కేసీఆర్... ముక్కు నేలకు రాస్తావా?
తనపై టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ చేసిన ఆరోపణలపై టీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య స్పందించారు. తాను భూ ఆక్రమణలకు పాల్పడినట్లు కేసీఆర్ ఆరోపిస్తున్నారు.... అందుకు తాను విచారణకు సిద్ధంగా ఉన్నానని పొన్నాల స్పష్టం చేశారు. ఆదివారం గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో పొన్నాల మాట్లాడారు. తాను భూ ఆక్రమణలకు పాల్పడినట్లు కేసీఆర్ ఆరోపణలు చేస్తున్నారు.... విచారణకు తాను సిద్ధంగానే ఉన్నా... ఓ వేళ తనపై ఆరోపణలను నిరూపించలేకపోతే ముక్కు నేలకు రాసి క్షమాపణలు చెబుతావా అంటూ కేసీఆర్‌కు పొన్నాల సవాల్ విసిరారు.
తెలంగాణ ఉద్యమాన్ని సాకుగా చూపి తాను కేసీఆర్‌లా కోట్లాది రూపాయిలు సంపాదించుకోలేదన్నారు. అలాగే కేసీఆర్‌లా పైసలు వసూలు... దొంగ పాస్‌పోర్టులు దందా... మనుషుల అక్రమ రవాణ వంటి అసాంఘిక కార్యకలాపాలు తాను చేయలేదని పొన్నాల గాంధీ భవన్లో స్పష్టం చేశారు. తెలంగాణలో ఒక్క ఓడరేవు లేదు.... అయినా తనకు షిప్పింగ్ శాఖ మంత్రి పదవి కావాలని కేసీఆర్ పట్టుబట్టారని పొన్నాల ఈ సందర్బంగా గుర్తు చేశారు.
ఆ మంత్రి పదవి కోసం ఆయన ఎందుకు అంతా పట్టుబట్టారో అర్థం కావడం లేదన్నారు. కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా తెలంగాణ ప్రాంతానికి ఏం ఒరగబెట్టావంటూ కేసీఆర్‌ను పొన్నాల ప్రశ్నించారు. ఉద్యోగులపై కేసీఆర్ మొసలికన్నీరు కారుస్తున్నారని ఎద్దేవా చేశారు. ఆయన సొంత సంస్థల్లోని ఉద్యోగులకే పీఎఫ్ ఇవ్వడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మిక చట్టాలను ఉల్లంఘిస్తున్న కేసీఆర్ సంస్థలపై తాము అధికారంలోకి రాగానే విచారణ జరిపిస్తామని పొన్నాల లక్ష్మయ్య తెలిపారు.