస్ వెల్లడించింది.
ఆదివారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో కాల్పులు జరిగినట్టు లెగ్జింటన్ పోలీసులు తెలిపారు. రెండు వాహనాల్లోని వ్యక్తుల మధ్య కాల్పులు జరిగినట్టు ప్రత్యక్షసాక్షి ఒకరు వెల్లడించారని చెప్పారు. ఈ ఘటనకు సంబంధించి ఒక వాహనాన్ని స్వాధీనం చేసుకున్నామని, ఇద్దరిని ప్రశ్నిస్తున్నామని తెలిపారు. మరో వాహనం కోసం గాలిస్తున్నామని, దర్యాప్తు కొనసాగిస్తున్నట్టు చెప్పారు.
గత మూడు సమ్మర్ ఒలింపిక్ క్రీడల్లో టైసన్ గే పోటీ పడ్డాడు. 2012 లండన్ ఒలింపిక్స్ లో 4X100 మీటర్ల రిలే పరుగు పందెంలో వెండి పతకం గెలిచిన అమెరికా అథ్లెట్ల బృందంలో అతడు కూడా ఉన్నాడు. ట్రినిటీ కూడా తండ్రి మాదిరిగానే స్పింటర్ గా మారింది. రాష్ట్ర స్థాయిలో పోటీల్లో పాల్గొంది. ఆమె మృతి పట్ల కెంటకీ హైస్కూల్ అథ్లెటిక్ అసోసియేషన్ సంతాపం వ్యక్తం చేసింది.