ఖాజాబీ మృతిపై న్యాయ విచారణ : సామినేని
నందిగామ చేరిన మృతదేహం
ప్రముఖుల సందర్శన, నివాళులు
దోషులను అరెస్టు చేయాలని రాస్తారోకో
నందిగామ, న్యూస్‌లైన్ : పేద కుటుంబంలో పుట్టి ఎంతో ఉన్నతస్థాయికి ఎదిగి అర్ధాంతరంగా మృత్యుకౌగిలికి చేరిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఖాజాబీ మృతిపై పూర్తిస్థాయి విచారణ నిర్వహించి నిజానిజాలు తేల్చాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాను డిమాండ్ చేశారు. మృతురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నట్లు ఎవరైనా ఆమెను ఆత్మహత్యకు పురికొల్పినట్లయితే...దోషులను కఠినంగా శిక్షించాలన్నారు.
ఆదివారం నందిగామకు చేరుకున్న ఖాజాబీ మృతదేహాన్ని ఆయన సందర్శించి పూలమాలలు వేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. ప్రభుత్వ అధికారుల వైఫల్యం వలనే ఇటువంటి సంఘటనలు పునరావృతం అవుతున్నాయని చెప్పారు. వైఎస్సార్సీపీ నందిగామ సమన్వయకర్త డాక్టర్ మొండితోక జగన్మోహనరావు మాట్లాడుతూ ఈమెపై ఘాతుకానికి పాల్పడ్డారనే ఆరోపణలు నిజమైతే భర్తను. వారి బంధువులను కఠిన శిక్షించాలని డిమాండ్ చేశారు.
కన్నీరు మున్నీరు...
నందిగామ చేరుకున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఖాజాబీ మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు, బంధువులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఆమెను చూసేందుకు పట్టణంలోని పలు రాజకీయ పార్టీల నాయకులు, ముస్లింలు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. భర్తే హింసించి తమ బిడ్డను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నాడని ఖాజాబీ తల్లిదండ్రులు సయ్యద్‌లాల్, గుల్షా ఆరోపిస్తున్నారు.
మృతురాలి భర్త, ఖమ్మం జిల్లా ఖాజీపురానికి చెందిన మాజీ సర్పంచి షేక్ మహ్మద్ ఆలీషా, సర్పంచి మహ్మద్ నజీర్ మహారాష్ట్ర పోలీసులకు భారీ ఎత్తున ముడుపులు ఇచ్చి తమకు సహకరించకుండా చేశారని ఆరోపించారు. మృతురాలి శరారంపైనుంచి బట్టలు తీసి పది గంటల పాటు అలాగే ఉంచారని, కనీసం వేరే బట్టలు మృతదేహంపై కప్పలేదని ఆరోపించారు. అక్కడ పోలీస్ అధికారులు తమకు సహకరించకపోగా నేరానికి పాల్పడిన ఖాజాబీ భర్త మునీబ్‌కు అండగా నిలిచారని వాపోయారు.
దోషులను శిక్షించాలని రాస్తారోకో...
ఖాజాబీ మృతికి కారకులైన వారిని వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని కోరుతూ నందిగామ 65వ నెంబర్ జాతీయ రహదారిపై మృతురాలి తల్లి, బంధువులు, పలు రాజకీయ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఖాజాబీకి నివాళులర్పించిన వారిలో వివిధ పార్టీలకు చెందిన నెలకుదిటి శివనాగేశ్వరరావు, తాటి రామకృష్ణారావు, చెరుకూరి సాంబశివరావు, లగడపాటి వీరయ్య, గాదెల వెంకటేశ్వరరావు, రబ్బానీ, ఫాతిమా, వేల్పుల పరమేశ్వరరావు, షేక్ జాఫర్, ఆచంట సునీత, కన్నెగంటి జీవరత్నం, కొండూరు వెంకట్రావ్, ఖాజా తదితరులున్నారు.
అంత్యక్రియలు....
ఖాజాబీ మృతదేహానికి నందిగామ పెద్ద మసీదు శ్మశానంలో ఆదివారం అంత్యక్రియలు నిర్వహించా రు. ఆమెది ఆత్మహత్య కాదని, భర్తే హత్య చేశాడని ఆరోపిస్తూ తల్లిదండ్రులు ఫిర్యాదు చేయగా, పూణేలోని పోలీసులు కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని ఆమె తల్లిదండ్రులకు అప్పగించగా, ఆదివారం సాయంత్రం నందిగామకు తరలించారు. సాయంత్రం 6.30 గంటల సమయంలో ఆమె మృతదేహాన్ని పెద్ద మసీదులో శ్మశానంలో ఖననం చేశారు.