tripuranthakam
-
ఏసీబీ వలలో ఎంపీడీఓ
త్రిపురాంతకం : స్థానిక ఎంపీడీఓ కె. మాణిక్యరావు ఏసీబీ వలలో చిక్కారు. పదివేలు నగదు తీసుకుంటుడగా పట్టుబడ్డారు. బిల్లులు ఇవ్వకుండా నెలలు తరబడి తిప్పుతుండటంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. దూపాడు పంచాయతీ పరిధిలని హసానపురం గ్రామానికి చెందిన ఎనిబెర భిక్షాలు ఫెర్క్యులేషన్ ట్యాంకు పనులకు గత ఏడాది మే నెలలో వర్క్ ఆర్డర్ తసుకుని మూడు నెలల వ్యవధిలో పూర్తి చేశాడు. దీనికి సంబంధించి రూ. 1.52 లక్షల మెటీరియల్‌కు బిల్లులు రావాల్సి ఉంది. దీంతో ఉపాధి హామీ టెక్నికల్, ఫీల్డ్ అసిస్టెంట్, ఇంజినీరింగ్ అధికారులు గత ఏడాది జూలై 23న బిల్లులు చెల్లించాలని రికార్డులు, ఎం బుక్‌లను అధికారులకు సమర్పించారు. అయితే అప్పటి నుంచి ఎంపీడీఓ.. భిక్షాలును బిల్లుల కోసం తిప్పుతూ కాలయాపన చేస్తున్నాడు. తాను పేదవాడినని లంచాలు ఇవ్వలేనని.. వడ్డీలకు అప్పుతెచ్చి ఈపని చేశానని ప్రాథేయపడినా తనకు పర్సంటేజీ ఇస్తేనే బిల్లు చేస్తానని ఎంపీడీఓ మాణిక్యరావు తేల్చి చెప్పాడు. దీంతో ఏసీబీని బాధితుడు ఆశ్రయించినట్లు డీఎస్పీ తోట ప్రభాకర్, సీఐ ప్రతాప్ తెలిపారు. అధికారులు పథకం రచించారు. భిక్షాలు పదివేల రూపాయలను (ఐదువందల నోట్లు) ఎంపీడీఓ మాణిక్యరావుకు ఇస్తుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నగదుతో పాటు వర్క్‌కు సంబంధించిన రికార్డులను స్వాధీనం చేసుకుని, ఎంపీడీఓ మాణిక్యరావును అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. ఎవరైనా అధికారులు ఇలా ఇబ్బందులు పెడుతుంటే తమకు సమాచారం అందించాలని కోరారు. -
త్రిపురాంతకంలో హైకోర్టు జడ్జి పూజలు
ప్రకాశం : హైకోర్టు న్యాయమూర్తి బి.శివశంకరరావు సోమవారం కుటుంబసభ్యులతో కలిసి త్రిపురాంతకంలోని శ్రీబాలాత్రిపురసుందరీదేవి ఆలయానికి విచ్చేశారు. వీరికి ఆలయం వద్ద వేదపండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అమ్మవారి ఆలయంలో కుంకుమార్చనలు, శ్రీ పార్వతి సమేత త్రిపురాంతకేశ్వరస్వామివారి ఆలయంలో అభిషేకాలు చేశారు. అనంతరం ఆనంద నిలయం వద్ద జరుగుతున్న సహస్ర చండీయాగంలో న్యాయమూర్తి పాల్గొన్నారు. -
గురుకుల పాఠశాలలో విద్యార్థిని మృతి
త్రిపురాంతకం (ప్రకాశం) : ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలంలోని గురుకుల పాఠశాలలో శుక్రవారం ఓ విద్యార్థిని అనారోగ్యంతో మృతిచెందింది. మండలంలోని సంగం తండాకు చెందిన శ్రావణి బాయి(12) స్థానిక గురుకుల పాఠశాలలో ఏడో తరగతి చదువుతోంది. ఈ క్రమంలో గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది. దీంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ కొద్ది సేపటి క్రితం మృతిచెందింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
‘త్రిపురాంతకం’ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ రూపొందించండి
ఎండోమెంట్ రీజనల్ జాయింట్ కమిషనర్‌ను కోరిన ఎమ్మెల్యే డేవిడ్‌రాజు త్రిపురాంతకం, ఒంగోలు కల్చరల్: త్రిపురాంతకంలోని పురాతన ఆలయాల అభివృద్ధికి అవసరమైన మాస్టర్‌ప్లాన్ తయారుచేసి పనులు చేపట్టాలని యర్రగొండపాలెం ఎమ్మెల్యే పాలపర్తి డేవిడ్‌రాజు ఎండోమెంట్ రీజనల్ జాయింట్ కమిషనర్ ఈ.శ్రీనివాసరావును కోరారు. మనగుడి కార్యక్రమంలో పాల్గొనేందుకు సోమవారం ఒంగోలుకు వచ్చిన రీజనల్ జాయింట్ కమిషనర్‌ను ఆయన కలుసుకొని త్రిపురాంతకేశ్వరస్వామి దేవస్థాన అభివృద్ధి చర్యల గురించి ప్రస్తావించారు. త్రిపురాంతకంలోని ఆలయాలకు రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు వస్తుంటారని..ఆలయాల అభివృద్ధి మాత్రం ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్నట్లు ఉందన్నారు. బాలా త్రిపురసుందరీదేవి ఆలయ గోపురంపై పిడుగుపడి ఎనిమిది నెలలైందని, ఇప్పటి వరకు ఎలాంటి మరమ్మతు పనులు చేపట్టలేదన్నారు. వెంటనే పనులు పూర్తి చేసి భక్తుల మనోభావాలను కాపాడాలని కోరారు. యాత్రికల అవసరాల మేర ఇక్కడ సౌకర్యాలు లేవని వాటిని మెరుగు పరచాలన్నారు. పార్వతి సమేత త్రిపురాంతకేశ్వరస్వామి ఆలయం వద్ద గోపుర నిర్మాణాలు, ఇతర అభివృద్ధి పనులను చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఆలయాల విషయంలో రాజకీయాలు తగవని అధికారులు దీనికి మాస్టర్ ప్లాన్ తయారుచేసి అభివృద్ధి పనులు పూర్తిచేయాలని కోరారు. మాస్టర్‌ప్లాన్‌ను ప్రైవేటు ఏజెన్సీ ద్వారా పూర్తి చేసేందుకు అప్పగించామని ఆర్జేసీ శ్రీనివాస్ తెలిపారు. అభివృద్ధి పనులకు ఆటంకాలు ఎక్కడున్నాయో గుర్తించి వాటిని తొలగించేందుకు చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. ఆలయాలకు రెగ్యులర్ ఈఓను నియమించాలని డేవిడ్‌రాజు సూచించారు. సమావేశంలో ఏసీ శ్రీనివాసులు, ఈఓ వెంకట్రావు, శ్రీశైలం ట్రస్టుబోర్డు చైర్మన్ సుబ్బారావు, మాజీ ఎంపీపీలు ఎన్ జయప్రకాష్, ఆళ్ల ఆంజనేయరెడ్డి, పార్టీ కన్వీనర్ పి చంద్రమౌళిరెడ్డి, యండ్రపల్లి సుబ్బారావు, సీతారామిరెడ్డి, వేగినాటి శ్రీనివాస్, భాస్కర్ తదితరులు ఉన్నారు. -
త్రిపురాంతకంలో బస్సు బోల్తా
-
త్రిపురాంతకంలో బస్సు బోల్తా: 15 మందికి గాయాలు
ప్రకాశం జిల్లా త్రిపురాంతకంలో కొండపైన కొలువైన త్రిపురాంతకేశ్వర స్వామి, బాల త్రిపురం సుందరీ దేవిలను దర్శించుకునేందుకు కొండపైకి వెళ్తున్న ప్రైవేట్ బస్సు శనివారం బోల్తా పడింది. ఆ ఘటనలో 15 మంది ప్రయాణికులు గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి ప్రయాణికులను బస్సు నుంచి బయటకు తీశారు. అనంతరం 108కు సమాచారం అందించారు. ఆ వాహనంలో క్షతగాత్రులను మార్కాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే వారిలో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు.