రాళ్లతో కొట్టుకున్న టీఆర్‌ఎస్, సీపీఐ కార్యకర్తలు
• టీఆర్‌ఎస్ కార్యకర్త మృతి.. ఎనిమిది మందికి గాయాలు
• ఖమ్మం జిల్లా గూడురుపాడులో ఘటన.. పరిస్థితి ఉద్రిక్తం
ఖమ్మం రూరల్: రాష్ట్ర ఆవిర్భావ వేడుకల సందర్భంగా బాణసంచా కాల్పుల్లో ఏర్పడిన చిన్న గొడవ ముదిరి టీఆర్‌ఎస్ - సీపీఐ కార్యకర్తలు పరస్పరం దాడులకు పాల్పడ్డారు. ఓ వర్గంపై మరో వర్గం వారు రాళ్లు రువ్వుకున్నారు, ఒకరినొకరు వెంబడించి కర్రలతో కొట్టుకుని గంట పాటు బీభత్సం సృష్టించారు. ఖమ్మం జిల్లా గూడురుపాడులో జరిగిన ఈ ఘటనలో సత్తి సంగం (60) అనే టీఆర్‌ఎస్ కార్యకర్త మరణించగా.. మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో 144 సెక్షన్ విధించారు.
నిప్పు రవ్వలు పడ్డాయంటూ..
గురువారం ఉదయం గ్రామంలో రాష్ట్ర అవతరణ వేడుకలను నిర్వహించారు. జెడ్పీ చైర్‌పర్సన్ గడిపల్లి కవిత జాతీయ జెండాను, పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం టీఆర్‌ఎస్ స్థానిక నాయకులు ప్రధాన సెంటర్‌లో బాణసంచా కాల్చారు. దీనిపై సీపీఐ కార్యకర్తలు అభ్యంతరం వ్యక్తం చేశారు. నిప్పురవ్వలు తమ మీద పడ్డాయని, సమీపంలోని గడ్డివాములపై పడుతున్నాయంటూ టీఆర్‌ఎస్ కార్యకర్తలతో వాగ్వాదానికి దిగారు. కొద్దిసేపట్లోనే ఇరు పార్టీల వారు ఆగ్రహావేశాలతో పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. కర్రలతో దాడులకు పాల్పడ్డారు. దాదాపు గంటసేపు దాడులు, ప్రతిదాడులు కొనసాగాయి. ఈ దాడుల్లో సీపీఐ కార్యకర్తల వైపు నుంచి వచ్చిన ఓ రాయి.. టీఆర్‌ఎస్ కార్యకర్త సత్తి సంగం ఛాతిపై బలంగా తగిలింది. దీంతో ఆయన అక్కడికక్కడే కుప్పకూలిపోయి.. కొద్దిసేపట్లోనే మరణించాడు. దాడుల్లో మృతుడి సోదరుడు జానకితో పాటు కార్యకర్తలు గోకినపల్లి రామ్మూర్తి, మహేశ్, సైదమ్మ, కుర్రి తిరుపతిరావు, లిక్కి కోటేశ్వరరావు, వై. సతీష్, కె.మారుతిలకు గాయాలయ్యాయి.
గంట తర్వాత వచ్చిన పోలీసులు
మధ్యాహ్నం 2 గంటల సమయంలో మొదలైన దాడులు గంట తర్వాత సంగం మృతితో తగ్గాయి. ఈ గొడవ మొదలుకాగానే పోలీసులకు సమాచారం అందినా.. గంట సేపటి వరకూ అక్కడికి చేరుకోలేదు. ఘటన విషయం తెలుసుకున్న ఏఎస్పీ సాయికృష్ణ, డీఎస్పీ సురేష్‌కుమార్ గూడురుపాడుకు వచ్చి పరిస్థితిని సమీక్షించారు. గ్రామంలో 144 సెక్షన్ విధించారు. కాగా, దాడులకు పాల్పడ్డ సీపీఐ నేతలు, కార్యకర్తలపై చర్య తీసుకున్నాకే సంగం మృతదేహాన్ని తరలించాలంటూ టీఆర్‌ఎస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. దీంతో కాసేపు వారికి పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. చివరికి పోలీసులు టీఆర్‌ఎస్ కార్యకర్తలను బలవంతంగా పక్కకు తొలగించి.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.
పరిస్థితి ఉద్రిక్తం
సీపీఐ, టీఆర్‌ఎస్ వర్గాల వారు పరస్పరం దాదాపు గంట పాటు రాళ్లు రువ్వుకున్నారు. కర్రలతో దాడులకు పాల్పడుతూ యుద్ధ వాతావరణాన్ని సృష్టించడంతో ప్రజలు ఏం జరుగుతుందోనని భయకంపితులయ్యారు. ఇళ్లలో వారెవరూ బయటకు రాలేకపోయారు. ఘర్షణ సమయంలో రోడ్డుపై ఉన్నవారు ఎక్కడికక్కడ కిళ్లీ కొట్లు, చిన్న సందుల్లో దాక్కుని.. గొడవ సద్దుమణిగాక ఇళ్లలోకి పరుగులు తీశారు.