టీఆర్‌ఎస్‌లో కుమ్ములాట | mla teegala krishna reddy fires on trs followers | Sakshi
Sakshi News home page

టీఆర్‌ఎస్‌లో కుమ్ములాట

Published Tue, Mar 1 2016 1:09 PM | Last Updated on Wed, Mar 28 2018 11:26 AM

mla teegala krishna reddy fires on trs followers

 ఎమ్మెల్యే తీగల వర్సెస్ క్యాడర్
 తీవ్ర స్థాయిలో విమర్శలు
 కార్యకర్తలపై ఎమ్మెల్యే ఆగ్రహం
 ఎమ్మెల్యేపై సీఎంకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్న నేతలు
 అసంతృప్తితో రగిలిపోతున్న గులాబీ శ్రేణులు
 
మహేశ్వరం: తెలంగాణ రాష్ర్ట సమితిలో అసంతృప్తి జ్వాల జారుకుంది. ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు బహిరంగంగానే ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు.  రంగారెడ్డి జిల్లా మహేశ్వరం ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి తీరుపై టీఆర్‌ఎస్ మహేశ్వరం మండల అధ్యక్షుడు కూన యాదయ్యతో పాటు సీనియర్ నేతలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఎమ్మెల్యే పార్టీ నాయకులను, కార్యకర్తలను పట్టించుకోవడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. రెండేళ్ల కాలంలో ఎమ్మెల్యే నియోజకవర్గానికి చేసిందేమిలేదని ఆరోపణ అస్త్రాలు విసిరారు. దీనికి ప్రతిగా మీ అందరి బాగోతం నాకు తెలుసునని, ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ ఎమ్మెల్యే ప్రతిదాడి చేశారు. 
 
 సమీక్ష సమావేశంలో రచ్చ
తాగునీటి ఎద్దడిపై చర్చించేందుకు సోమవారం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీటీసీ సభ్యులు, సర్పంచ్‌లు, అధికారులతో ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశానికి హాజరైన టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు కూన యాదయ్య మాట్లాడుతూ అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని, గ్రామాల్లో పార్టీ నేతలకు సమాచారం ఇవ్వకుండా కార్యక్రమాలు చేపడుతున్నారని ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు. ఎమ్మెల్యే స్పందిస్తూ ఇది పార్టీ కార్యకర్తల సమావేశం కాదని, తాగునీటి సమస్యపైనే మాట్లాడాలని సూచించడంతో పార్టీ నేతలంటే మీకు పట్టడం లేదని అసహనం వ్యక్తం చేశారు. దీంతో ఎమ్మెల్యే మళ్లీ కలగజేసుకుంటూ ‘ఏంటీ తమషా చేస్తున్నావ్..!  పదేళ్లు సర్పంచ్‌గా, ఎంపీటీసీగా పనిచేసి ఏమి చేశావ్.. నీ సంగతి అందరికి తెలుసులే అంటూ తీవ్ర స్థాయి లో ధ్వజమెత్తారు. యాదయ్య కూడా అదే స్థాయిలో ఎమ్మెల్యేపై విరుచుపడ్డారు. దీంతో సమీక్ష సమావేశంలో గందరగోళ వాతావరణం నెలకొనడంతో ఎమ్మెల్యేతో పాటు సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, అధికారులు బయటకు వెళ్లిపోయారు. 
 
 నేతలపై ఎమ్మెల్యే ఆగ్రహం
 సమావేశం నుంచి బయటకు వచ్చిన టీఆర్‌ఎస్ సినీయర్ నాయకులు హన్మగళ్ల చంద్రయ్య, వక్ఫ్‌బోర్డు మాజీ చైర్మన్ ఎంఏ సమీర్‌తో పాటు పలువురు నాయకులు మాట్లాడుతూ.. ‘మీ తీరు సరిగా లేదు.. అధికారుల ముందు పార్టీ నేతల ఇజ్జత్ తీయడం సరికాదంటూ ఎమ్మెల్యేలతో పేర్కొన్నారు. రెండేళ్లుగా నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి శూన్యమని, పార్టీ నేతలను కూడా పట్టించుకోకపోవడంతో ఆత్మను చంపుకుని పార్టీలో కొనసాగుతున్నామంటూ’వాగ్వాదానికి దిగారు. ఈ విషయమై సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. దీంతో ఆగ్రహానికి గురైన ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి తనదైన శైలిలో వారిపై విరుచుపడ్డారు. మీ ఇష్టం ఏమి చేసుకుంటారో చేసుకోండి అంటూ వారిపైకి చేయి ఎత్తాడు. పక్కనే ఉన్న పోలీసులు, పార్టీ నేతలు కలుగజేసుకుని అక్కడి నుంచి ఎమ్మెల్యేను పంపించి వేశారు. అనంతరం ఘట్టుపల్లి సర్పంచ్ రాకేష్‌రెడ్డి, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు చంద్రయ్యలు దూషించుకున్నారు. దీంతో పార్టీ నేతలు రెండు వర్గాలుగా విడిపోయారు. 
 
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement