TS Elections Counting Round Wise
-
సీఎం ఎవరు.. ఎప్పటిలోగా..?
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారి కాంగ్రెస్ అధికారం చేజిక్కించుకుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాడ్డాక తొలి రెండు పర్యాయాలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు కాగా, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి సిద్ధమైంది. తెలంగాణ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అత్యధిక సీట్లలో విజయంతో ప్రభుత్వ ఏర్పాటుకు సన్నద్ధమవుతోంది. అయితే, కాంగ్రెస్ నుంచి సీఎం ఎవరు అనే దానిపై చర్చ మొదలైంది. కాంగ్రెస్‌లో ఎంతోమంది సీనియర్ లీడర్లు ఉండగా, ప్రస్తుతం ఇద్దరి నాయకుల పేర్లే వినిపిస్తున్నాయి. వారిలో ఒకరు పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి కాగా, ఇంకొకరు సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క. కొడంగల్ నుంచి రేవంత్‌రెడ్డి గెలుపొందగా, మధిర(ఎస్సీ) నియోజకవర్గం నుంచి మల్లు భట్టి విక్రమార్క విజయం సాధించారు. వీరిద్దరిలో ఎవరో ఒకరకి సీఎం పదవిని కేటాయించే అవకాశాలు కనబడుతున్నాయి. కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న స్వల్ప సమయంలోనే టీపీసీసీ పగ్గాలు చేపట్టిన రేవంత్‌రెడ్డి.. తన మార్కు రాజకీయాలతో బీఆర్ఎస్ ప్రభుత్వంపై విరుచుకుపడుతూ వచ్చారు. అవకాశం చిక్కినప్పుడల్లా బీఆర్ఎస్ను టార్గెట్ చేస్తూ కాంగ్రెస్‌లో జోష్ నింపే యత్నం చేశారు. మరోవైపు మల్లు భట్టి విక్రమార్క తన పాదయాత్రతో కాంగ్రెస్‌కు మరింత ఊపు తెచ్చిన నాయకుడు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు అత్యంత వీర విధేయుడుగా ఉన్న నేత మల్లు. సీఎం పదవిపై తన మనసులోని మాటను కూడా బయటపెట్టారు మల్లు. సీఎం పదవి ఇస్తే గౌరవంగా స్వీకరిస్తానని ఎన్నికల ఫలితాల తర్వాత మల్లు వ్యాఖ్యానించారు. అంటే తాను కూడా సీఎం రేసులో ఉన్నాననే మనసులో మాటను ఎట్టకేలకు వెల్లడించారు. మరొకవైపు కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించిన డీకే శివకుమార్‌కు రేవంత్‌రెడ్డికి మంచి సాన్నిహిత్యమే ఉంది. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కొన్ని కీలక బాధ్యతలను డీకే శివకుమార్‌కు కాంగ్రెస్ అధిష్టానం అప్పగించి ఆయనపై ఎంతో విశ్వాసం ఉంచింది. ఈ తరుణంలో రేవంత్‌రెడ్డికి సీఎం పదవి రావాలంటే డీకే శివకుమార్ తప్పకుండా అనివార్యం కావొచ్చు. ఎప్పటిలోగా..? కర్ణాటకలో సీఎం పదవి ఇచ్చే క్రమంలో కాంగ్రెస్ అధిష్టానం పెద్దగా సమయం తీసుకోలేదు. కేవలం మూడు రోజుల్లోనే సిద్ధరామయ్యను ఎంపిక చేసింది. అక్కడ కూడా డీకే శివకుమార్ నుంచి సిద్ధరామయ్య పోటీ ఎదురైంది. అయితే చివరి నిమిషంలో సీఎంగా సిద్ధరామయ్యను ఎంపిక చేసి, డీకేకు డిప్యూటీ సీఎం పోస్టు ఇచ్చారు. దీనికి డీకే శివకుమార్‌ను ఒప్పించడంలో కాంగ్రెస్ అధిష్టానం చాలా స్వల్ప వ్యవధిలోనే సక్సెస్ అయ్యింది. మరి తెలంగాణ సీఎం పోస్ట్ విషయంలో కాంగ్రెస్ ఎంత సమయం తీసుకుంటుదంనేదే ఇప్పుడు అందరి నోట వినిపిస్తున్నమాట. కర్ణాటక తరహాలో అతి తొందరగా నిర్ణయం తీసుకుంటుందా.. లేక నాన్చుడు ధోరణి అవలంభిస్తుందా? అనేది చూడాలి. లిస్టు చాలానే ఉంది.. వారిని బుజ్జగించేది ఎలా? తెలంగాణ కాంగ్రెస్‌లో సీనియర్ లీడర్లకు కొదువలేదు. వీరిలో చాలా మంది సీఎం పదవి కోసం చూస్తున్న ఆశావహులు చాలా మందే ఉన్నారు. రేవంత్‌రెడ్డి, మల్లు భట్టి విక్రమార్కలతో పాటు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జానారెడ్డి, శ్రీధర్‌బాబు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మందే ఉన్నారు. వీరంతా సీఎం పదవి కోసం వాళ్ల ప్రయత్నాలు కచ్చితంగా చేస్తారు. దీని కోసం గళాన్ని గట్టిగా వినిపించడానికి సిద్ధమవుతారనడంలో ఎటువంటి సందేహం లేదు. మరి వీరిని ఎలా డీల్ చేస్తుందనేది ఇప్పుడు కాంగ్రెస్ అధిష్టానం ముందున్న సమస్య. కర్ణాటక తరహాలో నిర్ణయాన్ని డైరెక్ట్‌గా తీసుకుని వారికి భరోసా ఇస్తే సరిపోతుందా.. లేక వారిని బుజ్జగించడానికి సమయం పడుతుందా అనేది ఇప్పుడు చర్చకు తెరతీసింది. ఒకవేళ సీఎం పదవి కోసం ఏమైనా వివాదం ఏర్పడితే మాత్రం కాంగ్రెస్ అధిష్టానం దీనిపై సీరియస్‌గా ఫోకస్ పెట్టక తప్పదు..! -
మంత్రి పువ్వాడకు భారీ షాక్
ఖమ్మం: ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గంలో మంత్రి, బీఆర్ఎస్ అభ్యర్థి పువ్వాడ అజయ్ కుమార్‌కు భారీ షాక్ తగిలింది. నువ్వా-నేనా అన్నట్లు తలపడిన ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి, సీనియర్ నేత తుమ్మల నాగేశ్వరరావు విజయం సాధించారు. కచ్చితంగా ఈ సీటు గెలుస్తామనే పువ్వాడ ఆది నుంచి ధీమాగా ఉన్నప్పటికీ కాంగ్రెస్ జోష్‌లో ఆయనకు ఓటమి తప్పలేదు. బీఆర్ఎస్ నుంచి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మూడోసారి పోటీ చేశారు. ఖమ్మం సీటుపై ఆది నుంచి టార్గెట్ చేసిన కాంగ్రెస్.. అదే జోరును కడవరకూ కొనసాగించింది. కాంగ్రెస్‌లో తుమ్మల బలమైన నేత కావడం కూడా ఆ పార్టీకి కలిసొచ్చింది.ప్రభుత్వ వ్యతిరేక ఓటును తనవైపు తిప్పుకోవడంలో తుమ్మల సక్సెస్ అయ్యారు. ఎన్నికల ప్రచారహోరులో కూడా వీరిద్దరూ హోరీహోరీనే తలపించారు. ఇద్దరూ కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేతలే కావడంతో ఇక్కడ లోకల్ గా పొలిటికల్ వార్ మరింత ఆసక్తిని పెంచింది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు.. ఎన్నికల్లో పాలేరు నుంచి బీఆర్ఎస్ తరుపున పోటి చేసి ఓటమి పాలయ్యారు. ఈసారి కూడ ఓడితే పొలిటికల్‌గా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉండటంతో ఈ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రయత్నించారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి 40 ఏళ్ల రాజకీయాలకు ఘనంగా వీడ్కోలు పలకాలనే ఉద్దేశంతో పనిచేశారు. ఇవే తనకు చివరి ఎన్నికలు అని చెప్పి కూడా ప్రచారానికి వెళ్లారు. దానికి తోడు కాంగ్రెస్ జోరు కూడా తోడవడంతో ఖమ్మం నియోజకవర్గంలో విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గంలో మొత్తం 3,15, 801 మంది ఓటర్లు ఉండగా, అందులో పురుష ఓటర్లు 1,51, 673 మంది ఉన్నారు. మహిళా ఓటర్లు 1,64, 006 మంది ఉండగా, ట్రాన్స్ జెండర్లు 47 మంది ఉన్నారు. ఇందులో సుమార 48 వేల ఓట్లు కమ్మ సామాజిక వర్గానికి చెందినవే ఉన్నాయి. 2014లో కాంగ్రెస్ తరపున పోటీ చేసిన పువ్వాడ అజయ్‌కుమార్...టీడీపీ తరపున పోటీ చేసిన తుమ్మల నాగేశ్వరరావును సుమారు 6 వేల ఓట్ల తేడాతో ఓడించారు. ఆ తర్వాత ఇద్దరూ గులాబీ పార్టీలో చేరిపోయారు. తుమ్మల నాగేశ్వరరావు 2016లో పాలేరుకు జరిగిన ఉప ఎన్నికలో అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 2018 సాధారణ ఎన్నికల్లో పాలేరు నుంచి తుమ్మల మళ్ళీ ఓటమి చెందారు. పువ్వాడ అజయ్ 2018 ఎన్నికల్లో ఖమ్మం నుంచి విజయం సాధించి కేసీఆర్ రెండో మంత్రివర్గంలో మంత్రి పదవి పొందారు. కాంగ్రెస్‌లో చేరిన తుమ్మల నాగేశ్వరరావు మళ్ళీ తన పాత ప్రత్యర్థితోనే ఖమ్మంలో తలపడ్డారు. ఇక బీజేపీ-జనసేనల పొత్తులో భాగంగా ఇక్కడ జనసేనకు టికెట్ కేటాయించారు. జనసేన తరఫున మిర్యాల రామకృష్ణ బరిలో నిలిచారు. ఇక సీపీఎం నుంచి యర్ర శ్రీకాంత్ పోరుకు సిద్ధమయ్యారు. కాంగ్రెస్‌తో పొత్తు కుదరకపోవడంతో సీపీఎం నేరుగా పోరుకు దిగింది. -
అత్త వ్యూహం.. కోడలు విజయం
పాలకుర్తి: ఓటమి ఎరుగని నేతగా పేరు తెచ్చుకున్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుకు ఈసారి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ముందునుంచి ఊహించినట్లే పాలకుర్తి నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి ఎర్రబెల్లిపై కాంగ్రెస్ అభ్యర్థి యశస్విని రెడ్డి విజయం సాధించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పాలకుర్తి నియోజకవర్గంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును ఓడించేందుకు కాంగ్రెస్ పక్కా ప్లాన్‌తో ముందుకు వెళ్లింది. ఈ నేపథ్యంలో పాలకుర్తి సీటు ఎంపికలో ఆ నియోజకవర్గ ఇంచార్జిగా ఉన్న హనుమాండ్ల ఝాన్సీరెడ్డి .. చివరి నిమిషంలో ఆమె కోడలు యశస్వినిని బరిలోకి దింపారు. అత్త వ్యూహం.. కోడలు విజయం పాలకుర్తి నియోజక వర్గం కాంగ్రెస్ పార్టీ తరఫున అభ్యర్థిగా హనుమాండ్ల ఝాన్సీ రెడ్డి బరిలో దిగుతారని అందరూ ఆశించారు. అయితే. చివరి నిమిషంలో ఝాన్సీ భారత పౌరసత్వంపై స్పష్టమైన ఆదేశాలు రాకపోవడంతో ఝాన్సీరెడ్డి కుటుంబ సభ్యురాలైన యశస్వినినికే కాంగ్రెస్ టికెట్ కేటాయించింది. దీనిపై సర్వత్రా చర్చ కూడా జరిగింది. పాలకుర్తి నియోజకవర్గంలో తిరుగులేని ఎమ్మెల్యేగా రాణిస్తూ మంత్రిగా కొనసాగుతున్న ఎర్రబెల్లి దయాకర్‌రావుకు చెక్‌పెట్టేలా టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి అనూహ్యంగా ఎన్ఆర్ఐ ఝాన్సీలక్ష్మీరెడ్డిని రంగంలోకి దింపారు. ఇలాంటి తరుణంలోనే ఝాన్సీలక్ష్మీరెడ్డి భారత దేశ పౌరసత్వంపై వివాదం తలెత్తింది. వారం రోజుల వరకూ తనకు పౌరసత్వం వస్తుందనీ, ఏలాంటి అపోహాలకు గురికావద్దన్న ఝాన్సీరెడ్డి ప్రత్యామ్నయంగా తన కోడలును ఎన్నికల సమరంలో దింపేందుకు రంగం సిద్ధం చేసుకుంది. వాస్తవానికి హనుమాంఢ్ల ఝాన్సీరెడ్డి పౌరసత్వం అడ్డోస్తే దేవరుప్పుల మండలం మాధాపురంకు చెందిన ప్రముఖవైద్యులు, టీపీసీసీ సభ్యులు డాక్టర్ లాకావత్ లక్ష్మీనారాయణనాయక్ రావడం అనివార్యంగా బావించారు. కానీ పాలకుర్తి నుంచి కాంగ్రెస్ జెండా ఎగురవేసే లక్ష్యంగా ఇక్కడి ప్రజలకు సేవ చేసేందుకు వచ్చిన తన కుటుంబం తగ్గేదీలేదని ఎట్టకేలకు తన కోడలు యశస్వినికి రెండో విడతలో కాంగ్రెస్ టికెటు సాధించడంలో సఫలీకృతమయ్యారు ఝాన్సీరెడ్డి, అప్పటివరకూ తానొక్కతే ప్రచారంలో దూసుకపోతున్న క్రమంలో తోడుగా కోడలు రావడంతో కొంత పార్టీ శ్రేణుల్లో నైరాశ్యం నెలకొన్నప్పటీకీ డబుల్ ప్రచారంతో ప్రభుత్వ వ్యతిరేకతను కలిగిన ప్రజల్ని కూడగట్టుకొని చారిత్రాత్మక విజయం సాధించి ఝూన్సీరెడ్డి తనమార్కు నిలుపుకున్నారు. ఫలితంగా తొలిసారి పోటీ చేసి గెలుపును సొంతం చేసుకోవడంతో యశస్విని అరుదైన ఘనతసు సొంతం చేసుకున్నారు. ఆది నుంచి ఎర్రబెల్లే టార్గెట్.. ఎర్రబెల్లిని కచ్చితంగా ఓడించాలనే వ్యూహంతో ఆది నుంచి పావులు కదిపిన కాంగ్రెస్ తన వ్యూహాన్ని కచ్చితంగా అమలు చేసింది. ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లింది కాంగ్రెస్. యశస్విని కూడా తన ఎన్నికల ప్రచారంలో ఎర్రబెల్లిపై పదునైన విమర్శలు చేసి ఓటర్లను ఆకర్షించింది. దానికి తోడు కాంగ్రెస్ జోష్ కూడా తోడవడంతో ఆమె గెలుపు సునాయాసమైంది. ఇక పాలకుర్తి నుంచి ఎర్రబెల్లి దయాకర్ రావు ఇప్పటికి మూడుసార్లు ప్రాతినిధ్యం వహించారు. .ఎర్రబెల్లికి ఈ నియోజకవర్గంపై మంచి పట్టు ఉంది. కానీ అది ఈసారి కలిసి రాలేదు. కాంగ్రెస్ జోరు ముందు ఎర్రబెల్లి పరాజయం చెందారు. మరొకవైపు బీజేపీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన రామ్మోహన్రెడ్డ పెద్దగా ప్రభావం చూపలేదు. తొలి జాబితాలోనే సీటు దక్కించుకని ప్రచారాన్ని ఆదిలోనే ప్రారంభించినా ప్రభుత్వ వ్యతిరేక ఓటు మాత్రం కాంగ్రెస్‌కే షిప్ట్ అయ్యింది.