trs followers
-
కోదండరాం యాత్రను అడ్డుకున్న టీఆర్ఎస్
బిక్నూర్: కామారెడ్డి జిల్లా బిక్నూర్ మండలం బస్వాపూర్ వద్ద కోదండరామ్ యాత్రను టీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. కోదండరామ్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. ఈ రోజు నుంచి రెండు రోజుల పాటు కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లో అమరుల స్పూర్తి యాత్ర నిర్వహించేందుకు తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాం వచ్చారు. టీఆర్ఎస్ కార్యకర్తలకు సర్ధిచెప్పేందుకు కోదండరాం ప్రయత్నిస్తున్నారు. నిర్భంధించిన పోలీసులు కోదండరామ్ స్పూర్తి యాత్రను భిక్కనూరులో పోలీసులు అడ్డుకున్నారు. వాహనాలకు అనుమతులు లేవని పోలీసులు అడ్డుకోవడంతో రోడ్డుపై వేచి చూసిన ఆయన స్వయంగా మాట్లాడేందుకు పోలీసు స్టేషన్‌కు వెళ్లారు. తిరిగి బయటకు వెళ్ళే ప్రయత్నం చేస్తుండగా పోలీసులు గేట్లు మూసివేసి నిర్బంధించారు. పోలీసు స్టేషన్ ఆవరణలోనే చెట్టు కింద కూర్చున్న కోదండరామ్ నిరసన తెలిపారు. అనుమతి లేని మార్గంలో వచ్చారని, వాహనాలు కూడా ఎక్కువ తెచ్చారని సీఆర్పీసీ 151 కింద కేసు నమోదు చేశారు. సాయంత్రానికి కోదండరామ్‌ను విడుదల చేసే అవకాశం ఉంది. -
ఎంఐఎం, టీఆర్ఎస్ శ్రేణుల మధ్య తోపులాట
హైదరాబాద్: నగరంలోని రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని సులేమాన్‌నగర్ బస్తీ సమస్యలను తెలుసుకోవడానికి వెళ్లిన ఎమ్మెల్యేను స్థానిక ఎంఐఎం కార్పోరేటర్లు అడ్డుకున్నారు. అభివృద్ధి పనులు చేపట్టకుండా.. నియోజకవర్గంలో ఎలా పర్యటిస్తారని నిలదీశారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ అనుచరులు, ఎంఐఎం కార్పోరేటర్లు, కార్యకర్తలను అడ్డుకునే ప్రయత్నంలో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. -
నాగంను అడ్డుకున్న టీఆర్ఎస్ శ్రేణులు, ఉద్రిక్తత
మహబూబ్ నగర్ : మహబూబ్‌నగర్ ఆర్అండ్బీ గెస్ట్ హౌస్ వద్ద శనివారం ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీజేపీ నేత నాగం జనార్ధన్ రెడ్డి అక్కడ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అయితే సమావేశాన్ని టీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. నాగంకి వ్యతిరేకంగా నినాదాలు చేసినట్లు సమాచారం. దీంతో నాగం అనుచరులు, టీఆర్ఎస్ శ్రేణుల మధ్య ఘర్షణ జరిగింది. ఇరువర్గాల పరస్పరం తోపులాటకు దిగడంతో పోలీసులు పరిస్థితి అదుపు చేశారు. ఈ ఘర్షణతో ఆర్అండ్బీ కార్యాలయంలో ఫర్నిచర్ ధ్వంసమైంది. -
రాళ్లతో కొట్టుకున్న టీఆర్ఎస్, సీపీఐ కార్యకర్తలు
• టీఆర్ఎస్ కార్యకర్త మృతి.. ఎనిమిది మందికి గాయాలు • ఖమ్మం జిల్లా గూడురుపాడులో ఘటన.. పరిస్థితి ఉద్రిక్తం ఖమ్మం రూరల్: రాష్ట్ర ఆవిర్భావ వేడుకల సందర్భంగా బాణసంచా కాల్పుల్లో ఏర్పడిన చిన్న గొడవ ముదిరి టీఆర్ఎస్ - సీపీఐ కార్యకర్తలు పరస్పరం దాడులకు పాల్పడ్డారు. ఓ వర్గంపై మరో వర్గం వారు రాళ్లు రువ్వుకున్నారు, ఒకరినొకరు వెంబడించి కర్రలతో కొట్టుకుని గంట పాటు బీభత్సం సృష్టించారు. ఖమ్మం జిల్లా గూడురుపాడులో జరిగిన ఈ ఘటనలో సత్తి సంగం (60) అనే టీఆర్ఎస్ కార్యకర్త మరణించగా.. మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో 144 సెక్షన్ విధించారు. నిప్పు రవ్వలు పడ్డాయంటూ.. గురువారం ఉదయం గ్రామంలో రాష్ట్ర అవతరణ వేడుకలను నిర్వహించారు. జెడ్పీ చైర్పర్సన్ గడిపల్లి కవిత జాతీయ జెండాను, పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం టీఆర్ఎస్ స్థానిక నాయకులు ప్రధాన సెంటర్లో బాణసంచా కాల్చారు. దీనిపై సీపీఐ కార్యకర్తలు అభ్యంతరం వ్యక్తం చేశారు. నిప్పురవ్వలు తమ మీద పడ్డాయని, సమీపంలోని గడ్డివాములపై పడుతున్నాయంటూ టీఆర్ఎస్ కార్యకర్తలతో వాగ్వాదానికి దిగారు. కొద్దిసేపట్లోనే ఇరు పార్టీల వారు ఆగ్రహావేశాలతో పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. కర్రలతో దాడులకు పాల్పడ్డారు. దాదాపు గంటసేపు దాడులు, ప్రతిదాడులు కొనసాగాయి. ఈ దాడుల్లో సీపీఐ కార్యకర్తల వైపు నుంచి వచ్చిన ఓ రాయి.. టీఆర్ఎస్ కార్యకర్త సత్తి సంగం ఛాతిపై బలంగా తగిలింది. దీంతో ఆయన అక్కడికక్కడే కుప్పకూలిపోయి.. కొద్దిసేపట్లోనే మరణించాడు. దాడుల్లో మృతుడి సోదరుడు జానకితో పాటు కార్యకర్తలు గోకినపల్లి రామ్మూర్తి, మహేశ్, సైదమ్మ, కుర్రి తిరుపతిరావు, లిక్కి కోటేశ్వరరావు, వై. సతీష్, కె.మారుతిలకు గాయాలయ్యాయి. గంట తర్వాత వచ్చిన పోలీసులు మధ్యాహ్నం 2 గంటల సమయంలో మొదలైన దాడులు గంట తర్వాత సంగం మృతితో తగ్గాయి. ఈ గొడవ మొదలుకాగానే పోలీసులకు సమాచారం అందినా.. గంట సేపటి వరకూ అక్కడికి చేరుకోలేదు. ఘటన విషయం తెలుసుకున్న ఏఎస్పీ సాయికృష్ణ, డీఎస్పీ సురేష్‌కుమార్ గూడురుపాడుకు వచ్చి పరిస్థితిని సమీక్షించారు. గ్రామంలో 144 సెక్షన్ విధించారు. కాగా, దాడులకు పాల్పడ్డ సీపీఐ నేతలు, కార్యకర్తలపై చర్య తీసుకున్నాకే సంగం మృతదేహాన్ని తరలించాలంటూ టీఆర్ఎస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. దీంతో కాసేపు వారికి పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. చివరికి పోలీసులు టీఆర్ఎస్ కార్యకర్తలను బలవంతంగా పక్కకు తొలగించి.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. పరిస్థితి ఉద్రిక్తం సీపీఐ, టీఆర్ఎస్ వర్గాల వారు పరస్పరం దాదాపు గంట పాటు రాళ్లు రువ్వుకున్నారు. కర్రలతో దాడులకు పాల్పడుతూ యుద్ధ వాతావరణాన్ని సృష్టించడంతో ప్రజలు ఏం జరుగుతుందోనని భయకంపితులయ్యారు. ఇళ్లలో వారెవరూ బయటకు రాలేకపోయారు. ఘర్షణ సమయంలో రోడ్డుపై ఉన్నవారు ఎక్కడికక్కడ కిళ్లీ కొట్లు, చిన్న సందుల్లో దాక్కుని.. గొడవ సద్దుమణిగాక ఇళ్లలోకి పరుగులు తీశారు. -
టీఆర్ఎస్లో కుమ్ములాట
ఎమ్మెల్యే తీగల వర్సెస్ క్యాడర్ తీవ్ర స్థాయిలో విమర్శలు కార్యకర్తలపై ఎమ్మెల్యే ఆగ్రహం ఎమ్మెల్యేపై సీఎంకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్న నేతలు అసంతృప్తితో రగిలిపోతున్న గులాబీ శ్రేణులు మహేశ్వరం: తెలంగాణ రాష్ర్ట సమితిలో అసంతృప్తి జ్వాల జారుకుంది. ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు బహిరంగంగానే ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి తీరుపై టీఆర్ఎస్ మహేశ్వరం మండల అధ్యక్షుడు కూన యాదయ్యతో పాటు సీనియర్ నేతలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఎమ్మెల్యే పార్టీ నాయకులను, కార్యకర్తలను పట్టించుకోవడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. రెండేళ్ల కాలంలో ఎమ్మెల్యే నియోజకవర్గానికి చేసిందేమిలేదని ఆరోపణ అస్త్రాలు విసిరారు. దీనికి ప్రతిగా మీ అందరి బాగోతం నాకు తెలుసునని, ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ ఎమ్మెల్యే ప్రతిదాడి చేశారు. సమీక్ష సమావేశంలో రచ్చ తాగునీటి ఎద్దడిపై చర్చించేందుకు సోమవారం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీటీసీ సభ్యులు, సర్పంచ్‌లు, అధికారులతో ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశానికి హాజరైన టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కూన యాదయ్య మాట్లాడుతూ అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని, గ్రామాల్లో పార్టీ నేతలకు సమాచారం ఇవ్వకుండా కార్యక్రమాలు చేపడుతున్నారని ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు. ఎమ్మెల్యే స్పందిస్తూ ఇది పార్టీ కార్యకర్తల సమావేశం కాదని, తాగునీటి సమస్యపైనే మాట్లాడాలని సూచించడంతో పార్టీ నేతలంటే మీకు పట్టడం లేదని అసహనం వ్యక్తం చేశారు. దీంతో ఎమ్మెల్యే మళ్లీ కలగజేసుకుంటూ ‘ఏంటీ తమషా చేస్తున్నావ్..! పదేళ్లు సర్పంచ్‌గా, ఎంపీటీసీగా పనిచేసి ఏమి చేశావ్.. నీ సంగతి అందరికి తెలుసులే అంటూ తీవ్ర స్థాయి లో ధ్వజమెత్తారు. యాదయ్య కూడా అదే స్థాయిలో ఎమ్మెల్యేపై విరుచుపడ్డారు. దీంతో సమీక్ష సమావేశంలో గందరగోళ వాతావరణం నెలకొనడంతో ఎమ్మెల్యేతో పాటు సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, అధికారులు బయటకు వెళ్లిపోయారు. నేతలపై ఎమ్మెల్యే ఆగ్రహం సమావేశం నుంచి బయటకు వచ్చిన టీఆర్ఎస్ సినీయర్ నాయకులు హన్మగళ్ల చంద్రయ్య, వక్ఫ్‌బోర్డు మాజీ చైర్మన్ ఎంఏ సమీర్‌తో పాటు పలువురు నాయకులు మాట్లాడుతూ.. ‘మీ తీరు సరిగా లేదు.. అధికారుల ముందు పార్టీ నేతల ఇజ్జత్ తీయడం సరికాదంటూ ఎమ్మెల్యేలతో పేర్కొన్నారు. రెండేళ్లుగా నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి శూన్యమని, పార్టీ నేతలను కూడా పట్టించుకోకపోవడంతో ఆత్మను చంపుకుని పార్టీలో కొనసాగుతున్నామంటూ’వాగ్వాదానికి దిగారు. ఈ విషయమై సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. దీంతో ఆగ్రహానికి గురైన ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి తనదైన శైలిలో వారిపై విరుచుపడ్డారు. మీ ఇష్టం ఏమి చేసుకుంటారో చేసుకోండి అంటూ వారిపైకి చేయి ఎత్తాడు. పక్కనే ఉన్న పోలీసులు, పార్టీ నేతలు కలుగజేసుకుని అక్కడి నుంచి ఎమ్మెల్యేను పంపించి వేశారు. అనంతరం ఘట్టుపల్లి సర్పంచ్ రాకేష్‌రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చంద్రయ్యలు దూషించుకున్నారు. దీంతో పార్టీ నేతలు రెండు వర్గాలుగా విడిపోయారు.