ట్రంప్ యూనివర్శిటీ ఓ తప్పుల తడక
కాలిఫోర్నియా: అమెరికా అధ్యక్ష పదవికి రిపబ్లికన్ అభ్యర్థిగా ముందుకు దూసుకుపోతున్న డొనాల్డ్ ట్రంప్ పరువు తీసే వార్తలు వెలుగులోకి వచ్చాయి. డొనాల్డ్ ట్రంప్ 2005లో ఏర్పాటు చేసిన ‘ఫర్ ప్రాఫిట్ స్కూల్’ యూనివర్శిటీ నీతి నియమాలు ఇసుమంతా కూడా లేని ఓ తప్పుల తడక యూనివర్శిటీ అన్న వార్తలు కీలక దశలో ప్రజల ముందుకు వచ్చాయి.
ఆ యూనివర్శిటీలో దుర్భలులైన విద్యార్థుల నుంచి లక్షలాది రూపాయలను ఫీజుల కింద ముక్కు పిండి వసూలు చేసే వారని, అర్హతలు లేని వ్యక్తులను ఇన్స్ట్రక్టర్లుగా నియమించి రెండు చేతులా డబ్బులు దండుకున్నారని యూనివర్శిటీ మాజీ మేనేజర్లే స్వయంగా కోర్టు ముందు వాంగ్మూలం ఇచ్చారు. కాలిఫోర్నియా కోర్టు ఉత్తర్వుల మేరకు ఈ వాంగ్మూలాలను మంగళవారం బహిర్గతం చేశారు.
తమకు యూనివర్శిటీలో అన్యాయం జరిగిదంటూ కొంత మంది మాజీ విద్యార్థులు ట్రంప్ యూనివర్శిటీపై ఫెడరల్ కోర్టులో కేసు దాఖలు చేయగా, యూనివర్శిటీ మాజీ ఉద్యోగులు కోర్టు ముందు హాజరై వాంగ్మూలాలు ఇచ్చారు. ఆర్థిక స్థోమతలేని ఓ దంపతులు యూనివర్శిటీలో చేరేందుకు 35 వేల డాలర్లు చెల్లించిన నాటి సంఘటన గురించి మాజీ యూనివర్శిటీ మేనేజర్ ష్నాకెన్బర్గ్ తన వాంగ్మూలంలో గుర్తు చేశారు.
తాను వారి ఆర్థిక స్థోమతను పరిగణలోకి తీసుకొని యూనివర్శిటీలో చేరేందుకు వారిని బలవంతం చేయలేదని, అందుకు తాను ట్రంప్ నుంచి తిట్లు తినాల్సి వచ్చిందని ఆయన చెప్పారు. ఆ తర్వాత మరో సేల్స్ మేన్ వారిని ఒప్పించి యూనివర్శిటీలో చేర్పించారని ఆయన వివరించారు. ఆ యూనివర్శిటీయే ఓ పెద్ద అబద్ధమని తాను పూర్తిగా విశ్వసిస్తున్నానని చెప్పారు.
అమెరికాలో రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరుగా సాగుతున్న రోజుల్లో ట్రంప్ ఈ యూనివర్శిటీని ఏర్పాటు చేశారు. అతి తక్కువ కాలంలో కోట్లాది రూపాయలు ఎలా సంపాదించాలో చిట్కాలు ఇస్తానని, ఇతర బిజినెస్ స్కూళ్లకన్నా గొప్పగా పాఠాలు ఉంటాయంటూ విస్తృత ప్రచారం ద్వారా వందలాది మంది విద్యార్థులను ఆయన బుట్టలో వేశారు.
స్కూల్‌కు మేనేజర్‌గా వ్యవహరించాల్సిన ఆయన చీఫ్ ప్రమోటర్‌గా వ్యవహరించారు. భారీ ఫీజులు కట్టలేని విద్యార్థులను వివిధ బ్యాంకుల నుంచి క్రెడిట్ కార్డులు తీసుకోవాల్సిందిగా ప్రోద్బలం చేసి తన స్కూల్ ఫీజులు కట్టించుకునేవారని మాజీ విద్యార్థులు తమ వాంగ్మూలాల్లో ఆరోపించారు. ఎలాంటి విద్యార్హతలు లేని వారిని కూడా యూనివర్శిటీలో ఇన్స్ట్రక్లర్లుగా తీసుకున్నారని, జ్యువలరీ షాపులో పనిచేసిన ఓ వ్యక్తిని ట్రంప్ ఇన్‌స్ట్రక్టర్‌గా నియమించారని యూనివర్శిటీ మాజీ ఉద్యోగి సోమ్మర్ కోర్టుకు తెలిపారు.